
‘యశ్ భారతి’పై కన్నేసిన యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు కొనసాగుతోంది.
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు కొనసాగుతోంది. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా ఆయన దృష్టి ఈసారి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యశ్ భారతి సమ్మాన్’ పై పడింది. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు, అప్పటి సీఎం యులాయం సింగ్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అవార్డుల వ్యవహారంపై విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విచారణకు ఆదేశించారు. అవార్డుల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సీఎం విచారణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ అవార్డును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన యోగీ ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగంపై దృష్టి పెట్టారు.
కాగా 1994లో యశ్ భారతి సమ్మాన్ అవార్డును ములాయం ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆ రాష్టంలో వివిధ రంగాల్లో కృషి చేసినవారికి అవార్డుతో పాటు రూ.11 లక్షల నగదుతో పాటు నెలకు 50 వేల రూపాయల పెన్షన్ ను జీవిత కాలం అందిస్తోంది. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ తండ్రి ప్రముఖ కవి, రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్‌కు 1994లో ‘యశ్ భారతి’ బిరుదును ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందించింది. దీంతో ఈ పథకం కింద అమితాబ్, ఆయన సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక్కొక్కరు నెలకు 50 వేల రూపాయల పెన్షన్ పొందడానికి అర్హులయ్యారు.
అయితే ఈ డబ్బును పేదల కోసం ఖర్చు చేయాల్సింది ఆ కుటుంబం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కాగా స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో గత యూపీ సర్కారు నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ అవార్డును అందుకున్నవారిలో అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శుభా ముద్గల్, కైలాష్ ఖేర్, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు ఉన్నారు. అయితే ములాయం అనంతరం అధికారంలోకి వచ్చిన మాయవతి ఆ అవార్డును నిలిపివేయగా, మళ్లీ అఖిలేష్ సర్కార్ యశ్ భారతి సమ్మాన్ అవార్డును పునరుద్దరించింది.