మోదీతో ములాయం గుసగుసలు
లక్నో: రాజకీయ విభేదాలను, ఎన్నికల ప్రచారంలో చేసుకున్న దూషణలను పక్కనపెట్టి సమాజ్‌వాదీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌లు యోగి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తండ్రీకొడుకులు మోదీ వద్దకు వెళ్లడం, పరస్పరం పలకరించుకోవడం కనిపించింది. మోదీ అఖిలేశ్‌తో కరచాలం చేసి భుజం తట్టారు. పలకరింపుగా తన చేతులు పట్టుకున్న మోదీతో ములాయం ఏదో గుసగుసగా చెప్పారు. ప్రధాని ఆయన చెప్పినదాన్ని శ్రద్ధగా విన్నారు. కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి రాలేదు.
యూపీ అభివృద్ధే ఏకైక లక్ష్యం: మోదీ
న్యూఢిల్లీ: యూపీ అభివృద్ధే యోగి ప్రభుత్వ ఏకైక లక్ష్యం, ఉద్దేశమని మోదీ చెప్పారు. అతివాద హిందుత్వనేత అయిన యోగి అధికారంలోకి రావడంపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించేందుకుఈమేరకు పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ‘మా ఏకైక లక్ష్యం, ఉద్దేశం అభివృద్ధే. యూపీ అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి అవుతుంది. యూపీ యువతకు సేవ చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. ప్రజల ఆశీస్సులు, బీజేపీ కార్యకర్తల కఠిన శ్రమతో పార్టీ నాలుగు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భవ్య, దివ్య భారత నిర్మాణం కోసం నిరంతర కృషి కొనసాగుతుంది. నవ్య, పరివర్తన భారత ఆవిర్భావానికి దేశ జనశక్తి బలాన్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. యోగి ప్రమాణం తర్వాత మోదీ ట్వీట్లు చేస్తూ.. కొత్త ప్రభుత్వం రికార్డు స్థాయి అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ‘ఉత్తమ‘ ప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తుందన్న నమ్మకముందన్నారు.