
ఆ దుప్పట్లు ఉతికేది రెండు నెలలకోసారే!
మీరు రైల్లో వెళ్లేటపుడు.. ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? అక్కడ మీకు కప్పుకోడానికి ఇచ్చే దుప్పట్ల కంపు గమనించే ఉంటారు. ఆ విషయం గురించి ఎన్నిసార్లు అటెండెంటుతో గొడవ పడినా ప్రయోజనం ఉండదు. కానీ.. ఇప్పుడు అదే విషయం పెద్దల సభలో చర్చకు వచ్చింది. దాంతో.. రైళ్లలో దుప్పట్లను రెండు నెలలకు ఓసారి మాత్రమే ఉతుకుతారన్న విషయం వెల్లడైంది.
ఈ విషయాన్ని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. దుప్పట్లు ప్రతిరోజూ ఉతికించడం కుదిరే పని కాదని, వాసన రావడం సహజమేనని చెప్పారు. రైల్వే శాఖకు లినెన్ సరఫరా చేస్తున్న దుప్పట్ల నాణ్యత, పరిశుభ్రతపై ఓ ప్రశ్నకు సమాధానంగా సదరు మంత్రి గారు తన మనసులోని మాటను వెల్లడించారు. సభలో సభ్యులు తమకు రైళ్లలో ఎదురైన అనుభవాలను తెలపడంతో.. సభాపతి హమీద్ అన్సారీ కూడా దీనిపై మాట్లాడారు. అంత ఇబ్బందిగా ఉంటే ప్రయాణికులు తమ సొంత దుప్పట్లు, పరుపులను తీసుకెళ్లడం మంచిదని వ్యాఖ్యానించారు. మరో రెండేళ్ళలో 25 మెకనైజ్డ్ లాండ్రీలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోందని, దీంతో 85 శాతం ప్రయాణికులు పరిశుభ్రమైన దుప్పట్లను పొందగలరని వెల్లడించిన మంత్రి సిన్హా తన ప్రకటనపై సమర్థించుకున్నారు.
ఇండియన్ రైల్వే 'బెడ్ రోల్ టేక్ ఎవే' అనే ఓ తాత్కాలిక పథకం ప్రారంభించిందని, రైల్వే దుప్పట్ల కంపు నచ్చని ప్యాసింజర్లు ఆన్ లైన్లో 110 రూపాయలకు ఓ బ్లాంకెట్, 140 రూపాయలకైతే రెండు బెడ్ షీట్లు చొప్పున కిట్ బుక్ చేసుకోవచ్చని ఓ రైల్వే అధికారి చెప్పారు. ప్రయాణం ముగిసిన తర్వాత ఆయా బ్లాంకెట్లు, బెడ్ షీట్లను ప్రయాణికులు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా ఆఫర్ ఇచ్చారు. అదీ మన రైల్వేల సంగతి!!