
రూ.88 వేలకు బాలిక అమ్మకం
బాలికలను అంగట్లో పెట్టి బహిరంగంగా వేలం వేస్తున్నార ని...
- బిహార్‌లో సర్వసాధారణంగా మారిన దురాచారం
- పట్టించుకోని అధికార యంత్రాంగం
పట్నా: బాలికలను అంగట్లో పెట్టి బహిరంగంగా వేలం వేస్తున్నార ని, మూడు వేల రూపాయలు పెడితే ఎవరైనా కొనుక్కోవచ్చంటూ ప్రత్యక్ష ఉదాహరణతో 1980 దశకంలో వచ్చిన వార్తాకథనాలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశ రాజకీయాలను కూడా కుదుపు కుదిపేశాయి. అప్పుడే కాదు ఇప్పటికి కూడా అమ్మాయిలను అంగట్లో పెట్టి అమ్ముతున్నా, సంబంధిత ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. బీహార్‌కు చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయిని బహిరంగ వేలంలో పంజాబ్‌కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడు 88 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ యువకుడి కబంద హస్తాల నుంచి ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటు పట్నా, ఆగ్రాలలో అమ్మాయిలను బహిరంగంగానే వేలం వేస్తున్నారని, తనతోపాటు తీసుకొచ్చిన ఓ ఐదుగురు అమ్మాయిలను కూడా అలాగే వేలం వేశారని ఆ బాలిక పోలీసులకు వివరించింది. 'మూడు నెలల క్రితం పట్నాలోని ఓ చోట నాతో సహా ఆరుగురు బాలికలను పెళ్లి కూతుళ్ల పేరిట వేలం వేశారు. అందులో నన్ను రఘువీర్ అనే మరో యువకుడి సహాయంతో పంజాబ్‌లోని అబోహర్ పట్టణానికి చెందిన రాజేశ్ అనే యువకుడు 88 వేల రూపాయలకు కొన్నాడు. నన్ను తీసుకొని ఆగ్రాకు వెళ్లి అక్కడ ఓ అంగట్లో నన్ను ఎక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నించాడు. నేను అంత అందంగా లేకపోవడంతో ధర ఎక్కువ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నన్ను పంజాబ్ తీసుకెళ్లి ఓ ఇంటిలోని ఓ గదిలో బంధించాడు. మూడు నెలలుగా సరైన తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెడుతూ వచ్చాడు. ఆ హింసలను తట్టుకోలేక ఓ రోజు గట్టిగా ఏడిస్తూ కేకలు వేశా....ఆ కేకలు విన్న పొరుగింటివారు 'సేవా నారాయణ్ సేవా సొసైటీ' అనే ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. వారు పోలీసుల సహాయంతో వచ్చి నన్ను విడిపించారు' అని ఆ బాలిక తన గాథను మీడియాకు వివరించారు. పోలీసులు రాజేశ్‌ను, రఘువీర్‌లను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్నా అంగట్లో అమ్మిన ఇతర ఐదుగురు బాలికలు విషయమై ఆచూకి తీస్తున్నారు.