ఒక ఇంజనీర్ కొడుకు.. ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు.. ఓ డాక్టర్ కొడుకు.. డాక్టర్ కావాలనుకుంటున్నాడు.. కానీ.. ఓ రైతు కొడుకు.. మళ్లీ రైతు కావాలనుకోవడం లేదు..
ఇదీ మన దేశంలోని వ్యవసాయ రంగం దుస్థితి.. నేటి యువత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టడానికి విముఖత చూపుతోంది.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా వ్యవసాయం మినహా మిగతా ఏదో ఓ రంగంవైపు మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవాలని కోరుకుంటోంది. ఏటా దేశంలో విద్యార్థులు, యువతపై పలు అంశాల్లో సర్వేలు చేసే అసర్ సంస్థ.. 2017 సంవత్సరానికి సంబంధించి చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో కేవలం ఒక శాతం మందే వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారని సర్వేలో తేలింది. ఇక చాలా మంది యువత సాంకేతికత వినియోగంలో వెనుకబడి ఉన్నారని.. భారతదేశం మ్యాప్‌ను, అందులోని రాష్ట్రాలు, ప్రాంతాలను కూడా గుర్తించలేకపోతున్నారని వెల్లడైంది. అసర్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో ‘బియాండ్ బేసిక్స్’పేరిట నివేదికను విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 30,532 మంది గ్రామీణ యువతను ప్రశ్నించింది. మన రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో నిజామాబాద్‌లో సర్వే చేసింది.
బ్యాంకింగ్ మెరుగు
బ్యాంకుల వినియోగం విషయంలో యువత కొంతమేర మెరుగ్గా ఉన్నట్లు అసర్ గణాంకాలు చెబుతున్నాయి. సర్వే చేసిన మొత్తం యువతలో 78 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకుల్లో నగదు జమ, ఉపసంహరణ చేశామని 51 శాతం మంది, ఏటీఎం కార్డు ఉందని 16 శాతం మంది చెప్పారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ తెలుసని చెప్పినవారు 5 శాతం మాత్రమే. ఇక 87 శాతం మంది టీవీ చూశామని, 63 శాతం మంది పేపర్ చదివామని, 47 శాతం మంది రేడియో విన్నామని తెలిపారు.
పోలీసు, ఇంజనీరు.. డాక్టరు
- మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించగా చాలా మంది యువత సాధారణ సమాధానాలే ఇచ్చారు.
- అబ్బాయిల్లో 18 శాతం ఆర్మీ లేదా పోలీస్ ఉద్యోగం చేయాలని, 12 శాతం మంది ఇంజనీర్లు కావాలని చెప్పగా.. అమ్మాయిల్లో 25 శాతం మంది టీచర్, 18 శాతం మంది డాక్టర్/నర్సు అవుతామని చెప్పారు.
- ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటామని 13 శాతం మంది అబ్బాయిలు, 9 శాతం మంది అమ్మాయిలు చెప్పారు.
- స్కూళ్లు, కాలేజీల్లో నమోదుకాని యువతలో 30% తాము ఏం కావాలనుకుంటున్నామో చెప్పలేకపోయారు.
- 40 శాతం మంది తమకు రోల్ మోడల్స్ ఎవరూ లేరని చెప్పగా.. కొందరు తల్లిదండ్రులే రోల్ మోడల్ అని చెప్పారు.
నిజామాబాద్‌లో సర్వే ఫలితాలివీ..
మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన అధ్యయనంలో.. 60 గ్రామాల్లోని 945 కుటుంబాలకు చెందిన 1,035 మంది 14–18 ఏళ్ల వయసువారిని ప్రశ్నించారు.
- ఇందులో 17.2 శాతం మంది అసలు చదువుకోవడం లేదు. 7.3 శాతం మంది వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు.
- 70.3% మొబైల్ ఫోన్‌ను, 35.9% ఇంటర్నెట్‌ను, 21% కంప్యూటర్‌ను వినియోగిస్తున్నారు.
- 69.4 శాతం మందికి సొంత బ్యాంకు ఖాతాలున్నాయి. బ్యాంకులో నగదు జమ, ఉపసంహరణ వంటివి 44 శాతం మందికే తెలుసు. ఏటీఎంలు వినియోగించడం 20.2 శాతం మందికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కేవలం 6.3 శాతం మందికే తెలుసు.
- రెండో తరగతి పాఠ్య పుస్తకంలోని అంశాలను 76 శాతం మందే తప్పులు లేకుండా చదవగలుగుతున్నారు. ఇంగ్లిష్ వాక్యాలను 70.4 శాతం మందే చదవగలుగుతున్నారు.
- 78.4 శాతం మందే డబ్బులు లెక్కపెట్టగలుగుతున్నారు.
- సమయాన్ని గంటలు, నిమిషాల్లో 50 శాతం మందే చెప్పగలుగుతున్నారు.
- భారతదేశం మ్యాప్‌ను చూపించి ఇది ఏ దేశమని అడిగితే 96.2 శాతం మంది సరైన సమాధానమిచ్చారు.
- దేశ రాజధాని ఏదని అడిగితే 54.2 శాతం మంది సరైన జవాబిచ్చారు.
- మీది ఏ రాష్ట్రమని అడిగితే 87 శాతం మంది సరిగా చెప్పారు.
- మ్యాప్‌లో రాష్ట్రాన్ని గుర్తించాలని కోరితే 73.2 శాతం మంది మాత్రమే సరిగా చూపించారు.
మ్యాప్‌ను కూడా గుర్తించలేరు
సర్వేలో భారత దేశం చిత్రపటాన్ని (మ్యాప్)ను చూపించి.. ‘ఇది ఏ దేశం’అని అడిగితే 86 శాతం మందే సరైన సమాధానమిచ్చారు. మన దేశ రాజధాని ఏదని అడిగితే 64 శాతం, మీది ఏ రాష్ట్రమని అడిగితే 79 శాతం మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారు. మ్యాప్‌లో మీ రాష్ట్రాన్ని గుర్తించాలని అడిగితే.. 42 శాతమే సరిగా చూపించారు.
డిజిటల్.. డొల్లే
ప్రపంచం డిజిటల్ యుగంలో దూసుకెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ యువత చాలా వెనుకబడి ఉందని అసర్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సర్వే సందర్భంగా 59.3 శాతం మంది యువత అసలు కంప్యూటర్‌ను ఎప్పుడూ ఉపయోగించలేదని, 63.7 శాతం మంది ఇంటర్నెట్ వినియోగం తెలియదని వెల్లడించారు. ఇక సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు 82.4 శాతం మంది చెప్పారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment