రిషికేశ్ చేరుకున్న వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడనుంచి ఆయన రిషికేశ్కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను వైఎస్ జగన్ తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూ.. స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్ లోని చాతుర్మాసదీక్ష సందర్భంగా నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున చాతుర్మాస దీక్షా మహోత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వామీ స్వరూపా నందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రిషికేశ్ లో నిర్వహిస్తున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వైఎస్ జగన్ తోపాటు ఎంపీలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. హోమానికి ముందు వైఎస్ జగన్.. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. నదీమతల్లికి హారతి ఇచ్చారు. వస్రాలు సమర్పించారు. పూజలు నిర్వహించారు. పవిత్ర స్నానం ఆచరించాక.. చాతుర్మాస దీక్ష హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో దాదాపు మూడు గంటలపాటు ఈ పవిత్ర కార్యక్రమంలో వైఎస్ జగన్ పాలుపంచుకున్నారు.