ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలి
- ఫిరాయించిన వారిపై వేటేసే అధికారం ఈసీకివ్వాలి
- 3 నెలల్లో అనర్హత వేటు పడేలా సవరణ తేవాలి
- అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీపీ నేత మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు వీలుగా సవరణ బిల్లు తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి అనంత్‌కుమార్ ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీలో మేకపాటి, పార్టీ రాజ్యసభ సభ్యు డు వేణుంబాక విజయసాయిరెడ్డి పాల్గొన్నా రు. సమావే శానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక, హోంమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులతోపాటు అన్నిపార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయడంతోపాటు ఫిరాయింపులకు పాల్పడిన ప్రతినిధులపై వేటేసే నిర్ణయాధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలని, మూడు నెలల్లో అనర్హత వేటుపడేలా చట్టసవరణ తేవాలని మేకపాటి కోరారు. సమావేశానంతరం విజయసాయిరెడ్డితో కలసి ఆయన ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున మూడు అంశాల్ని సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిపారు. ‘‘ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాల్ని సరిచేయాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టుపట్టే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసంగా మార్చారు.
పార్టీ ఫిరాయించినప్పుడు వాళ్లంతటవాళ్లే గౌరవంగా తప్పుకుంటే సరే. లేదంటే మూడు మాసాల్లో సభ్యత్వాన్ని రద్దుచేయాలి. ఆ అధికారాన్ని స్పీకర్‌నుంచి తప్పించి ఎన్నికల సంఘానికివ్వాలని చెప్పాం..’’ అని ఆయన వివరించారు. ‘‘అవతలిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుక్కోవడమనేది చండాలమైన పని. ప్రజాస్వామ్యానికి మచ్చ. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగాలంటే ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి’’ అని మేకపాటి కోరా రు. ఫిరాయింపుల సవరణ బిల్లు గురించి బీఎస్పీ ప్రతినిధి సతీష్‌చంద్ర కూడా ప్రస్తావించారని, సవరణ బిల్లు తెచ్చేందుకు తప్పక ప్రయత్నిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
విభజన హామీలు అమలుచేయాలి..
‘‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన అన్ని విషయాల్ని అమలుచేయాలి. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి ని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. పారిశ్రామిక కారిడా ర్ల అభివృద్ధికి సాయపడతామన్నారు. వీటన్నింటినీ తూచా తప్పక అమలుచేయండి. మేం కొత్తగా అడగట్లేదు. విభజన చట్టంలో ఉన్నవాటితోపాటు అప్పటి ప్రధా ని రాజ్యసభలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాం. సమావేశంలో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి ఉన్నందున వారందరి దృష్టికి ఈ అంశాల్ని తీసుకొచ్చాం’’ అని మేకపాటి తెలిపారు. ఎంపీల్యాడ్స్ నిధులను పెంచాలని కోరగా పరిశీలిస్తామని చెప్పారని ఆయ న వివరించారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించిన అఖిల పక్ష భేటీలోనూ మేకపాటి పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని సభలో వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆయా అంశాల్ని స్పీకర్‌కు వివరించారు.