‘ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’ | YSRCP MP Vijayasai Reddy Speech In Rajya Sabha | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’

Published Tue, Feb 11 2020 5:31 PM | Last Updated on Tue, Feb 11 2020 5:56 PM

YSRCP MP Vijayasai Reddy Speech In Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చారిత్రక తప్పిదం కాగలదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. నిధుల సమీకరణ కోసం జోరుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న ప్రతిపాదనలు శ్రేయస్కరం కావని అన్నారు. వార్షిక బడ్జెట్‌పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. 'బడ్జెట్‌కు మద్దతును ప్రకటిస్తూనే పన్నుల ద్వారా కాకుండా పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుతం వస్తున్న 65 వేల కోట్ల రూపాయలకు బదులుగా 2020-21లో 2 లక్షల 10వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని బడ్జెట్‌లో నిర్దేశించుకోవడం జరిగింది. అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు రెట్లు ఆదాయం పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.

ప్రధానంగా దశాబ్దాలుగా ప్రజాదరణను చూరగొన్న అత్యంత విలువైన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న నిర్ణయం చారిత్రక తప్పిదంగా మిగిలిపోగలదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పన్నుల వసూళ్ళ ద్వారా లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని గత ఏడాది బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో దారుణంగా విఫలమైందని అన్నారు. పైగా కార్పొరేట్ పన్నులలో కోత విధించిన కారణంగా ఖజానాపై లక్షా 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ ఆ చర్య వలన ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. కార్పొరేట్‌ టాక్స్‌లో కల్పించిన రాయితీ వలన కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా లేవని అన్నారు. బడ్జెట్‌ను ఐసీయూలో ఉన్న పేషెంట్‌గా అభివర్ణిస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. 2013-14లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక రంగానికి అద్దం పట్టే వివిధ సూచీలను ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గణాంకాల సాయంతో వివరించారు.

చిదంబరం హయాంలో ద్రవ్యలోటు 5.2 శాతం ఉంటే ప్రస్తుతం 3.8 శాతం ఉంది. ఆదాయ లోటు 3.9 శాతం ఉంటే ప్రస్తుతం అది 2.4 శాతం ఉంది. సబ్సిడీలు మొత్తం అప్పట్లో రూ. కోటి 90 లక్షల ఉండగా ప్రస్తుతం రూ. 2 లక్షల 62వేల కోట్లకు చేరుకుంది. చిదంబరం హయాంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 292 బిలియన్‌ డాలర్లు ఉండగా ప్రస్తుతం ఆ నిల్వలు 450 బిలియన్‌ డాలర్లకు చేరింది. విదేశీ పెట్టుబడులలో 5 శాతం అభివృద్ధి నమోదు కాగా ప్రస్తుతం అది 16 శాతం ఉంది. ఉపాధి హామీ పథకానికి రూ. 33 వేల కోట్లు నిధులు మంజూరు కాగా ఈ బడ్జెట్‌లో అది రూ. 66 వేల కోట్లకు చేరింది. 2013-14లో ద్రవ్యోల్బణం 10.5 శాతానికి చేరగా ప్రస్తుతం అది 4.5 శాతం ఉంది. అప్పుడు రూ. 5లక్షల వేతనం వచ్చే వ్యక్తి ఏడాదికి రూ. 30 వేలు ఐటీ చెల్లించగా ప్రస్తుతం అది సున్నాకు చేరిందని ఆయన గణాంకాలతో సహా చిదంబరం వాదనను తిప్పికొట్టారు. దేశ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్న విషయం వాస్తవమే అయినప్పటికీ కేవలం మందులతో మాత్రమే రోగానికి చికిత్స సరిపోదని స్వస్థత చేకూరుతుందన్న ఆశ కూడా రోగి కోలుకునేలా చేస్తుందని పరోక్షంగా ఆయన చిదంబరంకు చురకలు అంటించారు.

ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేవు
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆదాయంలో వచ్చిన నష్టం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 నవంబర్‌-డిసెంబర్‌ కాలానికి రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం విచారకరమని అన్నారు. జీఎస్టీ బకాయిలను ఆయా రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేలా పర్యవేక్షించేదుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ డీపీఆర్‌పై నిర్ణయం ఎప్పుడు?
పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 3,283 కోట్ల బకాయిలను రాష్ట్రానికి చెల్లించాల్సి ఉన్నా దాని గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ. 55,548 కోట్లతో సవరించిన అంచనా వ్యయంతో డీపీఆర్‌ను సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రం తుది నిర్ణయం ప్రకటించకుండా జాప్యం చేస్తోందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. వ్యవసాయం, టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌, మౌలిక రంగాలకు ప్రధానమంత్రి ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఆహ్వానిస్తోందన్నారు. భవిష్యత్తుపై బడ్జెట్ ఆశావహకమైన దృక్పథాన్ని కల్పిస్తున్నా ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే విషయంపైన, హామీలను ఆచరణలో పెట్టే విషయంపైన ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement