భారత ప్రభుత్వం నాపై కక్ష గట్టింది: జకీర్ నాయక్
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న హిందూ జాతీయవాద ప్రభుత్వం తన మీద కక్షగట్టిందని వివాదస్పద ముస్లిం మత బోధకుడు డాక్టర్ జకీర్ నాయక్ పేర్కొన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుని వేధిస్తోందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే జకీర్ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని భారత ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను కోరిందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. అంతేకాక భారత్‌లో ప్రస్తుతం జాతీయవాద ప్రభుత్వం ఉందని.. ఆ ప్రభుత్వం కోరిన విధంగా తనపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయవద్దని జకీర్ ఇంటర్ పోల్‌కు ఒక లేఖ రాశారు.
భారత్‌లోని ముస్లిం మైనారిటీల్లో తనకు పెరుగుతున్న మద్దతు, పేరు ప్రఖ్యాతలను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని డాక్టర్ నాయక్ ఆరోపించారు. అంతేకాక తనను మట్టుపెట్టేందుకు సైతం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జకీర్ నాయక్ ఇంటర్‌పోల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.