ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 42,990 మం ది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. దీంతో గతేడాది 10,02,949గా ఉన్న జిల్లా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 10,45,939కి చేరింది. ఇందు లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. 4,99,682 మంది పురుష ఓటర్లు ఉండగా, 5,46,178 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 1,974 మంది ఎక్కువగా ఉన్నారు.ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. తాజా వివరాలను జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు బుధవారం విడుదల చేశారు. జిల్లాలో గతంలో 1379 ఉన్న పోలింగ్ స్టేషన్‌లలో 40 తగ్గించి 1339కి కుదించారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు, చేర్పులు, మార్పులు, అభ్యంతరాలను స్వీకరించి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించారు. అక్కడి నుంచి వివరాలను తెప్పించుకున్న కలెక్టరేట్ అధికారులు తుది జాబితాను బుధవారం విడుదల చేశారు.
అత్యధిక ఓటర్లు ‘రూరల్’లోనే..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే అత్యధికంగా కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. 38,704 మంది కొత్తగా తమ పేరు నమోదు చేసుకోగా, మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,481కి చేరింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,349 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. 1,95,974తో జిల్లాలోనే అత్యధిక ఓటర్లు గల నియోజకవ వర్గంగా ‘రూరల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,512 మంది కొత్త ఓటర్ల నమోదుతో 1,60,692కి చేరగా, బోధన్ నియోజకవర్గంలో 822 ఓటర్లు తగ్గి 1,66,428కి చేరింది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 438 మంది కొత్త ఓటర్లు పేరు నమోదు చేసుకోగా, ఓటర్ల సంఖ్య 1,50,006కు పెరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా 685 మంది పేర్లు నమోదు కాగా, ఓటర్ల 1,78,358కి చేరింది.