డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి శనివారం ఆగష్టు 17 న డల్లాస్ మహానగరంలో ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని, అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందని తెలిపారు.
అభివృద్ధిలో మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడంలో ముందున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మొదటి సారిగా విచ్చేయనున్నారని, మతం, కులం, పార్టీ భేదాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వైఎస్ జగన్ డల్లాస్‌లో అందరినీ కలిసి ప్రసంగించనున్నారని చెప్పారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి సాదర స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
అందరూ ఆహ్వానితులే..
ఈ సందర్భంగా అమెరికాలోని ప్రవాస తెలుగు వారి తరపున వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రియతమ నాయకుడు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా డల్లాస్ (టెక్సాస్) నగరానికి వస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆగస్టు 17న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడుగంటల వరకు కొనసాగే ఈ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆత్మీయ సమావేశానికి అమెరికాలోని తెలుగు ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి వైఎస్ జగన్‌ని ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment