telugu community
-
అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
మాడిసన్: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్ స్టేట్‌లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు. -
అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం!
అమెరికా తెలుగు సంఘం ఆటా ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024న జూన్ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందుకోసం ఈ నెల సెప్టెంబరు 8,9,10తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబరు 8న, శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం, అద్వితీయ విందు వినోదాలతో అలరించింది. ఇక సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్‌రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ఏటీఎస్) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకుగాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయ్యింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(జీడబ్ల్యూసీసీ)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్‌లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమయ్యింది. ఆ శుభవేళ కళారాధనతో మొదలైన నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల అలరించింది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పీసీకే ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా కిరణ్, పాశం వేణు పీసీకేను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్సను హర్షధ్వానాలతో సత్కరించారు. ఈ సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన, జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థల TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు , యూత్ వాలంటీర్స్‌కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!) -
సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న యువకుడుకి ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు
కళ్లెదుటే కరోనాతో తన తండ్రి, ఎంతో మంది చనిపోవడం తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా,ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా,శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలని- "సొల్యూషన్ టు పొల్యూషన్ (కాలుష్యానికి పరిష్కారం)" అనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు. దానికై కాలుష్యం కలిగించని,శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చెయ్యాలని ధృడ సంకల్పతో అడుగులు వేసాడు రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన 'రంజిత్ ఆన్ వీల్స్ సైక్లింగ్ భారతదేశం దాటి ఇప్పుడు ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా,థాయిలాండ్,మలేషియా దేశాలను చుట్టి 29-ఆగష్టు 29, 2023 న సింగపూర్ చేరుకున్నాడు. మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యం ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని, దీనివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు. అందరూ రంజిత్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. తరవాత కమిటీ సభ్యులు రంజిత్ ను సత్కరించారు. తన ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రంజిత్ మాట్లాడుతూ, సింగపూర్ దేశం చాల బాగుందని ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉండటం, ప్రజలందరూ మెట్రో రైలు, సిటీ బస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, చాలాచోట్ల సైకిల్ వాడటం గమనించానని, కాలుష్యానికి అవకాశం తక్కువ ఉందని తెలిపారు. తెలుగు సమాజం వారిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. రంజిత్ రెండు రోజులలో సింగపూర్ నుంచి ఇండోనేసియాలోని జకార్తాకు, తరువాత ఫిలిప్పైన్స్, ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2021 ఏప్రిల్ 5 నుండి ఇప్పటివరకు 22,300 కిలోమీటర్ల ప్రయాణం చేసాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. రంజిత్ ఆన్ వీల్స్ ఫేస్బుక్ పేజీ, ఇంస్టాగ్రామ్ ద్వారా దాదాపు 3 లక్షల 60 వేలమంది ఫాలోవర్స్ వున్న రంజిత్ నిత్యం వారికి తన ప్రయాణంలో విశేషాల్ని పంచుకుంటున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అన్నారు. కాలుష్యం తమ తమ పరిధిలో నియంత్రిస్తూ, తగిన శారిరక శ్రమ చేయడం ద్వారా తప్పకుండా తనకోరిక నెరవేరుతుంది. (చదవండి: సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్ కాన్సెప్ట్‌లకు గొప్ప మార్గనిర్దేశం) -
హాంగ్‌కాంగ్‌లో భలేగా బుజ్జాయిలతో భోగి!
తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. మన పండుగలకు చాలా సామాజిక, సాంప్రదాయ, సాంస్కృతిక మరియు స్వాభావికమైన ఆరోగ్య విలువలు ఉంటాయి. ఈ పండుగలలో పెద్దల ఆశీర్వదిస్తారు. పిల్లలు మహా సందడిగా ఉంటారు. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. భోగిపళ్లలో, చెర్రీస్, శనగలు, చేమంతి, బంతి, గులాబీ పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు. పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలూ, పసుపు-కుంకుమలూ పెట్టడం ఆనవాయితీ. అయితే ప్రవాస భారతీయులుగా పండుగకు కావాల్సినవన్ని వారున్న దేశంలో సమకూర్చుకోలేకపోయినా, లభ్యమైన వాటితోనే వారు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి యేట రెట్టింపు వుత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పండుగ వివరాలు తెలుపుతూ, వారి పాపకి భోగి పండ్లు సంధర్భంగా, తమ ఎస్టేట్ లో వున్న మరి కొంత మంది పసి పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో భోగి’ చేయడం మొదలుపెట్టగా, భగవంతుని ఆశశీస్సులతో రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు తమకు ఎంతో ఆనందాన్ని తృప్తినిస్తోందని తెలిపారు. హాంగ్‌కాంగ్‌లో ‘డూడు బసవన్నలు’ మరియు ‘గంగిరెద్దుల ఆటలు’ కనిపించక పోయినా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ‘బుజ్జాయిలతో భోగి’ సందడి క్రిస్మస్ సెలవల నుంచే మొదలవుతుంది. సెలవలకి భారతదేశం వెళ్ళినప్పుడు, రానున్న సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, క్రొత్త బట్టలు, నగలు, బొమ్మలు మొదలగునవి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అమ్మల పట్టు చీరలు, తళ తళ మెరిసే మేలిమి నగలు, నాన్నల పంచే సర్దుకొంటూ పిల్లల వెంట పరుగులు, చిన్నారుల క్రొత్త బోసి నవ్వులు - కేరింతలు, పిల్లల కాలి మువ్వల సవ్వడులుతో పండుగ వాతావరణానికి ఆహ్వానాలుగా ధ్వనిస్తాయి. అమ్మమ్మలు - బామ్మలు - తాతయ్యల మురిపాల నవ్వులు, సంతోషాలు ఆ భోగిపళ్ళ సందడికే ప్రకాశాన్నిస్తున్నాయి.. అందరూ భోగిపళ్ళతో సమావేశంకాగా అమ్మమ్మ - బామ్మల హస్తాల మీదుగా దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా, హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని శ్రీమతి హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు వారు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించగా, తల్లి తండ్రులందరు వరుసగా పిల్లలందరికి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. పిల్లలందరికి మరింత ఆసక్తి ఉత్సాహాన్ని ఇచ్చేది, పాల్గొంటున్న వారిచ్చే చిరు కానుకలు. వాటిని పుచ్చుకునేందుకు పిల్లల అరుపులు, కేకలు , పరుగులు ఎంత ముచ్చటగా వుంటాయో కదా. మరి కానుకలు అందుకున్న తరువాత వాటిని విప్పి చూసే హడావిడి మీ ఊహకే అంటున్నారు సంతోషంగా, ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక. ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరొక్క మంచి మాట, హాంగ్‌కాంగ్‌లో కూడా మన దేశంలో సంక్రాంతికి గాలి పటాల పోటీల వలె ఇక్కడ జాతీయ - అంతర్జాతీయ గాలి పటాల పోటీలు నిర్వహిస్తుంటారు.. మీకు తెలుసా, గాలిపటాలు ఎగురవేయడం హాంగ్‌కాంగ్, చైనాలో ఒక ప్రసిద్ధ కాలక్షేపం. మొదటి గాలిపటం షాన్డాంగ్లో సన్నని చెక్క ముక్కలతో తయారు చేయబడిందని నమ్ముతారు. చైనీస్ గాలిపటాల నమూనాలు ఎక్కువగా జానపద కథలు మరియు బొమ్మలపై ఆధారపడి ఉంటాయి. మీరు తరచుగా డ్రాగన్లు, పువ్వులు, గోల్డ్ ఫిష్, సీతాకోకచిలుకల వంటి ఐకానిక్ చిహ్నాలు మరియు డిజైన్లను చూసివుంటారు. ఇలా అనేక దేశాలలో గాలిపటాలు ఎగురవేయడం ప్రసిద్ధి చెందింది - భారతదేశం, నేపాల్, ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్, చైనా, జపాన్, తైవాన్, గ్రీస్, సైప్రస్, దక్షిణ అమెరికా, పాలినేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్. (క్లిక్ చేయండి: బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు) -
బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
బెర్లిన్: సంక్రాంతి పండుగను దేశదేశాల్లోని తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సంక్రాంతి పర్వదినాన్ని తెలుగువారు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు భారత రాయబారి పర్వతనేని హరీష్, ఆయన సతీమణి నందిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆట పాటలతో సాగిన వేడుకల్లో పిల్లాపాపలతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. అమికల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శార్వరి పనంగిపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన, సర్వాణి గురజాడ శాస్త్రీయ గానం సభికులను అలరించాయి. పిల్లల కోసం డ్రాయింగ్ పోటీలు.. మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. బెర్లిన్‌లో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వారికి దౌత్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వేడుకల నిర్వహణలో మద్దతుగా నిలిచిన శివమ్ భాయ్, కృష్ణ మూర్తి, జైరాం నాయుడు, శ్రీనివాస్‌లకు ‘టాగ్’ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ‘టాగ్’ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు రామ్ బోయినపల్లి, కార్యదర్శి అలేఖ్య భోగ, కోశాధికారులు బాల్‌రాజ్ అందె, యోగానంద్ నాంపల్లి, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ కమిడి, నరేష్ తౌతం, సోషల్ మీడియా సెక్రటరీలు శ్రీనాథ్, శివరామ్.. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. (క్లిక్ చేయండి: వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు) -
వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగు వారి అధ్వర్యంలో ఆగస్టు 28, 29 తేదిల్లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని గౌరవించేందుకు ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందజేస్తున్నారు. ఈ మేరకు ఎంట్రీలను ఆగస్టు 10 వరకు ఎంట్రీలకు స్వీకరించారు. జ్యూరీ సభ్యులు విక్రం పెట్లూరు, వెంకట్ తరిగోపుల, లక్ష్మణ్, తొట్టెంపూడి గణేశ్‌లు ఎంట్రీలను పరిశీలించి తెలుగు సాహిత్యం కోసం పాటుపడిన 12 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. వీరికి తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే వాటిని ప్రదానం చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు -
హైదరాబాద్‌కు బయల్దేరిన 146 తెలుగువారు
సింగపూర్ : లాక్డౌన్ కారణంగా సింగపూర్ చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు ప్రవాసులను అక్కడి తెలుగు సమాజం స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు సమాజం సౌజన్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బయల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉండగా... ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ విమానం ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో సహకరించారని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి అన్నారు. సకాలంలో అనుమతులు ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విమానం ఏర్పాటుకు సహకరించిన కపిల్ ఏరో సీఈఓ చిన్నబాబు, తెలంగాణ అండ్ ఏపీ ఏవియేషన్ ఎండీ భరత్ రెడ్డికి సింగపూర్ తెలుగు సమాజం తరపును జనరల్ సెక్రటరీ సత్యా చిర్ల ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ విమానంలో ఉన్న 62 మంది ఏపీ వాసులను హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వెళ్లడంలో సాయం చేస్తున్న ఏపీఎన్ ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్‌కు తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కల్యాణం
టేనస్సీ : నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్‌రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్‌రెడ్డి గూడూరు, ప్రకాశ్‌రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఖండాలు దాటినా.. మీ ప్రేమకు సెల్యూట్ : సీఎం జగన్
డల్లాస్ : ‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్ కార్పెట్ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం అందరిది అని, ఎప్పుడొచ్చినా అందరికి తాను తోడుగా ఉంటానని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఎన్నికల్లో తెలుగు కమ్యూనిటీ గొప్ప పాత్ర పోషించింది అన్నా బాగున్నారా.. అక్కా బాగున్నారా? చెల్లెమ్మ, తమ్ముడు, అవ్వతాతలు అంతా బాగున్నారా? ఖండాలు దాటిన మీ ప్రేమ, అప్యాయత చూస్తే ..ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో ఉన్నా.. నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికి జగన్ అనే నేను నిండు మనుసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నాను. అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి అమెరికన్ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. 175 నియోజకవర్గాలకు 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచామంటే, 22 ఎంపీ స్థానాలు గెలిచామంటే.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా 50శాతం ఓటు బ్యాంకు సాధించామంటే.. వీటంన్నిటిలోనూ ఇక్కడి వారు చేసిన కృషి ఎంతో ఉంది. రెండున్నర నెలల్లోనే గొప్ప నిర్ణయాలు తీసుకున్నాం ఖండాలు దాటి వెళ్లినా.. ఏపీ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మన దేశం మీద, నాన్న గారి మీద, నా మీద చెక్కుచెదరని మీ ప్రేమాభిమానాలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మీ అందరిని చూసి అక్కడ మేమంతా ఎంతో గర్వపడతాము . మా దేశానికి ఇండియన్ కమ్యూనిటీ ఎంతో సేవ చేసిందని అమెరికా అధ్యక్షులు సైతం ప్రత్యేకంగా మన తెలుగువారి గురించి ప్రస్తావించినప్పుడు ఎంతో గర్వంగా ఫీలవుతాం. ఇదే అమెరికాలోనే భారతీయులు దాదాపుగా 41 లక్షలు ఉన్నారని, అందులో దాదాపు 4లక్షలు తెలుగు వారే ఉండడం గర్వంగా ఉంది. కన్న తల్లిని, మాతృ భూమిని, మీ మూలల్ని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఇక్కడ చూస్తుంటే తెలుస్తోంది. మీ అందరికి ఈ వేదిక మీద నుంచి ఒక్కటి చెప్పదలుచుకున్నాను .. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించమే కాకుండా, ప్రతి మనిషి, ప్రతి సామాజిక వర్గం గౌరవం కూడా పొంపెందించేలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండున్నర నెలల్లోనే తీసుకుందని ఈ వేదిక మీద నుంచి మీ అందరి ప్రతినిధిగా సగౌరవంగా ప్రకటిస్తున్నాను. నాయకత్వం నుంచే మార్పు రావాలి ‘ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం.. పరపీడన పరాయణత్వం’ అని అన్నారు శ్రీశ్రీ. ఈ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఓ మనిషి గతంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టిన చరిత్రను మనం చూశాం. గాంధేయ మార్గం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడి దేశ భక్తులను నిరంతరం ప్రభావితం చేస్తే... అమెరికాలో మానవహక్కుల కోసం వర్ణవివక్ష లేని సమాజం కోసం పోరాడిన మహా యోధుడు మార్థిన్ లూథర్‌కింగ్ జూనియర్. ఆయనను మనదేశంలో అనేక మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్...అంటూ 1963 ఆగస్టు 28న ఆయన చేసిన ప్రసంగం అమెరికా ప్రజల్లోనే కాకుండా, ప్రభుత్వ విధానల్లో కూడా ఎంతో గొప్పమార్పు తీసుకొచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ విషయం నేను ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే దానికి కారణం పాలకులు ధ్యాస పెడితే మార్పు అనేది తీసుకు రావడం సులభం. చెడు నుంచి మంచికి, అవినీతి నుంచి నీతికి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థముంటుంది. ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పు తీసుకురావాలంటే నాయకత్వం నుంచి అది రావాలి. అది నా డ్రీమ్ మార్టీన్ లూథర్ కింగ్ అన్న మాటలు నిజంగా స్పూర్తిదాయకం. నాకు కూడా ఒక లక్ష్యం ఉంది. మహానేత నాన్న గారి పాలన చూశాం. ఆ మహానేత డా. వైఎస్సార్ తనయుడిగా, 50శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల మధ్యే గడుపుతున్న నాయకుడిగా, అన్నిటికి మించి 3,648 కిలోమీటర్ల మేర కాలి నడకన 13 జిల్లాల పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అవినీతి, లంచాలు లేని రాష్ట్రం నిర్మించాలని నా లక్ష్యం. అన్నంపెడుతున్న రైతు ఆకలి బాధతో చనిపోకూడదన్నది నా కల. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలనేది నా కోరిక. అందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్నది నా కల. నిరుద్యోగంతో పస్తులు పడకూడదనేది నా డ్రీమ్. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందించాలనేది నా లక్ష్యం. ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది నాకొక డ్రీమ్. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నీరు అందించాలనేది నాదొక కోరిక. నేను పెట్టుకున్న ఈ లక్ష్యాలను, నా నవరత్నాలకు, మేనిఫెస్టోకు ప్రేరణ మన ప్రజలే. వారి కష్టాలు చూశా. వారి బాధలు విన్నా. వారందరికి నేను చెప్పింది ఒక్కటే నేనున్నాను అని. మూడు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు కల్పించాం ఈ రోజు అధికారంలోకి వచ్చాం. మనసు పెట్టి, మీ అందరి దీవేనలతో మంచి చేస్తాననే నమ్మకం నాకుందని ఈ వేదికపై నుంచి చెబుతున్నా. ఈ దిశగా అడుగులు వేస్తూ రెండున్నర నెలల పరిపాలనలో ఏకంగా 19 బిల్లులను బడ్జెట్ సమావేశంలో తీసుకొచ్చాం. పెన్షన్లు పెంచాం. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, నిరుపేదలకు 25లక్షల ఇళ్ల పట్టాలు ఈ ఏడాదిలోనే ఇవ్వబోతున్నాం. పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్, యుద్ద ప్రాదిపదికన జలయజ్ఞంలో ప్రాజెక్టులు, దశల వారిగా మద్య నిషేదానికి నాంది పలికామని గర్వంగా చెబుతున్నా. రెండున్నరనెలల్లోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రెటేరియట్లను తీసుకొస్తున్నాం. గ్రామ వాలంటీర్లను ఇప్పటికే నియమించాం. మూడు నెలల కాలంలోనే 4లక్షగా మందికి వీటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం. అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50శాతం నామినేటేడ్ పదవులు, పనులు కల్పిస్తున్నాం. మహిళలకు రాష్ట్రంలో ఇచ్చే ప్రతి నామినేటేడ్ పదవులల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడ కనీవినీ ఎరుగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చాం. వ్యవసాయం, వ్యవసాయరంగాల మీద ఆధారపడే కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకు వేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరుగని విధంగా 60శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాం. కీలకమైన మంత్రి వర్గ శాఖలను బలహీన వర్గాలకు ఇచ్చాం. మంచి చేసేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి రెడ్ కార్పెట్ వేస్తున్నాం పక్కనే ఉన్న తెలంగాణతో సఖ్యత సంబంధాలను కుదుర్చుకుంటూ సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నాం. నాలుగు పునాదుల మీద మన రాష్ట్ర అభివృద్ధి సౌధాన్ని నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం. రాష్ట్ర ప్రజల జీడీపీ ఒక్కటే కాదు మానవ అభివృద్ధిని కూడా మెరుగు పరుస్తాం. పట్టణాలలో ఉన్నవారికే కాకుండా పల్లెల్లో ఉన్నవారికి కూడా సేవలను, సంక్షేమ పథకాలను వారి వద్దకే తీసుకేళ్లేలా చర్యలు చేపట్టాం. మౌళిక సదుపాయాలలో, పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడిన నిర్ణయాలు తీసుకొని వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పడం. రాష్ట్రంలో చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం ఉంది. చివరగా రెండు మాటలు చెబుతున్నా.. మనరాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్‌కు రండి అని మీరందని ఆహ్వానిస్తున్నాను. ఇది మీ ప్రభుత్వం. మీ కుటుంబాలతో రండి. మన గ్రామాలకు రండి. మీ ఆత్మీయులను చూడడానికి ఏడాదికి ఒకసారైనా రండి అని ఆహ్వానిస్తున్నాను. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి.. మీకు అండగా మేముంటామని మీకు హామీ ఇస్తున్నాను. మీ గ్రామాల బాగును కోరుకునేవారు, మీరు చదుకున్న బడులను మార్చాలనుకునే వారు, అందరిని రమ్మని కోరుతున్నాను. మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీరు, మనం కలిసి మన గ్రామాలను బాగు పర్చుకుందామని కోరుతున్నాను. మీరంతా మేము చేస్తున్న మంచి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాను. చిన్న పిల్లలను నుంచి అవ్వతాతలకు వరకు పలకరించానని చెప్పండి. మీ అందరి చల్లని దీవేనలు ఎల్లప్పుడు నాపై ఉంచమని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్న, మీ తమ్ముడు అని మర్చిపోకండి. మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డల్లాస్‌లో సీఎం జగన్ సమావేశ సందడి షురూ
డల్లాస్ : వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ రాక నేపథ్యంలో డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం నెలకొంది. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీఎం జగన్ సభ కోసం ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రవాసాంధ్రులు శుక్రవారం సాయంత్రమే డల్లాస్‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీ నుంచి డల్లాస్‌కు చేరుకున్న సీఎం జగన్.. అక్కడ ప్రముఖులతో భేటీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు. -
అమెరికాకు సీఎం జగన్ పయనం
సాక్షి, అమరావతి/ ఎయిర్‌పోర్టు (గన్నవరం) : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 3.15 గంటలకు రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాతృమూర్తి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, పలువురు అధికారులతో కలసి సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో జగన్‌కు మంత్రి పేర్ని నాని, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. కుటుంబీకులతో కలసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాత్రి 7.40కు చేరుకున్నారు. రాత్రి 9.50 నిమిషాలకు వాషింగ్టన్కు బయలుదేరారు. సీఎం అమెరికా పర్యటన వివరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. పర్యటనలో మూడు రోజులు వ్యక్తి గత పనులు ఉండటం వల్ల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే భరించనున్నారు. ♦ ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరతారు. అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా– ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. ♦ ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ♦ ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ♦ ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు. ♦ ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు. -
ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి ఏపీ సీఎం
డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి శనివారం ఆగష్టు 17 న డల్లాస్ మహానగరంలో ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని, అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందని తెలిపారు. అభివృద్ధిలో మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడంలో ముందున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మొదటి సారిగా విచ్చేయనున్నారని, మతం, కులం, పార్టీ భేదాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వైఎస్ జగన్ డల్లాస్‌లో అందరినీ కలిసి ప్రసంగించనున్నారని చెప్పారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి సాదర స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. అందరూ ఆహ్వానితులే.. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రవాస తెలుగు వారి తరపున వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రియతమ నాయకుడు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా డల్లాస్ (టెక్సాస్) నగరానికి వస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 17న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడుగంటల వరకు కొనసాగే ఈ ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆత్మీయ సమావేశానికి అమెరికాలోని తెలుగు ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి వైఎస్ జగన్‌ని ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల’ని కోరారు. -
అమెరికాలో శ్రీలంక ఉగ్ర దాడి అమరులకు నివాళి
సౌత్ ప్లైన్ఫీల్డ్ : ‘ఈస్టర్ పండగ రోజున గత ఆదివారం (ఏప్రిల్ 21) శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబోలో 8 చోట్ల బాంబులు పేల్చడంతో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబుల దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన పొరుగు దేశంలో అసువులు బాసిన వారికి ప్రగాఢ సంతాపం తెలియ చేయాల్సిన సమయమిది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధిద్దాము. ప్రేమ, సర్వ మత సమానత్వంకై బాబా బాటలో నడవాలి’ అని రఘు శర్మ పిలుపు నిచ్చారు. న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు అమరులకు ఘన నివాళులర్పించారు.శ్రీలంకకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హచ్ఛి మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని అందరూ, అన్ని మతాలవారూ ఖండించాలని కోరారు. సుమారు 200 మంది భక్తులు కొవ్వొత్తి దీప ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. -
మలేసియాలో ఘనంగా ‘మహిళా సదస్సు
కౌలాలంపూర్: మలేసియా తెలుగు సంఘం, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంస్థల ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహిళా సదస్సు’ ఘనంగా నిర్వహించారు. కౌలాలంపూర్ సమీపంలోని సుబాంగ్‌జయలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు పది దేశాల నుంచి తెలు గు మహిళా ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అమెరికాలోని కీ సాఫ్ట్వేర్ అధినేత దూదిపాల జ్యోతిరెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఇదే కార్యక్రమంలో కోడూరు హరినారాయణరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. వీరితోపాటు కోమల్‌రాణి, పద్మిని, జ్యోత్స్న, అన్నపూర్ణ, కొత్త కృష్ణవేణి తదితరులకు ‘మహిళా శిరోమణి’ పురస్కారాలను అందించారు. సదస్సులో భాగంగా పలువురు మహిళలు ప్రసంగిం చారు. మహిళలు ఒత్తిడిని జయించడం ఎలా? అనే అంశంపై డాక్టర్ మధురిమారెడ్డి, మహిళా సాధికారత గురించి డాక్టర్ రోజీ గుండ్ర, మలేసియాలో తెలుగు మహిళా వికాసంపై రేఖ, భారత్‌లో సాంప్రదాయ ఆలయాల విశిష్టత గురించి ఉజ్జయినీ మహం కాళి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ తదితరులు ప్రసంగించారు. సదస్సులో అచ్చయ్య కుమార్‌రావు, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
చికాగో: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని చికాగో తెలుగు కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. స్థానిక థుమ్కా బాంకెట్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకకు భారీ ఎత్తున వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పేదప్రజలకు, విదేశాల్లో ఉన్న తెలుగువారికి అందించిన సేవలను కొనియాడారు. అదేవిధంగా తండ్రి బాటలో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాపక్షనేతగా ఎదిగినతీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పద్మజా రెడ్డి, చికాగో పార్టీ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . కార్యక్రమంలో రమణా అబ్బరాజు, మనోజ్ సింగమశెట్టి, రాంభూపాల్ రెడ్డి కందుల, కేకే రెడ్డి, వెంకట్ రెడ్డి లింగారెడ్డిగారి, జయదేవ్ మెట్టుపల్లి, క్రిష్ణా రంగరాజు, శ్రీని వోరుగంటి, రమాకాంత్ రెడ్డి, హరిందర్ రెడ్డి, జగదీశ్, శివ, రవి కిషోర్ ఆల్లా, సేతుకుమార్ కర్రి, ప్రమోద్ ముత్యాల, రామిరెడ్డి పెద్దిరెడ్డి, వెంకట్ పులుసు, గోపీ పిట్టల, మోహన్, రాజ్ అడ్డగట్ల, సురేష్ శంక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాలోకి షర్మిల బస్సు యాత్ర
తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలన్నది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. అడ్డగోలు విభజనను సహించరాదన్నది జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఆవిర్భావం నుంచి తెలుగువారి ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సమైక్యాంధ్ర పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకుంది. అన్నదమ్ముల్లా అరవై ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల పూరించిన సమైక్య శంఖారావ ం నేటి నుంచి రెండురోజులపాటు ‘తూర్పు’న ప్రతిధ్వనించనుంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడువేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన షర్మిల ఇప్పుడు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో అడుగిడుతోంది. తిరుపతిలో ఈనెల 2న శ్రీకారం చుట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా జూన్ 4న జిల్లాలో అడుగుపెట్టి 21 రోజుల పాటు 270.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల జిల్లాలోనే 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. మళ్లీ రెండున్నర నెలల అనంతరం రాష్ర్ట విభజనపై కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్న సీమాంధ్రులకు అండగా నిలిచేందుకు జగనన్న తరపున సమైక్య శంఖారావం పూరించిన షర్మిల మళ్లీ జిల్లాకు వస్తున్నారు. పశ్చిమలో యాత్ర ముగించుకొని సిద్ధాంతం-గోపాలపురం వారధి మీదుగా శుక్రవారం ఉదయం షర్మిల జిల్లాలో ప్రవేశించ నున్నారు. ఆమె యాత్ర కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం వద్ద ప్రారంభమై పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల మీదుగా సాగనుంది. తొలిరోజు పర్యటనలో కోనసీమ ముఖద్వారమైనరావులపాలెం వద్ద రావులపాలెం మార్కెట్ సెంటర్లో సమైక్యవాదులనుద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల మీదుగా సాయంత్రం అమలాపురం చేరుకుని అక్కడి హైస్కూల్ సెంటర్లో సమైక్యవాదులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం మీదుగా తొలిరోజు యాత్ర సాగుతుంది. శనివారం ఉదయం ముమ్మిడివరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా కాకినాడ సిటీలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాకినాడ మెయిన్‌రోడ్డులో 216 జాతీయ రహదారిపై మసీద్‌సెంటర్‌లో కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరిగే మహాధర్నాలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల మీదుగా యాత్ర తుని చేరుకుంటుంది. అక్కడ నుంచి పాయకరావుపేట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఘనస్వాగతానికి ఏర్పాట్లు రావులపాలెం : సిద్ధాంతం-గోపాలపురం వంతెన మీదుగా జిల్లాలో అడుగుపెడుతున్న షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. కొత్తపేట నియోజక వర్గ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. జగ్గిరెడ్డితో పాటు జిల్లా ఇండస్ట్రియల్, వాణిజ్య, సేవాదళ్ కన్వీనర్లు మంతెన రవిరాజు, కర్రి పాపారాయుడు, మార్గన గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. రావులపాలెం మార్కెట్‌రోడ్డు సెంటర్లో జరిగే సభకు తరలి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తపేట నుంచి వచ్చే వాహనాలకు రావుల పాలెం జెడ్పీ హైస్కూల్లో, ఆలమూరు నుంచి వైపు వచ్చే వాహనాలకు జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో, ఆత్రేయపురం నుంచి వచ్చే వాహనాలకు రావులపాలెం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు జగ్గిరెడ్డి తెలిపారు. సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయాలి : కుడుపూడి అమలాపురం : సమైక్యాంధ్ర పరిరక్షణకు షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపు నిచ్చారు. అమలాపురంలో పార్టీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు టేకి రాజగోపాలరావు స్వగృహంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ అమలాపురంలో జరిగే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కోనసీమ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, రైతు, కార్మిక జేఏసీ నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. సభకు తరలి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పి.గన్నవరం, రాజోలు నుంచి వచ్చే వాహనాలు బస్టాండ్ ఆవరణలో, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి నుంచి వచ్చే వాహనాలు బైపాస్‌రోడ్డు మీదుగా వచ్చి స్థానిక విట్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో, అల్లవరం వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదిత్య జూనియర్ కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలని సూచించారు. రావులపాలెం నుంచి షర్మిల యాత్ర కొత్తపేట, ముక్కామల, అంబాజీపేట మీదుగా అమలాపురం చేరుకుంటుందని తెలిపారు. మోటార్‌సైకిళ్లు, కార్లపై వచ్చే వారు మధ్యాహ్నం రెండు గంటలకు ముక్కామల చేరుకుని షర్మిలకు ఘనస్వాగతం పలికి అక్కడ నుంచి భారీ ర్యాలీతో అమలాపురం తోడ్కొని రావాలన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎ.జె.వి.బి.మహేశ్వరరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మహాధర్నాను జయప్రదం చేయాలి : ద్వారంపూడి కాకినాడ : సమైక్య శంఖారావ యాత్రలో భాగంగా శనివారం కాకినాడ మెయిన్‌రోడ్డులో షర్మిల పాల్గొనే మహాధర్నాలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మసీద్ జంక్షన్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు చేపట్టే ధర్నాలో షర్మిల ప్రసంగిస్తారన్నారు. ఆమెకు జగన్నాథపురం బాలయోగి విగ్రహం వద్ద సుమారు ఐదువేల బైక్‌లతో ఘనస్వాగతం పలకనున్నట్టు చెప్పారు. సుమారు వెయ్యిమంది దండోరా కార్యకర్తలు డప్పులతో స్వాగతిస్తూ ఆమె పర్యటనలో పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు సంగిశెట్టి అశోక్, పసుపులేటి చంద్రశేఖర్, ఎన్.ఎస్.రాజు, రాజాన నగేష్ తదితరులు ఉన్నారు.