ఖండాలు దాటినా.. మీ ప్రేమకు సెల్యూట్‌ : సీఎం జగన్‌ | CM YS Jagan Speech At Telugu Community Meeting In Dallas | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు రండి..అండగా ఉంటాం : సీఎం జగన్‌

Published Sun, Aug 18 2019 6:06 AM | Last Updated on Sun, Aug 18 2019 5:31 PM

CM YS Jagan Speech At Telugu Community Meeting In Dallas - Sakshi

డల్లాస్‌ : ‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం అందరిది అని, ఎప్పుడొచ్చినా అందరికి తాను తోడుగా ఉంటానని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఏపీ ఎన్నికల్లో తెలుగు కమ్యూనిటీ గొప్ప పాత్ర పోషించింది
అన్నా బాగున్నారా.. అక్కా బాగున్నారా? చెల్లెమ్మ, తమ్ముడు, అవ్వతాతలు అంతా బాగున్నారా? ఖండాలు దాటిన మీ ప్రేమ, అప్యాయత చూస్తే ..ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో ఉన్నా.. నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికి జగన్‌ అనే నేను నిండు మనుసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నాను. అమెరికాలో ఉంటున్నా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి అమెరికన్‌ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. 175 నియోజకవర్గాలకు 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచామంటే, 22 ఎంపీ స్థానాలు గెలిచామంటే.. రాష్ట్ర చరిత్రలో  ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా 50శాతం ఓటు బ్యాంకు సాధించామంటే.. వీటంన్నిటిలోనూ ఇక్కడి వారు చేసిన కృషి ఎంతో ఉంది. 

రెండున్నర నెలల్లోనే గొప్ప నిర్ణయాలు తీసుకున్నాం
ఖండాలు దాటి వెళ్లినా.. ఏపీ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మన దేశం మీద, నాన్న గారి మీద, నా మీద చెక్కుచెదరని మీ ప్రేమాభిమానాలకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. మీ అందరిని చూసి అక్కడ మేమంతా ఎంతో గర్వపడతాము . మా దేశానికి ఇండియన్‌ కమ్యూనిటీ ఎంతో సేవ చేసిందని అమెరికా అధ్యక్షులు సైతం ప్రత్యేకంగా మన తెలుగువారి గురించి ప్రస్తావించినప్పుడు ఎంతో గర్వంగా ఫీలవుతాం. ఇదే అమెరికాలోనే భారతీయులు దాదాపుగా 41 లక్షలు ఉన్నారని, అందులో దాదాపు 4లక్షలు తెలుగు వారే ఉండడం గర్వంగా ఉంది. కన్న తల్లిని, మాతృ భూమిని, మీ మూలల్ని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఇక్కడ చూస్తుంటే తెలుస్తోంది. మీ అందరికి ఈ వేదిక మీద నుంచి ఒక్కటి చెప్పదలుచుకున్నాను .. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించమే కాకుండా, ప్రతి మనిషి, ప్రతి సామాజిక వర్గం గౌరవం కూడా పొంపెందించేలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా చర్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండున్నర నెలల్లోనే తీసుకుందని ఈ వేదిక మీద నుంచి మీ అందరి ప్రతినిధిగా సగౌరవంగా ప్రకటిస్తున్నాను. 

నాయకత్వం నుంచే మార్పు రావాలి
‘ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం.. పరపీడన పరాయణత‍్వం’ అని అన్నారు శ్రీశ్రీ. ఈ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఓ మనిషి గతంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టిన చరిత్రను మనం చూశాం. గాంధేయ మార్గం, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ఇక్కడి దేశ భక్తులను నిరంతరం ప్రభావితం చేస్తే... అమెరికాలో మానవహక్కుల కోసం వర్ణవివక్ష లేని సమాజం కోసం పోరాడిన మహా యోధుడు మార్థిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌. ఆయనను మనదేశంలో అనేక మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌...అంటూ 1963 ఆగస్టు 28న ఆయన చేసిన ప్రసంగం అమెరికా ప్రజల్లోనే కాకుండా, ప్రభుత్వ విధానల్లో కూడా ఎంతో గొప్పమార్పు తీసుకొచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ విషయం నేను ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే దానికి కారణం పాలకులు ధ్యాస పెడితే మార్పు అనేది తీసుకు రావడం సులభం. చెడు నుంచి మంచికి, అవినీతి నుంచి నీతికి, చీకటి నుంచి  వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థముంటుంది. ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పు తీసుకురావాలంటే నాయకత్వం నుంచి అది రావాలి.

అది నా డ్రీమ్‌
మార్టీన్‌ లూథర్‌ కింగ్‌ అన్న మాటలు నిజంగా స్పూర్తిదాయకం. నాకు కూడా ఒక లక్ష్యం ఉంది. మహానేత నాన్న గారి పాలన చూశాం. ఆ మహానేత డా. వైఎస్సార్‌ తనయుడిగా, 50శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల మధ్యే గడుపుతున్న నాయకుడిగా, అన్నిటికి మించి 3,648 కిలోమీటర్ల మేర కాలి నడకన 13 జిల్లాల పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అవినీతి, లంచాలు లేని రాష్ట్రం నిర్మించాలని నా లక్ష్యం. అన్నంపెడుతున్న రైతు ఆకలి బాధతో చనిపోకూడదన్నది నా కల. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలనేది నా కోరిక. అందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్నది నా కల. నిరుద్యోగంతో పస్తులు పడకూడదనేది నా డ్రీమ్‌. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందించాలనేది నా లక్ష్యం. ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు  ఉండాలన్నది నాకొక డ్రీమ్‌. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నీరు అందించాలనేది నాదొక కోరిక. నేను పెట్టుకున్న ఈ లక్ష్యాలను, నా నవరత్నాలకు, మేనిఫెస్టోకు ప్రేరణ మన  ప్రజలే. వారి కష్టాలు చూశా. వారి బాధలు విన్నా. వారందరికి నేను చెప్పింది ఒక్కటే నేనున్నాను అని. 

మూడు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు కల్పించాం
ఈ రోజు అధికారంలోకి వచ్చాం. మనసు పెట్టి, మీ అందరి దీవేనలతో మంచి చేస్తాననే నమ్మకం నాకుందని ఈ వేదికపై నుంచి చెబుతున్నా. ఈ దిశగా అడుగులు వేస్తూ రెండున్నర నెలల పరిపాలనలో ఏకంగా 19 బిల్లులను బడ్జెట్‌ సమావేశంలో తీసుకొచ్చాం. పెన్షన్లు పెంచాం. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, నిరుపేదలకు 25లక్షల ఇళ్ల పట్టాలు ఈ ఏడాదిలోనే ఇవ్వబోతున్నాం. పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌, యుద్ద ప్రాదిపదికన జలయజ్ఞంలో ప్రాజెక్టులు, దశల వారిగా మద్య నిషేదానికి నాంది పలికామని గర్వంగా చెబుతున్నా. రెండున్నరనెలల్లోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రెటేరియట్లను తీసుకొస్తున్నాం. గ్రామ వాలంటీర్లను ఇప్పటికే నియమించాం. మూడు నెలల కాలంలోనే 4లక్షగా మందికి వీటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం. అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50శాతం నామినేటేడ్‌ పదవులు, పనులు కల్పిస్తున్నాం. మహిళలకు రాష్ట్రంలో ఇచ్చే ప్రతి  నామినేటేడ్‌ పదవులల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం.  దేశంలో ఎక్కడ కనీవినీ ఎరుగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొచ్చాం. వ్యవసాయం, వ్యవసాయరంగాల మీద ఆధారపడే కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకు వేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరుగని విధంగా 60శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాం. కీలకమైన మంత్రి వర్గ శాఖలను బలహీన వర్గాలకు ఇచ్చాం. మంచి చేసేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నాం. 

పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం
పక్కనే ఉన్న తెలంగాణతో సఖ్యత సంబంధాలను కుదుర్చుకుంటూ సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి కూడా రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం.  రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నాం. నాలుగు పునాదుల మీద మన రాష్ట్ర అభివృద్ధి సౌధాన్ని నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం. రాష్ట్ర ప్రజల జీడీపీ ఒక్కటే కాదు మానవ అభివృద్ధిని కూడా మెరుగు పరుస్తాం. పట్టణాలలో ఉన్నవారికే కాకుండా పల్లెల్లో ఉన్నవారికి కూడా సేవలను, సంక్షేమ పథకాలను వారి వద్దకే తీసుకేళ్లేలా చర్యలు చేపట్టాం. మౌళిక సదుపాయాలలో, పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడిన నిర్ణయాలు తీసుకొని వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.

పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పడం. రాష్ట్రంలో చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం ఉంది. చివరగా రెండు మాటలు చెబుతున్నా.. మనరాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్‌కు రండి అని మీరందని ఆహ్వానిస్తున్నాను. ఇది మీ ప్రభుత్వం. మీ కుటుంబాలతో రండి. మన గ్రామాలకు రండి. మీ ఆత్మీయులను చూడడానికి ఏడాదికి ఒకసారైనా రండి అని ఆహ్వానిస్తున్నాను. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి.. మీకు అండగా మేముంటామని మీకు హామీ ఇస్తున్నాను. మీ గ్రామాల బాగును కోరుకునేవారు, మీరు చదుకున్న బడులను మార్చాలనుకునే వారు, అందరిని రమ్మని కోరుతున్నాను. మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీరు, మనం కలిసి మన గ్రామాలను బాగు పర్చుకుందామని కోరుతున్నాను. మీరంతా మేము చేస్తున్న మంచి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాను. చిన్న పిల్లలను నుంచి అవ్వతాతలకు వరకు పలకరించానని చెప్పండి. మీ అందరి చల్లని దీవేనలు ఎల్లప్పుడు నాపై ఉంచమని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్న, మీ తమ్ముడు అని మర్చిపోకండి. మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను’  అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement