ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి | CM YS Jagan call for NRIs From the US Dallas as platform | Sakshi
Sakshi News home page

ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి

Published Mon, Aug 19 2019 3:45 AM | Last Updated on Mon, Aug 19 2019 5:54 PM

CM YS Jagan call for NRIs From the US Dallas as platform - Sakshi

సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఇది మీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలతో రండి. మీ తల్లిదండ్రుల్ని, అవ్వాతాతల్ని, స్నేహితుల్ని చూడ్డానికి సంవత్సరానికి కనీసం ఒకట్రెండు సార్లయినా రండి. ఆ తర్వాతే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. మీ గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్టాప్స్‌ మార్చాలనే ఆరాటం ఉండేవాళ్లు ముందుకు రండి. మీ సహాయంతో వాటిని పునరుద్ధరిస్తాం. వాటికి మీ పేరే పెడతాం. మీకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుంది. కలిసి గ్రామాలు బాగు చేసుకుందాం రండి.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

డాలస్‌ (అమెరికా): ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఇది మీ ప్రభుత్వంగానే భావించాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చెందేలా, ఇనుమడించేలా పరిపాలనలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లోని ఆసుపత్రులు, స్కూళ్ల పునర్నిర్మాణంలో, బస్టాపుల ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డాలస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు వేలాది మంది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. ఇటీవలి ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు, 151 అసెంబ్లీ సీట్లు దక్కించుకుని చరిత్రాత్మక విజయం సాధించిన రెండున్నర నెలల తన పాలనలో తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలను ప్రవాసుల ముందుంచారు. సామాజిక న్యాయం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్న తన తపనకు ప్రవాసులు కదలి రావాలని, మీరు, మనము అందరమూ కలిసి ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని వారందరినీ కోరారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఇలా సాగింది.  

ఈ విజయంలో మీ పాత్రా కీలకం
‘‘ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడి (అమెరికా) తెలుగు వారు పోషించిన పాత్ర ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు.  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు గెలిచాం. 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల గెలిచాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓటు బ్యాంకును సాధించాం. ఇందులో అమెరికా నుంచి తెలుగు వారు చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేనే మాత్రం సంకోచించడం లేదు. మీరు ఖండాలు దాటి వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మన దేశం మీద, అన్నింటికీ మించి నాన్న మీద, నామీద చెక్కు చెదరని మీ ప్రేమాభిమానాలకు మరొక్కసారి జగన్‌ సెల్యూట్‌ చేస్తున్నాడు. అమెరికాతో పాటు వారికి మించి కూడా ఎదుగుతున్న మీ అందర్నీ చూసి మన రాష్ట్రంలో అక్కడ మేం ఎంతో గర్వపడుతున్నాం.

మా దేశానికి భారతీయులు ఎంతో సేవ చేశారని, అమెరికా అధ్యక్షుడు స్వయంగా మన తెలుగువారి గురించి, మన భారతీయుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా భావిస్తుంటాం. అమెరికాలో ఉన్న దాదాపు 41 లక్షల మంది భారతీయుల్లో 4 లక్షల మంది తెలుగువారే ఉన్నారు. మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ స్థిరపడి, రాణిస్తున్నారంటే నిజంగా ఈ ప్రతిభను చూసి ముచ్చట వేస్తోందని గర్వంగా చెబుతున్నాను. కన్నతల్లిని, మాతృ భూమిని, మీ మూలాల్ని మీరు ఎంతగా గౌరవిస్తున్నారో.. ఎంతగా ప్రేమిస్తున్నారో ఇక్కడ మిమ్మల్నందర్నీ చూస్తుంటే అర్థం అవుతుంది. మీ అందరికీ డల్లాస్‌ వేదిక మీద నుంచి ఒకటే చెప్పదలచుకున్నా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం గౌరవం పెంపొందించేలా.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రెండున్నర నెలల్లోనే చర్యలు తీసుకుందని మీ అందరి ప్రతినిధిగా గర్వంగా ప్రకటిస్తున్నాను. 

ఏ దేశ చరిత్ర చూసినా..
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని శ్రీశ్రీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఇక్కడో మనిషి గతంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన చరిత్రనూ మనం చూశాం. గాంధేయ మార్గం, అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం మన దేశభక్తుల్ని నిరంతరం ప్రభావితం చేస్తే, అమెరికాలో మానవ హక్కులు, సమాన హక్కుల కోసం, వర్ణ వివక్షలేని సమాజం కోసం పోరాటం చేసిన యోధుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌. ఆయన్ను మనదేశంలో కూడా అనేక మంది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. ఐ హేవ్‌ ఎ డ్రీమ్‌.. అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. 56 సంవత్సరాల క్రితం 1953 ఆగస్టు 27న ఆయన చేసిన ఈ ప్రసంగం అమెరికా ప్రజల్లోనే కాకుండా అమెరికాలోని ప్రభుత్వ విధానాల్లో కూడా ఎంతో గొప్ప మార్పు తీసుకు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

అమెరికాలోని డాలస్‌ నగరంలో ఉన్న హచిన్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సభకు అశేషంగా హాజరైన ప్రవాసాంధ్రులు. 

కారణం ఒక్కటే. అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా, ఆయన భావాలే వారికి వేదాలు అయ్యాయి కాబట్టి ఆ మార్పును తీసుకురాగల పరిస్థితి వచ్చింది. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే పాలకులు ధ్యాసపెడితే మార్పు అనేది తీసుకురావడం సులభం అవుతుంది. చెడు నుంచి మంచికీ, పేదరికం నుంచి సంపన్నతకీ, అవినీతి నుంచి నీతికీ, మొరటుతనం నుంచి మానవత్వానికి మార్పు తీసుకు రావడం సులభం అవుతుంది. అరాచకం నుంచి చట్టబద్ధత ఉన్న ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి, వివక్షలేని సమానత్వానికి, రక్తపాతం నుంచి శాంతియుత సహజీవనానికి, దోపిడీ నుంచి మానవ కారుణ్యానికి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మానవ నాగరికతకు అర్థం ఉంటుంది. ప్రతిదేశం, ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. ఒక మార్పును తీసుకు రావాలంటే నాయకత్వం నుంచి ఆ మార్పు మొదలు కావాలి. 

అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రం నిర్మించాలన్నది నా కల
‘ఐ హేవ్‌ ఏ డ్రీమ్‌ ...’ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం. నాకూ ఓ కల ఉంది. బ్రిక్స్‌ దేశాలతో మనం ఎప్పుడూ పోల్చుకుంటుంటాం. బ్రిక్స్‌లో మన దేశం కూడా ఉంది. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వాళ్లు కాలేజీల్లో ఎంత మంది చేరుతున్నారని లెక్కగట్టేది. బ్రిక్స్‌ దేశాల్లో దీన్ని చూస్తే రష్యా 81 శాతం, బ్రెజిల్‌ 50 శాతం, చైనా 48 శాతం అయితే మన దేశం కేవలం 25 శాతం మాత్రమే. దీన్ని మన రాష్ట్రంలో 95 శాతానికి తీసుకెళ్లాలన్నది నా కల. పల్లెలు కళ కళ లాడాలని, అక్కడి ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది నాదొక కల. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలన్నది నాదొక కల. జబ్బు ఎలాంటిది అయినా, ఏ ఒక్క పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది నాదొక కల.

ఏ ఒక్క పేదవాడు సొంత ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా అందరికీ సొంతిల్లు నిర్మించాలన్నది నా కల. ఏ తల్లీ తన పేదరికం వల్ల తన బిడ్డలకు చదువు చెప్పించలేని పరిస్థితి ఉండకూడదన్నది నా కల. ఎంత పెద్ద చదువైనా చెప్పించగలిగితే.. తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న కులాల వారి బతుకులు సంపూర్ణంగా మారుతాయని, దాన్ని మార్చాలనేది నా డ్రీం. ఏ ఒక్కరూ నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది నా కల. ఏ ఒక్క కుటుంబం మద్యం కారణంగా విచ్చిన్నం కావడానికి వీల్లేదన్నది, ఆంధ్రప్రదేశ్‌ను ఆనందాల రాష్ట్రంగా మార్చాలన్నది నా  కల. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రం నిర్మించాలన్నది నా కల. పెన్షన్స్‌ కావాలన్నా, రేషన్‌కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఆరోగ్య శ్రీ కావలన్నా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలన్నా, ఇలా ఏ గవర్నమెంట్‌ పథకమైనా గ్రామాల్లోనే.. ప్రభుత్వ సేవలన్నీ కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుబాటులోకి రావాలన్నదే నా కల. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలు వీటిలో ఏదానికీ తావు లేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది నా కల.

గ్రామ స్థాయిలో విప్లవం 
నేను పెట్టుకున్న ఈ లక్ష్యాలు, నవరత్నాలు, నేనిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో.. వీటన్నింటికీ ప్రేరణ మన ప్రజలే. వారి కష్టాలను చూశాక, వారి బాధలను విన్నాక వారందరికీ కూడా నేను చెప్పిన మాట ఒక్కటే. నేను విన్నాను అని చెప్పాను. ఈ రోజు అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత.. నేను ఇది వరకే చెప్పాను. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏమీ ఉండదని. ఆ మనసుపెట్టి మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో కచ్చితంగా మంచి చేస్తానని, సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఉన్నాయని కచ్చితంగా ఈ వేదిక మీద నుంచి చెబుతున్నాను. ఈ దిశగానే అడుగు వేస్తూ రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశాం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకు వచ్చాం. పెన్షన్లకు గతంలో సంవత్సరానికి ఇచ్చే సొమ్మును లెక్కవేస్తే, మూడింతలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.

మొదటి రెండున్న నెలలల్లోనే అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఇల్లులేని నిరుపేదకు సంతృప్తికర స్థాయిలో ఏకంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఏడాదిలోగా ఇవ్వబోతున్నామని చెబుతున్నాను. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, బెల్టుషాపులన్నవి ఎక్కడా కూడా లేకుండా చేస్తూ మద్య నిషేధానికి నాంది పలికామని చెబుతున్నా. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలతో గ్రామ స్థాయిలో విప్లవం తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అణగారిన వర్గాలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు గతంలో ఎన్నడూ జరుగని విధంగా నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఇచ్చేలా చట్టం తీసుకు వచ్చి అమలుకు పూనుకుంటున్నామని గర్వంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పనులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్నే తీసుకు వచ్చామని సగర్వంగా చెబుతున్నాను. 

పారదర్శకతకు పెద్దపీట
రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పిల్లలకు హైదరాబాద్‌ వంటి మహానగరం లేదు. ఉద్యోగాల కోసం వారు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పిల్లలను దారి పొడవునా నా పాదయాత్రలో చూశాను. వారి బాధలను విన్నాను కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు తిరక్క ముందే వీరందరికీ న్యాయం చేసేందుకు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టం తెచ్చాం. ఎక్కడా అవినీతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో పారదర్శకత అనే పదానికి దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూడాలన్న ఆరాటంతో మొట్టమొదటి సారిగా, దేశ చరిత్రలోనే తొలి సారిగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని కూడా తీసుకు వచ్చాం. ఏ కాంట్రాక్టు అయినా, ఏ టెండర్‌ అయినా రూ.వంద కోట్ల విలువ దాటితే, ఒక జడ్జి దగ్గరకు ఈ టెండర్లను పంపిస్తున్నాం.

ఆ జడ్జి వాటిని వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక మరో 8 రోజుల్లో ఆ జడ్జి మార్పులు చేసి ఖరారు చేసిన తర్వాతే టెండర్లు పిలవడానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని కూడా తెస్తున్నాం. ఎవరైతే తక్కువకు కోట్‌ చేస్తారో ఆ ప్రైస్‌ను ఆన్‌లైన్‌లో పెడతాం. ఆ మరుసటి రోజు ప్రైస్‌ను యాక్షన్‌లోకి తీసుకు వెళతాం. గతంలో టెండర్‌లో ఎల్‌1గా నిలిచిన వారిని కూడా రివర్స్‌ ఆక్షన్‌లో పాల్గొనేలా పోటీ పెట్టి అతి తక్కువకు ఎవరైతే కోట్‌ చేస్తారో వాళ్లకే ఇచ్చేలా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకు వచ్చాం. నిస్సహాయులైన మన రైతన్నలు, వ్యవసాయ ఆధార రంగాలపై తరతరాలుగా ఆధారపడి జీవిస్తున్న కులాలు, కుటుంబాలు, నేతన్నలు, జాలర్లు, కుమ్మరులు, కమ్మరులు, దర్జీలు, రజకులు, క్షురకులు, ఆటో ట్యాక్సీ డ్రైవర్లు, బడుగు బలహీన వర్గాలు, చిన్న వ్యాపారస్తుల బాగోగుల గురించి ఎవ్వరూ పట్టించుకోలేని వ్యవస్థలను పూర్తిగా మార్చడానికి మీ సోదరుడిగా నేను అక్కడ అడుగులు ముందుకు వేస్తున్నాను.   
మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం 
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మొన్న జరిగిన మంత్రివర్గ కూర్పును మీరు చూసే ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రివర్గంలో 60 శాతానికి పైగా చోటు ఇవ్వడం ఇంతకు ముందెన్నడూ జరుగని పరిణామం. నలుగురిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా చేయడం కూడా ఇంతకు ముందెప్పుడూ జరుగలేదు. కీలకమైన హోం, సాగునీరు, రెవెన్యూ, విద్య ఇలాంటి శాఖలన్నీ ఈ వర్గాలకే ఇవ్వడం కూడా ఎప్పుడూ కనీ వినీ ఎరుగని పరిస్థితి అని ఈ వేదికపై నుంచి సగర్వంగా చెబుతున్నాను. దేశం అంటే మట్టి కాదు.. మనుషులే అని నమ్మాం కాబట్టే మీ సొంత గ్రామాల్లో మనుషులందరికీ మంచి చేసేందుకు మన అధికారాలను వినియోగిస్తున్నాం. ప్రాంతాల మధ్య అసమానతలు, కరువు ఒక పక్క, సముద్రంలో కలుస్తున్న నీరు మరో పక్క.. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది కాబట్టి ఈ పరిస్థితులను మార్చాలి అనే ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నాం.

ఇందుకోసం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సఖ్యత కుదుర్చుకుంటూ.. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు.. కృష్ణా ఆయకట్టు ప్రాంతాలకు తీసుకెళ్లడానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. బ్రిక్స్‌ దేశాల్లో మన స్థానం పై భాగంలో ఉండాలన్న దిశగా దేశానికే మార్గనిర్దేశం చూపుతూ అడుగులు వేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియం చేస్తున్నాం. ఇవాళ స్కూళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నయో ఫొటోగ్రాఫ్‌లు చూపిస్తున్నాం. ఆ పాఠశాలలు, ఆసుపత్రులను దశల వారీగా ప్రతి సంవత్సరం కొన్ని స్కూళ్ల చొప్పున, కొన్ని ఆసుపత్రుల చొప్పున మూడు సంవత్సరాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆ తర్వాత ‘నాడు–నేడు’ అని ఆ ఫొటోగ్రాఫ్‌లు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

పారిశ్రామికాభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌
వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడంతో బాటు, పారిశ్రామికాభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేసే దిశగా నిజాయితీతో అడుగులు వేస్తున్నాం. సస్టెయినబుల్‌ మోడల్స్‌ను తీసుకుంటున్నాం. విశ్వసనీయ విధానాలకు పెద్ద పీట వేస్తున్నాం. వ్యవస్థలో ఈ మార్పులు తీసుకు రాకపోతే ఎక్కడా కూడా పరిశ్రమ అనేది రాదు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ శాఖపై సమీక్ష చేస్తున్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు, నేను అధికారంలోకి వచ్చే సమయానికి 13 నెలల బకాయిలు, అక్షరాలా రూ.20 వేల కోట్లు ఉన్నాయని విద్యుత్‌ అధికారులు చెప్పారు. డిస్కంల పని తీరు అంత దారుణంగా ఉంటే.. మరో వైపు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏలను) కుదుర్చుకుంది.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏడాదికి అక్షరాలా రూ.3 వేల కోట్లు అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలోనే పీపీఏలు కుదుర్చుకున్న అదే కంపెనీలకు అదే ప్రభుత్వం 13 నెలలుగా డిస్కంలు బిల్లులు కట్టలేని పరిస్థితి. ఏకంగా రూ.20 వేల కోట్లు బకాయి పడ్డాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు డిస్కంల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కరెంటు కొనుగోళ్ల అగ్రిమెంట్లను కూడా మార్చడానికి సన్నాహాలు చేశాం. కరెంట్‌ను మనం తక్కువ రేటుకు కొనుగోలు చేయగలిగితే పారిశ్రామికవేత్తలకు తక్కువ రేటుకు కరెంటును ఇవ్వగలుగుతాం. అప్పుడే వారిని ఆకర్షించగలుగుతాం. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసే ధరే ఎక్కువైనప్పుడు ఇక పరిశ్రమలకు తక్కువ ధరకు కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏ పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి ఉండదనేది వాస్తవం. ఈ వాస్తవాలన్నీ చెప్పే ప్రయత్నం చేశాం. ఇందులో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని ఈ వేదికపై నుంచి గర్వంగా చెబుతున్నా. 

పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఇలా..
– రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్రతీరంతో పాటు నాలుగు నౌకాశ్రయాలు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. రైలు, రోడ్డు మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. ఐదేళ్లలో మరో ఐదు నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. పూర్తిగా పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలంగా ఉంది. 
– పాలనలో పారదర్శకతను తెస్తున్నాం. అవినీతికి తావు లేకుండా చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా, ఎవరైనా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సానుకూల వాతావరణం ఉన్నదని ఈ వేదికపై నుంచి చెబుతున్నాను. 
– మన ప్రభుత్వం, మన రాష్ట్రాభివృద్ధి సౌధాన్ని నాలుగు పునాదులపై నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం. రాష్ట్ర ప్రజల జీడీపీయే కాదు, మానవ అభివృద్ధి సూచికలను మెరుగు పర్చాలని కూడా నిర్ణయించాం. 
– పట్టణ వాసులకే కాకుండా పల్లెల్లో ఉండే వారికి కూడా సేవలను, సంక్షేమాన్ని వారి దగ్గరకే, వారి గడప దగ్గరకే తీసుకెళ్లేలా చర్యలను చేపట్టాం. దీని వల్ల పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలు తగ్గుతాయి. 
– మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడిన నిర్ణయాలను తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నాం. వీటి ద్వారా వచ్చే పరిశ్రమలతో 75 శాతం స్థానిక రిజర్వేషన్లతో మన పిల్లలకు మంచి జరుగుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నాను. 
– పరిపాలనలో సంస్కరణలు తీసుకు రావడం ద్వారా పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను తీసుకు రావడంలో మన ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. వీటన్నింటి ద్వారా జరిగే మేలు ఏమిటంటే.. రాష్ట్రానికి ఒక పారదర్శక వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రంలో చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేసే వ్యవస్థ ఉందనే ఒక సందేశం వెళుతుంది. 

మన రాష్ట్రానికి రండి..
మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్‌కు రండి అని మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి ముందడుగులు వేస్తూ రండి. మేం అన్ని రకాలుగా చూసుకుంటాం, తోడుగా ఉంటామని చెబుతున్నాను. మీ గ్రామాల బాగును కోరుకున్న వాళ్లు, మీ గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాట పడే వారు, మీ గ్రామాల్లో మీ వైద్యశాలలు మార్చాలి అని తపన ఉన్న వాళ్లు, మీమీ గ్రామాల్లో బస్టాపులు మార్చాలనుకునే వాళ్లు, అందరూ రావాలని కోరుతున్నాను. మీ సహాయంతోనే అభివృద్ధి చేసి వాటికి మీ పేరు పెడతాము. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఇద్దరమూ కలిసి మన గ్రామాలను బాగు పర్చుకుందామని అందరినీ కోరుతున్నాను. గ్రామాలను అభివృద్ధి చేయాలనుకున్న వారు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారందరికీ అనుకూలంగా ఉండేలా ఒక వెబ్‌ పోర్టల్‌ను తెరవబోతున్నాం.

ఆ పోర్టల్‌ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. నేరుగా ఒక అధికారి దానిని పర్యవేక్షిస్తారు. ఆ పోర్టల్‌లోకి వచ్చి ఎవరైనా నేను పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నానని రిజిస్టర్‌ చేసినా, లేదా మా గ్రామంలో ఫలానా పనికి సాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరేదైనా ఫీడ్‌ చేస్తే.. వెంటనే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మా అధికారులు మీకు టచ్‌లోకి వస్తారని, మీకు అన్ని రకాలుగా సహకరిస్తారని ఇదే వేదిక నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఇక్కడ స్థిర పడక పోయినా, స్థిరపడినా.. అక్కడి ప్రజలతో చిరకాల అనుబంధాలు కోరుకునే వారెందరో ఉన్నారు. మీరంతా మేం చేస్తున్న ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతు ఇవ్వండని కోరుతున్నాను.

మీ కుటుంబాల్లో పసిపిల్లల నుంచి, అవ్వాతాతల వరకూ అందరినీ నేను ఆప్యాయంగా పలకరించానని చెప్పండి. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు నాపై ఉంచమని, అక్కడ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నది మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనవడు అని ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతున్నా. చెరగని చిరునవ్వులతో ఆత్మీయతలను, ఆప్యాయతలను పంచి పెట్టినందుకు పేరు పేరునా.. ఇక్కడకు చేరుకున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, స్నేహితుడికీ, అవ్వాతాతలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

అన్నా బాగున్నారా? అక్కా బాగున్నారా? చెల్లెమ్మా.. తమ్ముడూ బాగున్నారా? అవ్వా, తాతలు అందరూ బాగున్నారా? ఖండాలు దాటినా మీ ప్రేమను, మీ అభిమానాన్ని ఇక్కడ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో ఉన్నా.. నాన్న గారిని, నా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నింటికీ జగన్‌ అనే నేను నిండుమనసుతో ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను.

ఇది మీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలతో రండి. మీ తల్లిదండ్రుల్ని, అవ్వతాతల్ని, స్నేహితుల్ని చూడ్డానికి సంవత్సరానికి కనీసం ఒకట్రెండు సార్లయినా రండి. ఆ తర్వాతే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. మీ గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్టాప్స్‌ మార్చాలనే ఆరాటం ఉండేవాళ్లు ముందుకు రండి. మీ సహాయంతో వాటిని పునరద్ధరిస్తాం. వాటికి మీ పేరే పెడతాం. మీకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుంది. మీతో కలిసి గ్రామాలు బాగు చేసుకుంటాం రండి. 

రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశాం. అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లుల్ని తీసుకొచ్చాం. గతంలో ఇచ్చే పెన్షన్‌ మొత్తాన్ని పెంచాం. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాల అమలుతో పాటు.. ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాల్ని ఏడాదిలోగా ఇవ్వబోతున్నాం. వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది. అక్టోబర్‌ 2 నాటికి గ్రామ సెక్రటరీల్ని కూడా తీసుకొస్తాం. 3 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నాను. అవినీతికి తావులేని రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ తీసుకొచ్చాం.

నాకు కూడా ఓ లక్ష్యం ఉంది. నాకు కూడా ఓ కల ఉంది. మహానేత నాన్నగారి పాలన చూశాం. డాక్టర్‌ వైఎస్సార్‌ తనయుడిగా, 50 శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్న నాయకుడిగా, అన్నింటినీ మించి 3,648 కిలోమీటర్ల మేర కాలినడకన 13 జిల్లాల ఏపీలో పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించాలనేది నా డ్రీమ్‌. అన్నం పెట్టే రైతన్నలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదనేది నా డ్రీమ్‌. రాష్ట్రంలో 33 శాతం ఉన్న నిరక్షరాస్యతను (దేశంలో 26 శాతం) జీరోకు తీసుకురావాలనేది నా డ్రీమ్‌. పల్లెలు కళకళలాడాలని, అక్కడి స్కూల్స్, హాస్పిటల్స్‌ మెరుగ్గా ఉండాలనేది నా డ్రీమ్‌. ప్రభుత్వ పథకాలు, సేవలన్నీ లంచాల్లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలనేది నా డ్రీమ్‌. (చదవండి: అమెరికాలో అద్భుత స్పందన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement