డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు | Gandhi 149th Birth Anniversary Celebrations held in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Published Mon, Oct 1 2018 8:00 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

Gandhi 149th Birth Anniversary Celebrations held in Dallas - Sakshi

డల్లాస్‌ : మహాత్మాగాంధీ 149వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజాలో 'గాంధీ పీస్‌ వాక్‌' నిర్వహించారు. చిన్నా పెద్దా తేడాలేకుండా టీషర్టులు, టోపీలు ధరించి గాంధీ పీస్‌ వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విప్రో సీఈఓ అబిదలి నీముచ్‌వాలాతోపాటూ ఆయన భార్య హస్నేవా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇర్వింగ్‌ నగర కౌన్సిల్‌ మెంబర్‌ అల్లెన్‌ మీగర్‌, టెక్సాస్‌ రాష్ట్ర ప్రతినిధి మాట్‌ రినాల్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీస్‌ వాక్‌లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం ఆదర్శంగా నిలిచిందని ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ సెక్రటరీ రావు కల్వల అన్నారు. 


ఐఏఎన్‌టీ, ఐఏఎఫ్‌సీ, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డు సభ్యులు, అతిథులను ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ కోశాధికారి బీఎన్ పరిచయం చేశారు. గాంధీ ఆశయాలు అజరామరమని, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేయడంతో గాంధీని  మహాత్మునిగా నేటికీ గౌరవిస్తున్నామని, తరతరాలకు గాంధీ ఆదర్శంగా నిలిచారని ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ కో చైర్ కమల్ కౌశల్ పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించినవారికి, ఇర్వింగ్ నగర ప్రజలకు ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డు డైరెక్టర్ కుంతేష్ చోక్సీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసినవారికి మాట్‌ రినాల్డిని ఆయన పరిచయం చేశారు. భారత్ నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు దూరం వచ్చి గాంధీ జయంతి వేడుకలకు వేలాదిమంది కలిసి జరుపుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉందని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య ప్రజాస్వామ్యం, రక్షణ వంటి సారూప్యతలు ఉన్నాయన్నారు. టెక్సాస్ అభివృద్ధికి కారణమవుతున్న అమెరికా, భారత్ సహకారాన్ని ఆయన అభినందించారు. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నానని ఇర్వింగ్ సిటీ కౌన్సిల్ మెంబర్ అల్లెన్‌ మీగర్ అన్నారు. ఇర్విన్ నగర ఆర్థిక వృద్ధి కోసం భారతీయ అమెరికన్ల సహకారాన్ని ఆయన ఆకాంక్షించారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద గాంధీ మెమోరియల్‌ను నిర్మించి, నిర్వహిస్తున్న ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతోపాటు బృంద సభ్యులను అబిదలి నీముచ్‌వాలా ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచిన మహాత్మ గాంధీ అడుగు జాడల్లో నడవడం ఎంతోగౌరవప్రదమైనదని ఆయన కొనియాడారు.
 

ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తామందరం కలిసి మహాత్మ గాంధీ 149వ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు.  గాంధీ 150 జయంతి వేడుకలను మరింత ఘనంగా జరపడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. గాంధీ తన జీవితంలో అధిక భాగం భారత స్వాతంత్ర్య కోసం పోరాటం చేసినా ఆయన సిద్ధాంతాలు ప్రపంచ పౌరుడిగా నిలిపాయని కొనియాడారు. భారతీయ అమెరికన్లుగా తమ బాధ్యత మరింత పెరిగిందని, భారత్‌తోపాటు అమెరికాలోని తమవారి ఎదుగుదల కోసం పాటుపడాలని సూచించారు. తమ స్వరాన్ని గట్టిగా వినిపించేందుకు అర్హత కలిగిన వారు ఓటు వేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నాలుగు పార్క్ బెంచీలు దానం చేసిన లాంక్వింటా ఇన్‌, సేజ్ ఐటీ, అదిల్ అది కుటుంబం, ఉపేంద్ర ఓర కుటుంబాలకు ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు. బెంచీలను ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ప్రపంచ శాంతికి సూచకంగా మొత్తం 10 పావురాలను గాలిలో వదిలేశారు. యోగా టీచర్ విజయ్ నిర్వహించిన వార్మప్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అనంతరం పూలతో గాంధీకి నివాళులు అర్పించారు. హాజరైనవారందరికీ అల్పాహారం అందించారు. ఐఏఎన్‌టీ టీం రాజా బెలాని, అబిజిత్ రైల్‌కర్, జగదీష్ బంకర్, రహూల్ చటర్జీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement