నాటా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు
ఈ నెల 18 నుంచి వారం రోజులపాటు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్:
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం చెప్పారు. నాటా కో-ఆర్డినేటర్ డాక్టర్ దువ్వూరు ద్వారకనాధరెడ్డి, రవి కందిమళ్ల, మ్యూజిక్ డెరైక్టర్ రఘుకుంచె, బ్రైట్ విజన్ సొసైటీ అధ్యక్షుడు సురసాని నారాయణరెడ్డి, సినీ గాయకుడు చంద్రబోస్‌లతో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రతీ రెండేళ్లకొకసారి నాటా తరఫున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ... ఈసారి పలు జిల్లాల్లో చేపడుతున్న వాటిని వివరించారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ జిల్లాలలోని బద్వేలు పట్టణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 19న చిత్తురు జిల్లా తలుపు పల్లెలో ఉచిత వైద్యశిబిరాన్ని, వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని పలు గ్రామాల్లో సోలార్ ప్రాజెక్టులను ప్రారంభిస్తామన్నారు.
ఈ నెల 20న తిరుపతి మహతి ఆడిటోరియంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ కళాశాలలో మంచి ప్రతిభ కనబరిచిన 61 మంది విద్యార్థులకు రూ.6.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. 21న నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో 22న గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి పథకాలు ప్రారంభిస్తామన్నారు. 23న వరంగల్‌లో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25న నల్గొండ జిల్లాలో బధిరులకు ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27న హైదరాబాద్‌లో అక్షరాస్యతపై చారిటీ వాక్‌ను, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన 44మంది విద్యార్థులకు రూ.4.4 లక్షలు అందజేయనున్నట్లు చెప్పారు.
సినిమాలో అవకాశం కల్పిస్తాం..
ఆమెరికాలో ఉన్న గాయనీ గాయకులకు సినిమాలో పాడే అవకాశం కల్పించనున్నట్లు సంగీత దర్శకులు రఘు కుంచె తెలిపారు. నాటా ఐడల్ ఆధ్వర్యంలో 10 నగరాల్లో ఫ్రీ ఆడిషన్స్ నిర్వహించి ఒక అబ్బాయి, అమ్మాయిని ఎంపిక చేస్తామన్నారు. వారిని తన తదుపరి చిత్రంలో పాడే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.