
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. వీలునామా, వారసత్వ ఆస్తుల ప్రణాళికాంశాలపై వెబినార్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు, రచయిత అలన్ ఎస్ గస్‌మన్ ఈ వెబినార్‌లో ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందించారు. టెంపాలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి తెలుగువారు వెబినార్ ద్వారా ఆన్‌లైన్‌లోకి వచ్చారు. దాదాపు 700 మందికిపైగా తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఎన్నో కీలకమైన, న్యాయపరమైన విషయాలను తెలుసుకున్నారు.
ముఖ్యంగా అమెరికాలో అనుకోని దుర్ఘటనలు, ఊహించని పరిస్థితులు ఎదురయితే ఎలాంటి న్యాయపరమైన హక్కులు ఉన్నాయి..? ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే వారి పిల్లలకు సంరక్షకులను ఎలా నిర్ణయిస్తారు..? మరణించిన తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వారసత్వంగా సంక్రమించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? న్యాయస్థానాలు ఏమి చెబుతున్నాయి...? మీరు అచేతన వ్యవస్థలో స్పందించలేని స్థితిలో ఉంటే మీ ఆరోగ్య సంరక్షణ విషయంలో మరొకరు మీకు సాయం చేసేందుకు ముందుకు వస్తే.. అటువంటి సమయాల్లో ఏమైనా న్యాయపరంగా వచ్చే చిక్కులేమిటి..? ఇలాంటి ఎన్నో అంశాలపై అలన్ చాలా పూర్తి స్పష్టత ఇచ్చారు.
విల్, ట్రస్ట్, ఎస్టేట్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే దానిపై మనం ముందుగానే ఎంత జాగ్రత్తగా ఉండాలి..? ఏ డాక్యుమెంట్లను మనం సిద్ధం చేసుకోవాలనేది కూడా అలన్ చక్కగా వివరించారు. జీవిత బీమా, అనుకోని సంఘటనలు జరిగితే కుటుంబసభ్యుల సంరక్షణ విషయంలో ముందస్తు ప్రణాళిక ఎలా ఉండాలనేది కూడా చాలా స్పష్టం అలన్ చెప్పుకొచ్చారు. టెంపా చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేశ్ కండ్రు, కార్యదర్శి సుధీర్ మిక్కిలినేని, అడ్వైజరీఛైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని తదితరులు ప్రత్యక్షంగా ఈ సదస్సులో పాల్గొన్నారు.
విజయ్ టీం ఈ వెబినార్‌కు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించింది. నాట్స్ నాయకులు బాపు నూతి, వంశీ వెనిగళ్ల లు కూడా ఈ వెబినార్ కోసం తమ సహకారాన్ని అందించారు. తొలిసారిగా నాట్స్ నిర్వహించిన ఈ వెబినార్‌కు అద్భుత స్పందన లభించింది. అటు ఫేస్‌బుక్ లో కూడా దీనిని లైవ్ చేయడంతో అమెరికాలోని నాట్స్ 19 ఛాప్టర్ల సభ్యులతో పాటు వందలాది మంది దీనిని వీక్షించి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. నాట్స్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినందుకు నాట్స్ కు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment