
సింగపూర్ : 44వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభసందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భాదినోత్సవంతో పాటూ కార్తీక మాస విందు కార్యక్రమాన్ని స్థానిక పుంగోల్ లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఆద్యంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. 43 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను, గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను దృశ్యరూపకంగా ప్రదర్శించారు. పూర్వాధ్యక్షులతో సమాజ శ్రేయస్సును ఉద్దేశించి సాగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
అనంతరం పూర్వాధ్యక్షులను, గత 43 సంవత్సరాలుగా సమాజానికి సేవలందిస్తున్న వ్యవస్ధాపక సభ్యురాలు కోమలవల్లిని సత్కరించారు. కార్యవర్గ కుటుంబ సభ్యుల సహకారంతో అందరికీ అచ్చతెలుగింటి వంటకాలతో పసందైన విందుని ఏర్పాటుచేశారు. సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి సభ్యులందరికి 43వ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, వ్యవస్థాపకులకు , పూర్వాధ్యక్షులకు , వారికార్యవర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని, ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని, తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్నిసంవత్సరాలుగా సింగపూర్ లోని బాలబాలికలకు తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే మనబడిలో భోదించే ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను కార్య నిర్వాహక కార్యదర్శి ప్రదీప్ సుంకర సభ్యులకు పరిచయం చేసి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సమాజం సభ్యులకు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది హాజరయ్యారని కార్యక్రమనిర్వాహకులు సత్య సూరిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులకు, కార్యవర్గానికి సహకారాన్నందిస్తున్న స్పాన్సర్స్ కి కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు.




Comments
Please login to add a commentAdd a comment