యూఏఈ ప్రభుత్వ చిహ్నం
ఎన్.చంద్రశేఖర్–మోర్తాడ్, నాగమళ్ల శ్రీకర్–రాయికల్
హైదరాబాద్‌లో తమ కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభించడానికి సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తమ దేశాలకు వలస వచ్చే కార్మికులకు అవసరమైన వీసా స్టాంపింగ్, ఇతరత్రా సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో సౌదీ, యూఏఈ దేశాల రాయబార కార్యాల యాలు ఉండగా, ముంబైలో సౌదీ అరేబియా కాన్సులేట్ ఉంది. అలాగే యూఏఈ కాన్సులేట్ కార్యాలయాలు ముంబైలో, కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు పెరగడం, ప్రస్తుతం ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో పని భారం అధికం కావడంతో కొత్త కాన్సులేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సౌదీ, యూఏఈ దేశాల విదేశాంగ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణ భారత దేశంలో తమ దేశాల కాన్సులేట్ కార్యాలయాలను విస్తరించనున్నాయి. హైదరాబాద్‌లో వివిధ దేశాల కాన్సులేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలో ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. భారత్ విన్నపం మేరకు సౌదీ, యూఏఈ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడంతో కాన్సులేట్ కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే యూఏఈ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయీద్ అల్ నహాన్ హైదరాబాద్ నగరంలో పర్యటించారు. గత సంవత్సరం జనవరిలో పర్యటించిన ఆయన హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
అందుబాటులోకి రానున్న సేవలు
హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ దేశాల కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభించడం వల్ల వీసా స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా వివిధ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వారికి వీసా జిరాక్సు కాపీ చేతిలో ఉంటే సరిపోతుంది. కానీ, సౌదీ అరేబియాకు, యూఏఈలోని పలు పట్టణాలకు వలస వెళ్లే వారికి మాత్రం పాస్‌పోర్టులోనే వీసా స్టాంపింగ్ చేయాల్సి ఉంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు సౌదీ అరేబియాకు వెళ్లడానికి వీసా స్టాంపింగ్ కోసం ఢిల్లీలోని రాయబార కార్యాలయం లేదా ముంబైలోని కాన్సులేట్ కార్యాలయానికి వెళ్తుంటారు. కాన్సులేట్ కార్యాలయాలకు వెళ్లే వీలులేని వారు ట్రావెలింగ్ ఏజెన్సీల ద్వారా తమ పాస్‌పోర్టులను స్టాంపింగ్ కోసం పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాల వారు వీసా స్టాంపింగ్ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు. అలాగే హజ్ యాత్ర, ఏడాది పొడవునా సాగే ఉమ్రా యాత్రలకు వెళ్లాలనుకునేవారు సౌదీ కాన్సులేట్‌లో సంప్రదించి వీసాను సులభంగా పొందడానికి అవకాశం ఉంది. యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లో ఉపాధి కోసం వీసా పొందిన వారు స్టాంపింగ్ కోసం తిరువనంతపురం వెళ్లాల్సివస్తోంది. యూఏఈ వీసా స్టాంపింగ్ కోసం కచ్చితంగా అభ్యర్థులే వెళ్లాల్సి ఉంది. అభ్యర్థుల వేలి ముద్రలు, ఐరిష్‌ను కాన్సులేట్ కార్యాలయంలో యూఏఈ విదేశాంగ శాఖ అధికారులు సేకరిస్తారు. అమెరికా ప్రభుత్వం వీసా జారీకి అనుసరిస్తున్న విధానాలనే యూఏఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. అందువల్ల హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటైతే ఇక తిరువనంతపురం వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. తిరువనంతపురం వెళ్లి రావడానికి ఒక్కో అభ్యర్థి రవాణా చార్జీలను రూ.2వేల వరకు భరిస్తున్నాడు. అంతేకాక అక్కడ ఒక రోజు ఉండటం, ఇతర అవసరాల కోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటైతే తెలుగు రాష్ట్రాల వారితోతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
వ్యాపార సంబంధాలు మెరుగుపడే అవకాశం
సౌదీ అరేబియా, యూఏఈ కాన్సులేట్ కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ, సౌదీ అరేబియాల్లో సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. కాన్సులేట్ కార్యాలయం మనకు అందుబాటులో ఉండటం వల్ల వ్యాపారాల విస్తరణకు అవసరమైన విదేశాంగ సేవలు సులభం కానున్నాయి. షార్ట్ టర్మ్ వీసాల జారీకి అనువైన వాతావరణం ఏర్పడనుంది.
తెలంగాణవాసులకు ఎంతో ఉపయోగం
హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దేశాలకు వెళ్లాలనుకునే గ్రామీణ ప్రజలకు ఎమిగ్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా డాక్యుమెంట్ కోసం ఢిల్లీకి పోనవసరం లేదు. అంతేకాకుండా అటెస్టేషన్ కష్టాలు కూడా తప్పుతాయి. హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటైతే నిరక్ష్యరాస్యులకు భాష సమస్య కూడా తప్పుతుంది. అంతేకాకుండా ఆ దేశాల్లో ఉన్న వారి సమాచారం కాన్సులేట్ ద్వారా పొందవచ్చు.
– కటకం రవి,
తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోసియేషన్, దుబాయి
సౌదీ కాన్సులేట్ ఏర్పడితే మేలు
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు కావడం వల్ల ఎంతో మేలు జరుగనుంది. వీసా స్టాంపింగ్ కోసం ముంబై వెళ్లాలంటే ఆర్థికంగా భారం మోయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో కాన్సులేట్ కా ర్యాలయం ఏర్పాటు కావడం వల్ల తెలుగు రాష్ట్రాల వారికి ఆ ఇబ్బందులు తప్పు తాయి. సౌది అరేబియాలో ఉన్న వలస కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. సౌదీ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు ఆహ్వానించదగ్గపరిణామం.
– మహ్మద్ యూసుఫ్ అలీ,
అధ్యక్షుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దా
Comments
Please login to add a commentAdd a comment