వాషింగ్టన్, సాక్షి ప్రతినిధి : వాషింగ్టన్ డీసీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రవాసాంధ్రలు వైఎస్సార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధర్ నాగిరెడ్డి సభను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను ఎన్నారైలకు పరిచయం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సలహాదారు (యుఎస్‌ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉన్నాయని కొనియాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించే వరకూ వైఎస్సార్‌సీపీ విశ్రమించబోదని రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే జననేత వైఎస్ జగన్ కోసం ప్రవాసాంధ్రులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ ప్రజల మనిషని, ప్రజల కోసమే పుట్టి, వారి కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అనంతరం కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రతి బూత్ పరిధిలో అదనంగా పది ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం సులభం అవుతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని విమర్శించిన ఆయన, ప్రతీరోజు బాబు చెబుతున్న నిజాలను చూసి మైక్రోఫోన్ సిగ్గుతో తలదించుకుంటుందని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధి, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను ఎన్‌ఆర్ఐలు హర్షించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచి, వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ప్రవాసాంధ్రులు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి ఎన్నారై తమ వంతు కృషి చేయాలనీ కోరారు. వైఎస్ జగన్ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర చేస్తున్నారని, రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఇందుకోసం ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన, ప్రజలు మద్దతు తెలుపుతున్న తీరు చూసి రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అనిల్‌కుమార్ యాదవ్, కోన రఘుపతి, పార్టీ సీనియర్ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్ ఖాన్, స్టేట్ సెక్రటరీ వరప్రసాద్ రెడ్డి అరిమెండ, ఎన్‌ఆర్ఐ ఇండియా సమన్వయ కర్త హర్షవర్ధన్ రెడ్డి, ఎన్‌ఆర్ఐ అమెరికా కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, శశాంక్ అరమడక, రాంగోపాల్ దేవపట్ల, మినాడ్ అన్నవరం, ప్రసన్న కాకుమాని, సుదర్శన దేవిరెడ్డి, శౌరిప్రసాద్, సుజీత్ లతో పాటు స్థానిక నాయకులూ పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్‌ఆర్ఐలు ఇండియా నుంచి వచ్చిన నాయకులను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment