లండన్ : ప్రతిపక్షనేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐలు వాట్సాప్ క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా లండన్‌లో పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్ జగన్‌కు మద్దతుగా వైఎస్సార్‌సీపీ యూకే చాప్టర్, యూరోపియన్ వింగ్ కమిటీ ఈ కార్యక్రమాన్నిచేపట్టాయి. లండన్‌లో నివసిస్తున్న తెలుగువారందరూ వైఎస్ జగన్‌కు మద్దతుగా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్ సందీప్ రెడ్డి వంగల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పాలనపై నిప్పులు చెరిగారు. సమస్యల వలయంలో చిక్కుకున్న పేదప్రజలకు ప్రజాసంకల్పయాత్ర ఒక ఆశాకిరణంలా మారిందన్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఓ ఎన్‌ఆర్‌ఐ అన్నారు.
వైఎస్ జగన్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు. తూర్పు గోదావరిలో జరిగిన బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ రెడ్డి, శివ, నవీన్ రెడ్డి యెర్రమంద, మనోహర్ నక్క, భాస్కర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.
నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారు. వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన విషయం తెలిసిందే. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment