‘భోపాల్’ ఘోరం.. ఏదీ న్యాయం? | 30 Years After Bhopal Gas Leak, Momentum Builds Toward Accountability | Sakshi
Sakshi News home page

‘భోపాల్’ ఘోరం.. ఏదీ న్యాయం?

Published Sat, Dec 13 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

‘భోపాల్’ ఘోరం.. ఏదీ న్యాయం?

‘భోపాల్’ ఘోరం.. ఏదీ న్యాయం?

ఘోర నేరస్తులను విచారించలేని దివాలాకోరు వ్యవస్థ మనదని చాటి చెప్పడానికి ఒక్క ‘భోపాల్’ చాలు. యూసీసీ అధిపతి ఆండర్సన్‌ను ఒక ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేస్తే...  ప్రధాని నుంచి జిల్లా కలెక్టర్ దాకా విడిపించి, పంపేయకపోతే ఏమౌతుందోనని భయపడ్డారు. యంత్రభూతాల కోరలు తోమే సాధారణ కార్మికులు, వారి కుటుంబాలు విష పెట్టుబడుల కాటుకు ఇలా బలి కావలసిందేనా? సమపాలన, న్యాయం వారికి ఎండమావులేనా? ఇది ఆధునిక నాగరికత వికృతరూపం. 1984లో ఢిల్లీ, భోపాల్ నగరాలలో సాగింది ఘోరం. బాధితులకు ఇంకా న్యాయం జరగకపోవడం అంతకన్నా ఘోరమైన నేరం.
 
 1984 నవంబర్‌లో ఢిల్లీ నగరం సిక్కుల రక్తంతో తడిసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా వేలాది సిక్కులను ఊచకోత కోశారు. అదే సంవత్సరం భోపాల్ నగరంలో మిక్ రసాయన విషవాయువు విలయ తాండవమాడింది. వేలాదిమందిని హతమార్చింది. జీవరాశిని నాశనంచేసింది. పర్యావరణాన్ని ధ్వంసం చేసింది. రెండు సందర్భాలలోనూ న్యాయం దొరక లేదు. అసలు న్యాయం అనేది ఉందో లేదో కూడా తెలియరాలేదు. హరియాణాలో ఆశ్రమం పేరిట దుర్భేద్యమైన కోటను నిర్మించి యథేచ్ఛగా నేరాల లీలలు సాగిస్తూ,  చట్టాలను, కోర్టులను లెక్కచేయక దర్జాగా బతికే ‘స్వాము లను’ పట్టుకోవడానికి వందలాది సాయుధ  దళాలు,  27 కోట్ల రూపాయల ఖర్చు అవసరమయ్యాయి. రక్తపాతమూ జరిగింది. ఏమైతేనేం చట్టం చివరకు చట్టం అమలయిందనుకుని సరిపెట్టుకోవచ్చు.
 
 1984 నాటి రెండు మారణ హోమాలు దీనితో పోల్చలేనంత అతి ఘోర దురంతాలు. వాటికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలను చేపట్టడం కోసం, బాధితులకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఏపాటివి? 30 ఏళ్ల కిందట టన్నుల కొద్దీ విష వాయువులను చిమ్మించి భోపాల్ మానవ మారణ హోమాన్ని సృష్టించిన యూనియన్ కార్బయిడ్ కార్పొరేషన్ (యూసీసీ) నేరస్తుడు వారన్ ఆండర్సన్‌ను మన వ్యవస్థ పట్టుకోలేకపోయింది. చేతగాక కాదు, పట్టుకోవాలని లేక. నిజానికి ఆండర్సన్‌పై మోపిన నేరాలను విచారించాలంటే ఆయన్ను పట్టి, భారత్‌కు తీసుకురాక తప్పదు. కానీ మన పాలకులు, ప్రభుత్వాలు.. ఆండర్సన్ పోతే కేసుల గొడవపోతుందని ఆయన అంతిమ ఘడియల కోసం ఎదురు చూశారు. అంతేగానీ వేలాది మందిని చంపి, ఇంకెందరినో శాశ్వత వ్యాధిగ్రస్తులను చేసి, రాబోయే తరాల డీఎన్‌ఏలలో సైతం విషం నింపిన యూసీసీ నేరాలకు చట్టపరమైన పర్యవసానాలు ఏమిటని ఆలోచించలేదు. పాపి చిరాయువు అన్నట్టు ఆండర్సన్ కూడా 92 ఏళ్లు నిశ్చిం తగా జీవించి 29 సెప్టెంబర్ 2014న మరణించాడు. భారత నేర పరిశోధనా వ్యవస్థ ఓ పెద్ద పనైపోయినట్టు.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆండర్సన్‌ను రప్పించాలని ఇటు నుంచి, తప్పించాలని అటు అమెరికా నుంచి ఒత్తిడుల బాధ ఇక వారికి లేదు.  
 
 మూడు వ్యవస్థలూ ముద్దాయిలే
 భోపాల్ ఘోరానికి మన మూడు వ్యవస్థలూ కారణమే. విదేశీ కంపెనీల పెట్టు బడులను, వ్యాపారాలను భారత్‌కు రప్పించాలనే ఆరాటమే తప్ప, ఆ టెక్నాలజీ ప్రజా జీవితంలో సంక్షోభాన్ని సృష్టిస్తే అందుకు తగు చర్యలు చేపట్టడానికి, పరిష్కరించడానికి అవసరమైన శాసనాలు చేయని మన శాసన వ్యవస్థ మొదటి ముద్దాయి. విష రసాయన వాయువులకు ఎందరో బలైన తరువాత 1985 నాటికి గానీ పర్యావరణ చట్టం తేవాలన్న ధ్యాస శాసనకర్తలకు కలగలేదు. జీవరాశి నాశనానికి కారణమైన యూసీసీ అధికారులపై హత్య వంటి తీవ్ర అభి యోగాలు మోపడానికి వీల్లేదని ఆరోపణల దశలోనే తీర్పు చెప్పి సుప్రీంకోర్టు న్యాయం మనుగడకు సవాలు విసిరింది. భోపాల్ నేరగాళ్లకు రెండేళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వేయలేని అశక్తతలో న్యాయస్థానాలు పడిపోయాయి.
 
 ఈ లోపాన్ని సవరించడానికి ‘క్యూరేటివ్ పిటిషన్’ను సుప్రీంకోర్టుకు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. అది కూడా ప్రయోజనం ఉండదని తెలిసీ, ప్రచా రం కోసం చేసిన విన్యాసమేనని ప్రజానీకానికి త్వరలోనే అర్థమైపోయింది. భోపాల్ బాధితులకు ఏదైనా ఉపశమనం దొరికిందంటే అది కేవలం న్యాయ స్థానాల వల్లనే. న్యాయమూర్తులు సృజనాత్మక ఆదేశాలను జారీచేయకపోతే వారికి ఆ కాస్త పరిహారమైనా అందేది కాదు. నిజానికి ఈ దారుణానికి కారణం రాజకీయ ప్రభుత్వాలు. విదేశీ కంపెనీలు మన దేశంలో తయారు చేస్తున్నది విషమా? లేక పురుగుమందా? సాంకేతిక పరిజ్ఞానమా? లేక ఆ పేరుతో దేశం లోకి మృత్యువును దిగుమతి చేస్తున్నారా? అని గమనించని గుడ్డి పాలకులు విధాన నిర్ణయాలు తీసుకున్నారు. భోపాల్ ఘాతుకం జరిగిన తరువాతైనా వారు బాధితులకు న్యాయం చేయడం కోసం, పరిహారాలు ఇప్పించడం కోసం ఏమైనా చేశారా? అదీ లేదు. ఘోర నేరస్తులను విచారించలేని దివాలాకోరు వ్యవస్థ మనదని చాటి చెప్పడానికి ఒక్క  ‘భోపాల్’ చాలు.
 
 ముద్దాయి అడుగులకు మడుగులు
 విషవాయువు విలయ నర్తనం చేసిన ఆ ‘డిసెంబర్ 2’ కాళరాత్రి శవాల రాశు లను మిగిల్చింది. విదేశాలలో వాడి పారేసిన పనికిరాని యంత్రాలను భారత్‌కు పంపి, సాయం చేస్తున్నట్టు పోజులిచ్చే కంపెనీలు లాభాల కోసం ఏమైనా చేస్తాయి. అయితే యూసీసీ అధిపతి (సీఈఓ) వారన్ ఆండర్సన్ తమ లాభా పేక్ష ఎంత దారుణ మారణహోమం సృష్టించిందో చూడాలనుకోవడం గొప్ప విషయం.  డిసెంబర్ 7న ఆండర్సన్ భోపాల్ విమానాశ్రయంలో దిగాడు. ‘భోపాల్’ నేరానికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మామూలు పోలీసు అధికారి అతన్ని అక్కడే అరెస్టు చేశాడు. ఆ కింది స్థాయి పోలీసు అధికారి తన బాధ్యత తాను చేశాడు. అదే పెద్ద సంచలనమైంది. సాధారణ ఇన్‌స్పెక్టర్ అంత ధైర్యం ప్రదర్శించగా...ప్రధాని నుంచి జిల్లా కలెక్టర్ దాకా అంతా ఆండర్సన్‌ను విడిపించకపోతే ఏమవుతుందోనని భయపడిపోయారు.
 
 అతన్ని అతి జాగ్రత్తగా యూసీసీ అతిథి గృహంలోనే ఏ ఇబ్బంది లేని ‘కస్టడీ’లో ఉంచారు. ఆ గదిలో ఫోన్ పనిచేస్తున్న విషయం మరిచిపోయినట్టుంది.  ఆండర్సన్ దర్జాగా అమెరికా పెద్దలకు ఫోన ్ల మీద ఫోన్లు కొట్టారు. అంతే ఇక ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖ, ప్రధాని కార్యాలయం, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి కార్యాలయాలలో తెగ హడావుడి, వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ మీద ఒత్తిడి పెరిగాయి. ‘‘సార్ మీరు అరెస్టయ్యారు. కాని మీకే ఇబ్బంది లేదు. వెంటనే బెయిల్ ఇచ్చేస్తాం. ఈ కాగితాల మీద సంతకం పెట్టండి’’ అని రాచమర్యాదలు చేశారు. ఆండర్సన్ వద్ద మన కరెన్సీ లేకపోతే మనవాళ్లే 25 వేల రూపాయలు పోగుచేసి సెక్యూరిటీగా కట్టేసి మరీ బెయిల్ ఇప్పించారు. ‘కాందహార్’ హైజాకర్ల బ్లాక్ మెయిల్‌కు భయపడి హోంమంత్రి (1999) స్వయంగా నిర్బంధంలోని పాకిస్తాన్ టైరిస్టును వారికి అప్పగించినట్టు... భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నేరస్తుడిని ఢిల్లీకి పంపింది.
 
  రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు ఆండర్సన్‌ను బెయిల్‌పై విడుదల చేయక తప్పలేదని నాటి కలెక్టర్ మోతీసింగ్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రిన్సిపల్ కార్య దర్శిగా పనిచేసిన పీసీ అలెగ్జాండర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో.. ఆండర్సన్‌ను విడుదల చేయాలని రాజీవ్‌గాంధీ ఆదేశించారని, ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌తో చాలాసార్లు ఫోన్లో మాట్లాడిన తరువాత ముఖాముఖి కలుసుకున్నారని వివరించారు. ఆండర్సన్ ప్రయాణించిన ప్రత్యేక విమానాన్ని భోపాల్ నుంచి ఢిల్లీకి నడిపిన పైలట్ ఎస్‌హెచ్ అలీ తనకు కెప్టెన్ అశీశ్ సోథీ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి ఏవియేషన్ డెరైక్టర్‌కు, అక్కడి నుంచి తమకు, ఆ ఉత్తర్వులు అందాయని వివరించారు. ‘‘మాకు ఆ తరువాత తెలిసింది... అతను ఆండర్సన్ అని. వెంట ఎస్పీ, కలెక్టర్ ఉన్నారు. ఆండర్సన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కళ్లు మూసుకునే ఉన్నాడు. ముఖంలో ఆందో ళన వ్యక్తమయింది’’ అని వివరిం చారు. ‘‘ఇన్ని వేల మంది చనిపోవడానికి కారణం ఏమిటి?’’ అని అతన్ని అడ గలేదే అని పైలట్ బాధపడ్డాడు. ఢిల్లీకి చేరుకున్న ఆండర్సన్ హోంమంత్రి పీవీ నరసింహారావును, విదేశాంగ కార్యదర్శి ఎంకే రస్తోగీని మర్యాదపూర్వకంగా కలసి, అమెరికా వెళ్లిపోయారు. మళ్లీ ఎన్ని సమన్లు పంపినా వచ్చింది లేదు.
 
 నేరం చేయాలన్న ఉద్దేశంతోగానీ, అది నేరం అని తెలిసిగానీ పలువురు ఆ నేరంలో పాలుపంచుకుంటే అందులో పాల్గొన్న ప్రతి వ్యక్తీ... ఆ నేరాన్ని అతడొక్కడే చేసినట్టు భావించి విధించే శిక్షకు అర్హుడవుతాడని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 35 వివరిస్తున్నది. 150 సంవత్సరాలుగా నేర న్యాయస్థానంలో అమలవుతున్న న్యాయ సూత్రం ఇది. దీని ప్రకారం ప్రాణాంతకమైన టెక్నాలజీ అని తెలిసి కూడా, అయితే అయిందిలే అన్న రీతిలో నిర్లక్ష్యంగా దాన్ని వినియోగించడంలో ప్రధాన భాగస్వాములయిన వారంతా నేరస్తులే అవుతారు. విషవాయువు అకస్మాత్తుగా విడుదలయ్యే ప్రమాదం ఉందని, అది ప్రాణాం తకమని తెలిసి కూడా వారు ఈ పనిచేశారని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు చేశారు. వాటిని పట్టించుకో కుండా సుప్రీంకోర్టు 1996లో భోపాల్ కేసును తీవ్రమైన నేరారోపణల కింద విచారణ జరపాల్సిన అవసరం లేదని కొట్టి పారేసింది. ఇందువల్ల భోపాల్ క్రిమినల్ కోర్టు మన దేశానికి చెందిన నిందితులకు నిర్లక్ష్యంతో వ్యవహరించిన నేరానికి మాత్రమే రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పవలసివచ్చింది. అంత ఘోర నేరానికి శిక్ష ఇదేనా? అనీ, అసలు హంతకులను పట్టుకోవడం సాధ్యమేనా? అనీ, ఇదేనా మన న్యాయవ్యవస్థ? అనీ ప్రజలు నిరాశ చెందారు.  మన దేశ క్రిమినల్ నేర నిర్ధారణ చరిత్రలోనే  ఇదొక ఘోర వైఫల్యం.
 
 వైఫల్యాల నిశీథిన కాంతి రేఖ
 విషవాయువులు కమ్మిన ఈ చీకటిలో ఒక మెరుపు మెరిసింది. భోపాల్ జిల్లా సివిల్ కోర్టు న్యాయాధికారి మహదేవ్ వామనరావ్ దేవ్ యూనియన్ కార్బయిడ్ కేసులో చరిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చారు. ‘‘ఇదొక దారుణం. 2,700 మందిని పొట్టనబెట్టుకుంది. వందలాది మందిని దెబ్బతీసింది. చాలా మంది ఉపాధిని, పని చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఇల్లు నడిపే వారు చనిపోవడంతో కుటుంబాలు అనాథలయ్యాయి. నాగరికత పెరిగినపుడు, శాస్త్రసాంకేతిక రంగాలు ప్రగతి చెందినపుడు మనం ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. వాటితోపాటు న్యాయశాస్త్రం కూడా ఎదగవలసి ఉంది. ఈ ప్రగతి క్రమంలోని ప్రమాదాలను, సవాళ్లను ఎదుర్కొనేందుకు చట్టం సిద్ధం కావాలి. బాధితులను ఓదార్చే శక్తి చట్టానికి ఉండాలి. ఆ చట్టం కోర్టును కదిలించాలి. కోర్టు పేదల బాధలు తీర్చేందుకు  కదలాలి. అందుకే బాధితులకు తాత్కాలికంగా 350 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని యూనియన్ కార్బయిడ్‌ను ఆదేశిస్తున్నాం’’ అని వామన్‌రావ్ దేవ్ తాత్కాలిక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతో న్యాయప్రక్రియ వేగం పుంజుకుంది. ఆయన ప్రారంభించిన న్యాయ చైతన్యం సుప్రీంకోర్టు ద్వారా పూర్తిస్థాయి పరిహారం ఇప్పించే వైపు తీసుకు వెళ్లింది. ప్రమాదకరమైన పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు, ఉత్పత్తి క్రమంలో సంభవించే ప్రమాదాలకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించే బాధ్యత స్వీకరించి తీరాల్సిందే, దానికి మినహాయింపులు ఉండవు అనే సంపూర్ణ బాధ్యతా సూత్రాన్ని సుప్రీంకోర్టు రూపొందించింది.
 
 భోపాల్‌లోని జాతీయ న్యాయ అకాడమీలో మహదేవ్ వామన్‌రావ్ దేవ్ చిత్రాన్ని ఉంచడంతో పాటూ, చరిత్రాత్మకమైన ఆయన తీర్పులోని ప్రధానాంశాలను గ్రంథాలయంలో ఉంచి ఆయనకు నివాళులర్పించారు.  దేవ్ వంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండి ఉంటే బాధితులకు మేలు జరిగేదేమోననే ఆశలు రేకెత్తించింది ఆయన తీర్పు. రసాయన యంత్రభూతాల కోరలు తోమే సాధారణ కార్మికులు, వారి కుటుంబాలు ఈ విష పెట్టుబడులు కాటందుకున్నప్పుడల్లా బలికావలసిందేనా? సమపాలన, న్యాయం వారికి ఎప్పటికీ అందని ఎండమావులేనా? ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. ఆధునిక నాగరికత ధరించిన వికృతరూపం. ఢిల్లీ, భోపాల్ నగరాల్లో సాగింది ఘోరం. కానీ అందుకు బలైన వారికి ఇంకా న్యాయం దొరకకపోవడం అంతకన్నా ఘోరమైన నేరం.
- (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 డా॥ మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement