చిన్న రైతే.. పెద్ద దిక్కు! | A small farmer can be only supported to make big and natural as agricultural sector | Sakshi
Sakshi News home page

చిన్న రైతే.. పెద్ద దిక్కు!

Published Mon, Jun 29 2015 12:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

చిన్న రైతే.. పెద్ద దిక్కు! - Sakshi

చిన్న రైతే.. పెద్ద దిక్కు!

కోట్లాది మంది చిన్న రైతులను, కూలీలను వ్యవసాయ రంగం నుంచి తరలించి వారికి ఎలా పునరావాసం కల్పిస్తారో ‘వృద్ధివాద’ ఆర్థిక నిపుణులు చెప్పడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చిన్న కమతాల్లోని సుస్థిర-సేంద్రియ విధానమేనని చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌ల అనుభవాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అలా చిన్న రైతులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మన పాలకులు చిత్తశుద్ధితో చేయందిస్తే.. చిన్న రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థనే పునర్లిఖించగలుగుతాడు.
 
 కర్ణ కఠోరమైన అదే మాట పదే పదే వినబడుతూనే ఉంది. మొన్నటికి మొన్న అమెరికా పర్యటన సందర్భంగా కూడా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇదే మాటను పునరుద్ఘాటించారు. భూసేకరణ, కార్మిక చట్టాలను సరళతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదే విషయాన్ని నగ్నంగా చెప్పాలంటే పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు పెట్టడానికీ, కార్పొరేట్ సేద్యం చేయడానికీ, గోల్ఫ్ ఆడుకోవడానికీ, గుర్రపు పందేలకు, క్లబ్బులు కట్టుకోవడానికి వగైరా అవసరాలన్నిటికీ విస్తారంగా భూమి కావాలి. సేద్యం చేసుకుంటున్న సన్నకారు-చిన్నకారు రైతుల నుంచి సులభంగా భూమిని సేకరించాలి. వాళ్లంతా రెక్కలు తప్ప ఏమీ లేని నిరుద్యోగసేనగా సిద్ధంగా ఉండాలి. ఉద్యోగ భద్రత - పనిగంటల నియమాలు - సెలవు నిబంధనల వంటి చట్టరక్షణ లేకుండా ఈ నిరుద్యోగసేన పనిచేయడానికి వీలుగా కార్మికచట్టాలు మారాలి.
 
 ఈ సంకల్పాన్నే మనం మరో రకంగా చెప్పుకుంటున్నాం. నాగరికమైన పరిభాషను వాడుకుంటున్నాం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతానికి పడిపోయింది. కానీ, 50 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కనుక వీరిలో అత్యధికులను ఇతర రంగాలకు మళ్లించాలి. అందుకోసం భూసేకరణ చట్టాలు, కార్మిక చట్టాలు సులభతరం కావాలి. మన అభ్యుదయ రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు సమష్టిగా అంగీకరించి, ఆమోదించిన భావన ఇది. రైతు నాయకులుగా పేరున్నవారు, శరద్ జోషీ లాంటివారు కూడా వ్యవసాయ రంగం నుంచి చిన్న-సన్న కారు రైతులు తప్పుకోవాల్సిందేనని వాదిస్తున్నారు. చిన్న కమతాలు లాభసాటికాదని, పెద్ద కమతాలు, వేల ఎకరాల్లో సాగించే కార్పొరెట్ వ్యవసాయంలోనే లాభాలు సాధించవచ్చని ఇలాంటి వారి అభిప్రాయం.
 
 
 భారతదేశంలో సుమారుగా పన్నెండు కోట్ల మంది రైతులు ఉన్నారు. వీరిలో 80 శాతానికి పైగా చిన్న-సన్నకారు రైతులే. అంటే తొమ్మిదిన్నర కోట్లకు పైగా. ఈ సమూహాన్ని (వారి కుటుంబ సభ్యులను లెక్కించకుండానే) ఒక స్వతంత్ర దేశంగా పరిగణించినట్లయితే ప్రపంచ దేశాల్లో పదమూడో స్థానం దక్కుతుంది. లాభసాటి వ్యవసాయం పేరిట - అంటే మెరుగైన స్థూలజాతీయోత్పత్తి కోసం ఇన్ని కోట్ల మందిని వ్యవసాయ రంగం నుంచి తరలించి ఏ రకంగా వారికి పునరావాసం కల్పించగలరనే విషయాన్ని ఆర్థిక నిపుణులు గానీ, అభివృద్ధివాద రాజకీయ నాయకులుగానీ ప్రస్తావించడం లేదు. ఇప్పటికే కిక్కిరిసిన నగరాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువత పెచ్చుపెరిగిపోతోంది.
 
 నేటికీ పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపాధిని కల్పించగలిగేదిగా ఉన్న చిన్న. మధ్యతరహా పరిశ్రమలు ఏటికేడాది అధోగతికి చేరుతున్నాయి. ఇక ఆధునికసాంకేతికతను దిగుమతి చేసుకుంటూ నెలకొల్పుతున్న హైటెక్ పరిశ్రమలు అత్యున్నత విద్యావంతులకు, నిపుణ శ్రామికులకు మాత్రమే అదీ పరిమితంగానే ఉపాధిని కల్పిస్తున్నాయి.ఇక సేవారంగం ఇప్పటికే తలకు మించి విస్తరించింది. పైగా గ్రామాల నుంచి తరలించాలంటున్న కోట్లాది చిన్న-సన్నకారు రైతులకు, కూలీలకు హైటెక్  రంగంలోగానీ స్మార్ట్ సిటీల్లోగానీ ఉపాధి గగనమే. కిక్కిరిసిన మురికివాడల్లో సైతం వీరికి స్థానం దొరకదు. అలాంటిస్థితిలో గ్రామీణ అధిక జనాభాకు వ్యవసాయం నుంచి, భూమి నుంచి విముక్తి చెందించడం అంటే ఈ లోకం నుంచి విముక్తి చెందించడమే కాదా?
 
 ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానే పేదరైతును భూ విముక్తుడిని చేసే బృహత్తర లక్ష్యాలను రచిస్తూనే ఉన్నారు. ఇది నిన్న మొన్నటి పరిణామం మాత్రమే కాదు. రెండున్నర దశాబ్దాల క్రితమే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెరపైకి వచ్చింది. శతాబ్దాలుగా విత్తన స్వాతంత్య్రంతో వర్థిల్లిన మన రైతులు అలవికాని ధరలకు అదీ కల్తీ విత్తులు కొనేందుకు రోజుల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. పాడి-పంటలనే జంట భావన నుంచి పాడి ఎగిరిపోయింది. ఎరువుకోసం రైతును రసాయనాల వైపు పరుగులు తీయించారు.  చీడ పీడలపై విషతుల్యాలను ప్రయోగించక తప్పదన్నారు. తడిసి మోపెడైన ఖర్చులతో అప్పుల ఊబిలోకి నెట్టారు. పండించిన పంటకు మార్కెట్ మద్దతు పలకడంలేదు. అప్పుల బాధతో ఏటా వేల సంఖ్యలో అన్నదాతలకు ఆత్మహత్యలు తప్పడంలేదు.
 
 ఈ పరిణామాలన్నీ కేవలం కాకతాళీయం కాదు. పంట పొలాల్లో ప్రభుత్వాలు కోసిన ఊచకోత ఇది. మౌనంగానే సాగిన ఈ మారణహోమం మన విధాన నిర్ణేతల అభీష్టానికి అనుగుణంగానే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు చురుగ్గా జోక్యం చేసుకొని ఉంటే రైతాంగం ఈ దైన్యంలోకి దిగజారేది కాదు. కానీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదు. మెజారిటీ రైతులు భూ బంధాన్ని తెంచేసుకోవాలి. అప్పుడే అభివృద్ధి గ్రాఫ్ అనే పుష్పం వికసిస్తుంది. ఈ సూత్రీకరణ నుంచి పుట్టుకొచ్చిందే చిన్న కమతాలు లాభసాటి కావనే భావన.
 
 నిజమేనా..?, నిజంగానే చిన్న కమతాలు లాభసాటికావా..? చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవించలేరా?... కొందరు మేధావులు-ఆర్థికవేత్తలు ఔనని చెబుతున్న ఈ సిద్ధాంతాన్ని చైతన్యశీలురైన ఎందరో రైతులు తమ విజయ గాథలతో పటాపంచలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక నేషనల్ శాంపిల్ సర్వేలో హెక్టారు (రెండున్నర ఎకరాలు) భూమిలో సన్నకారు రైతు రూ. 14,754 సంపాదిస్తే, చిన్నకారు రైతు రూ. 13,001, మధ్యతరగతి రైతు రూ. 10,655, పెద్దరైతు రూ. 8,783 సంపాదిస్తున్నారు. ఈ ఎన్‌ఎస్‌ఎస్ సర్వే సందేశమేమిటో మన పాలకులు, మేధావులు గ్రహిస్తే మేలు. అలాగే దక్షిణాసియాలోని వ్యవసాయ సంక్షోభంపై ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఒక అధ్యయనం చేసింది.
 
 ‘సేంద్రియ వ్యవసాయం - 2015 అనంతరం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు శరవేగంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని సైతం పరిశీలించారు. ఈ సవాళ్లను అధిగమించిన చైనా, థాయ్‌లాండ్, మరికొన్ని దేశాల్లోని రైతుల సేద్య పద్ధతులను గమనించారు. వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడాలంటే చిన్న కమతాల్లో సాగే సుస్థిర-సేంద్రియ విధానమే మార్గమని పేర్కొంటూ ఈ నివేదికను వెలువరించారు. చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మన పాలకులకు తెలుసుకోవాలనే చిత్తశుద్ధి వుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లోనే చిన్నరైతులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. సుస్థిర-సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో తెలుగు రాష్ట్రాల్లో చిన్న రైతులు ప్రపంచానికే పాఠాలు చెప్పదగ్గ అద్భుతాలను ఆవిష్కరించారు.  
 
  ప్రకృతి సేద్య పద్ధతుల్లో 10-12 పంటలు కలిపి పండిస్తూ తాము తినగా మిగిలిన సేంద్రియ ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందడం సాధ్యమేనని చాటుతున్న అరెకరం పొలంలో ‘అన్నపూర్ణ’ నమూనా అనుభవం మన కళ్లముందుంది. అరెకరంతోనే చిన్న రైతు కుటుం బానికి సహజాహార భద్రత కల్పించడంతోపాటు భూసారం, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పద్ధతి దోహదపడుతోంది. ఉదాహరణకు.. విజయనగరం జిల్లా మర్రిగూడకు చెందిన చంద్రమ్మ అరెకరంలో ప్రకృతి సేద్యం చేస్తోంది.
 
 ఒక సీజన్(4-5 నెల)ల్లో తన కుటుంబం తినగా మిగిలిన పంట దిగుబడులను అమ్మి రూ.32,500ల ఆదాయం పొందింది. సన్నకారు రైతు కమతాల సగటు విస్తీర్ణం తెలంగాణాలో ఎకరం 5 గుంటలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం 6 సెంట్ల వరకు ఉంది. చిన్నకారు రైతుల కమతాలు రెండు రాష్ట్రాల్లోనూ సగటున మూడున్నర ఎకరాలుంది. అరెకరంలో అన్నపూర్ణ పద్ధతిలో సాగు చేసుకోవడంతోపాటు ఒక పావెకరంలో పాలీహౌస్ నిర్మించు కునేందుకు ప్రభుత్వం తోడ్పడితే, మిగతా పావెకరంలో గడ్డి పెంచుకొని పాడి పశువులను పోషించుకుంటారు. పావెకరం పాలీహౌస్‌లో మార్కెట్‌లో గిరాకీ ఉన్న కూరగాయలు, పండ్లు పండించుకొని మార్కెట్ చేసుకునేందుకు వీరికి ప్రభుత్వం సాయపడితే.. తద్వారా పొందే ఆదాయంతో చిన్న రైతులు నిలదొక్కుకుంటారు. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 3 వేల టన్నుల కూరగాయలు అవసరమవుతున్నాయి. సుమారు లక్ష చిన్న(పావెకరం) పాలీహౌస్‌లలో ఉత్పత్తి అయ్యే కూరగాయలు, పూలనూ కొనుగోలు చేసే శక్తి హైదరాబాద్‌కు ఉంది.
 
పత్తి, వరి వంటి పంటల సాగును నియంత్రించి కూరగాయలు, పూల సాగు వైపు చిన్న రైతుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే.. చిన్న రైతు సమాజానికి భారం కాడు. ప్రతి గ్రామంలో సుమారు రెండొందల మంది లాభాలు పండించే రైతులు ఉన్నప్పుడు సహజంగానే ఆ పల్లె కళకళలాడుతుంది. ఈ చిన్న చిన్న రైతులే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్లిఖించగలుగుతారు. అంతేకాదు నిజంగానే దేశం సుస్థిరాభివృద్ధి బాటపడుతుంది. పాతికేళ్లుగా ప్రభుత్వాలు ఊచకోతలు కోస్తున్నా పొలాన్ని వదిలి చిన్న రైతు పారిపోలేదు. ఎందుకంటే.. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల మతం వ్యవసాయం, సంస్కృతి వ్యవసాయం.

muralivardelli@yahoo.co.in
 - వర్ధెల్లి మురళి

సాక్షి ఎడిటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement