
వరుస కరువులు.. నేర్వని పాఠాలు
రాయలసీమలో 1960లలో ఏర్పడిన కరువును తలచుకుని ఏపీ ప్రజా నీకం నేటికీ భయంతో వణుకుతుంటారు.
రాయలసీమలో 1960లలో ఏర్పడిన కరువును తలచుకుని ఏపీ ప్రజా నీకం నేటికీ భయంతో వణుకుతుంటారు. గంజి కేంద్రాలతో ప్రజలను ఆకలి చావుల నుంచి తప్పించిన ఆ రోజులను ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో 14 రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. బీటలు వారిన పొలాలు, నెర్రెలిచ్చిన నేలలు.. నూతుల్లో నీళ్లు ఆవిరైపో యాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు ఎండిపోయాయి. బిందెడు నీళ్ల కోసం చంటి పిల్లల్ని చంకన వేసుకుని మండుటెండల్లో కిలోమీటర్ల మేర ‘క్యూ’లలో నిలు చున్న మహిళలు.. ప్రాణాధారమైన నీళ్లు లేక అల్లా డుతున్న జనం.. గ్రామీణ ప్రాంతాల్లో మరణమృ దంగం మ్రోగుతోంది అతి భయానకంగా! రెండు వరుస కరువులు సంభవించడం సుమారు రెండు దశాబ్దాల తర్వాత దేశంలో ఇదే ప్రథమం. కరువు తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఉంది. ఏపీలో తీవ్ర వర్షాభా వంతో ఏర్పడిన కరువు కారణంగా భూగర్భ జలాలు.. రెండున్నర మీటర్ల మేర పడిపోయాయి. 13 జిల్లాల్లో ఉన్న 17,366 గ్రామాలు; 97 మున్సిపాలిటీలు; 13 మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలోని ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.
359 మండలాల్లో కరువు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. అంతకు మించిన కరువు తీవ్రత సర్వత్రా కనిపిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సాధారణ సాగు విస్తీర్ణంలో 70% మేర మాత్రమే పంటలు వేశారు. 5 లక్షలహెక్టార్లలో అసలు పంటలు వేయలేదు. కృష్ణా డెల్టాలో వేసిన పంటలు సగం మేర ఎండిపోయాయి. పట్టిసీమ నుంచి నీరు అందుతుందని ప్రభుత్వం చెప్పడంతో.. ఆ మాటలు విశ్వసించి.. రైతులు అప్పు చేసి మరీ మళ్లీ విత్తుకున్నారు. కానీ.. అవి కూడా ఎండిపోయాయి. కరువులో ప్రజల్ని, రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికార యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తు న్నది. పశుగ్రాసం, మంచినీరు అందించే చర్యలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం పనులు సగటున 47 రోజులు మాత్రమే జరిగాయి. ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఇచ్చే వాటాను 60% నుంచి 40%కి తగ్గించారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి అయినప్పటికీ.. కరువులో తగిన నిధులను తెచ్చు కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం కూడా ఆధ్రప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపడం ఆశ్చర్యం. కరువు మండలాల్లో పునరావాస చర్య లకు రూ. 2 వేల కోట్లు తక్షణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే.. కేంద్రం కేవలం రూ. 433.77 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితుల్ని కేంద్రానికి నివేదించి నిధులు రాబట్టడంలో రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు తగిన చొరవ చూపకపోవడం రాష్ట్రానికి శాపంగా మారింది. గత కొన్ని దశాబ్దాలలో కనీవినీ ఎరుగకుండా ఏర్పడిన కరువు పరిస్థితుల్లో.. ప్రజలకు భరోసా కల్పించ డంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది.
కరువు ప్రాంతాల్లో ‘మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం’ పనులను 150 రోజులకు పెంచారు. కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 50 రోజుల సగటు మించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 100 రోజుల పనిని చేసిన కుటుంబాల సంఖ్య 8%. తెలంగాణలో అది 7.3% గా ఉంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, ఏడాదికి 150 రోజులకు తక్కువ కాకుండా పథకాన్ని అమలు చేయాలని ఆందోళ నలు చేసిన రాజకీయ పార్టీలు.. అధికారం చేపట్టాక వాటిని విస్మరించాయి. అంతేకాక ఇంతకు ముందు నమోదైన 52 రోజుల సగటును కూడా సాధించలేక పోవడం వారి వైఫల్యానికి పరాకాష్ట.
వేసవిలో వచ్చే నీటి కొరత యావత్ ప్రపం చాన్ని పట్టిపీడిస్తోంది. ‘నీరు’ అరుదైన వనరుగా మారి ప్రజల నీటి అవసరాలు తీర్చడం ప్రభుత్వా లకు అతి పెద్ద సవాల్‌గా మారింది. 20 దశాబ్దంలో ‘చమురు’ ప్రపంచంలో అరుదైన వనరుగా మారితే.. 21 దశాబ్దంలో ‘నీరు’.. ఆ స్థానాన్ని ఆక్ర మించింది. ‘నీటి వనరుల సంరక్షణ యాజమాన్య పద్ధతులు’పై వినూత్న విధానాలను రూపొందిం చిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు రాజేంద్రసింగ్ ‘‘దేశంలో మనకు రిజర్వ్ పోలీసు ఉంది. రిజర్వ్ ఆర్మీ ఉంది. కాని దురదృష్టవశాత్తు రిజర్వ్ వాటర్ లేదు’’.. అని నీటిని అందుబాటులో ఉంచుకోవడం ఎంత అవసరమో తెలియజెప్పారు.
విచక్షణారహితంగా భూగర్భజలాల్ని తోడివే యడం వలన భూగర్బజల మట్టాలు పడిపోతు న్నాయి. నిజానికి, భారత్‌లో లభించే తలసరి నీటి పరిమాణం.. ఇతర దేశాల కంటే ఎక్కువే అయిన ప్పటికీ.. నీటి సంరక్షణ చర్యలు లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని పరిష్కరించా లంటే.. గంగ, యమున వంటి నదులను దక్షిణాది నదులతో అనుసంధానం చేయడం తప్పనిసరి. సమీప భవిష్యత్తులో నదుల అనుసంధాన ప్రక్రియ మొదలవుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు.
ఈ నేపథ్యంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. నీటి పొదుపు, వర్షపునీటి సం రక్షణ, నీటి పునరుత్పాదకత, కరువు పరిస్థితులకు ముందస్తు సంసిద్ధత మొదలైన చర్యల్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి.
భారీ సాగునీటి ప్రాజెక్టుల తోపాటు చెరువులు, కుంటలు, ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, వాటర్ షెడ్‌లు వంటి చిన్న నీటి వన రుల అభివృద్ధిపై దృష్టి సారించి అందులో ప్రజల్ని భాగస్వాములను చేయాలి. కరువు బారిన పడే రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు తదితర సహాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బ్యాంకులు ఉదారంగా వ్యవహరించగలగాలి. కరువు నివారణకు ముం దస్తుగా తీసుకునే చర్యల్లో చిత్తశుద్ధి ఉంటే కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడం అసాధ్యం కాదని అనేక దేశాలు నిరూపిస్తున్నాయి. వాటి స్ఫూర్తిని తీసుకోగలిగితే ఇక్కడా మంచి ఫలితాలు సాధించవచ్చు.
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు మొబైల్: 99890 24579
- డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు