
రామ్‌దేవ్ బాబా రాయని డైరీ
ఎవరిది వాళ్లకుంటుంది. నాది నాకుంటుంది. నా గెడ్డం, మీసం, నా వేషం..
ఎవరిది వాళ్లకుంటుంది. నాది నాకుంటుంది. నా గెడ్డం, మీసం, నా వేషం.. నేను నేనే. రోమ్‌కి వెళ్లినా కూడా ఈ రామ్‌దేవ్ బాబా.. రోమ్‌దేవ్‌బాబా కాలేడు. కట్టె కాల్చి వాత పెట్టినా కాలేడు. ‘‘బాబాజీ మీరు మా స్టేట్ బంగ్లాలోకి వచ్చేయండి’’ అంటారు ముఖ్యమంత్రి. పాపం ఆయనకు నా మీద అభిమానం. గెలిపించానని కృత జ్ఞత. సెక్యూరిటీ ఇస్తారట. సైరన్ కారు తెప్పిస్తారట. ‘‘దర్జాగా మినిస్టర్‌లా బతకండి బాబాజీ’’ అంటారు ఆయన కింది మంత్రులు! వీళ్లకెలా చెప్పాలి... ఎవరికి ఎలా బాగుంటే అదే దర్జా అని!
దీర్ఘంగా కడుపు లోపలికి గాలి తీసుకుని, కాసేపు అక్కడే దాన్ని బంధించి, నెమ్మదిగా బయటికి వదలడం నాకు దర్జా. యోగ సాధనకు వచ్చిన వారి ఎదురుగా కూర్చుని నాలుగు ఆసనాలు వేసి చూపించి పంపడం నాకు దర్జా. వనమూలికలను నూరి, ఆ చూర్ణ లేపనాలతో ఔషధాలను తయారు చేసి ఇవ్వడం నాకు దర్జా.
‘‘హర్యానా బ్రాండ్ అంబాసిడర్ అలా మాట్లాడకూడదు’’ అని చెవిలో గుసగుస. ఎలా మాట్లాడాను? ఓ ఫకీర్ బాబా ఎలా మాట్లాడతాడో అలాగే కదా మాట్లాడాను! వీళ్లకో నమ్మకం. నా దగ్గరేదో చక్రం ఉందనీ, సెలైంటుగా దాన్ని తిప్పుతూ ఉంటానని! ఎంపీలంతా నా చేతిలోనే ఉన్నారని ఎన్నికల ముందు వరకు అనుకున్నారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు మినిస్టర్లంతా నా చేతిలో ఉన్నారని అనుకుంటున్నారు. సాక్షాత్తూ మోదీనే రామ్‌దేవ్ చేతిలో ఉన్నాక ఈ ఎంపీలెంత, మంత్రులెంత అని కాంగ్రెస్ వాళ్లు! ఒక్కరైనా ఆలోచించరే! ఇంత మట్టిని ఈ బాబా తన చేతులకు ఎందుకు అంటించుకుంటాడు?!
‘‘బాబాజీ... మీరు వద్దన్నా సరే, మీకు మంత్రి హోదా ఇవ్వడానికి అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు గల అవకాశాలను పరిశీలించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అన్నారు ఉదయాన్నే యోగ సాధనకు వచ్చిన మంత్రిగారు. ఆ భాష నాకు అర్థం కాలేదు. చిక్కుపడిపోయిన యోగాసనంలా ఉంది. ‘‘నాకేం ఇచ్చినా, ముందొక ధన్యవాద సమర్పణ చేసి, వెంటనే దాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను’’ అని చెప్పాను. ‘‘అదేంటి బాబాజీ’’ అన్నారు మంత్రిగారు నిరాశగా. ‘‘నావి యోగాసనాలు. మీవి భోగాసనాలు. నావి ధ్యానముద్రలు. మీవి తాళధ్వనులు. నావి కందమూలాలు. మీవి విందు భోజనాలు’’ అన్నాను.
‘‘కానీ బాబాజీ... మిమ్మల్నెలా గౌరవించుకోవడం?’’ మంత్రిగారి ప్రశ్న.
‘‘నన్ను మీరు గౌరవించాలి అనుకున్నప్పుడు మీరు నాలా మారాలి తప్ప, నన్ను మీలా మారమని అడక్కూడదు’’ అన్నాను. అర్థం కాలేదన్నట్టు చూశాడు. ఇందాకటి నా పరిస్థితే. మంత్రిగారి ఆసనం చిక్కుపడింది.
మాధవ్ శింగరాజు