భాజపా ‘లౌకిక’ భాష్యాలు | bjp secular interpretation by abk prasad | Sakshi
Sakshi News home page

భాజపా ‘లౌకిక’ భాష్యాలు

Published Tue, Dec 1 2015 1:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

భాజపా ‘లౌకిక’ భాష్యాలు - Sakshi

భాజపా ‘లౌకిక’ భాష్యాలు

రెండోమాట

 

‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ అనే పదాలను తొలి లక్ష్య ప్రకటన (ప్రియాంబుల్)లో అంబేడ్కర్ చేర్చలేదని, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీలో (1976) ఇందిర చేర్చింది కాబట్టి అవి దుర్వినియోగం అయ్యాయని రాజ్‌నాథ్ వాదించారు. ‘లా దినోత్సవం’ సభలో ప్రసంగించిన అటార్నీ జనరల్ ‘సెక్యులర్’ పదాన్ని వదిలేసి పదేపదే ‘సోషలిస్టు ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా ఇండియాను ప్రకటిస్తూ ఉపన్యాసం దంచాడు. ఇంకా- ఇంతకుమించి ‘రాజ్యాంగాన్ని సాగదీయొద్దని’, సెక్యులర్ పదాన్ని చేర్చి సాగదీస్తే ‘గందరగోళం, సంక్షోభం’ తలెత్తుతుందనీ బీజేపీ నేతలు అంటున్నారు. 

 

‘దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సభ వారి స్థూలాభిప్రాయం సాధించడం అత్యంత ముఖ్యం. దేశ రాజ్యాంగమే అందుకు పునాది. మా ప్రభుత్వ మతం-ముందు దేశం, రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం.’

- ప్రధాని నరేంద్ర మోదీ (డాక్టర్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా  28.11.2015న పార్లమెంటు ప్రసంగంలో)

 

‘పాలకుడనేవాడు ప్రజల ముందు అందరికన్నా ఎంతో నమ్రతతో, తల వంచుకుని వ్యవహరించాలి. ఇది ఒక్క హైందవానికి చెందిన విలువేకాదు, యావత్తు ప్రపంచం నెలకొల్పిన విలువ, సంప్రదాయం.’

- తథాగత సత్పథి, బిజూ జనతాదళ్

 (అదే సభలో సభ్యుల ప్రశంసల మధ్య చేసిన వ్యాఖ్య)

 

దయ్యాలు వేదాలు వల్లిస్తాయా? మనకు తెలియదు! అయితే ‘దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంద’నీ, ‘దెబ్బకు దెయ్యం జడుస్తుంద’నే సామెత లలో నిజముందా? ఉందని భారత ఎన్నికల చరిత్రలో ఉజ్వల ఘట్టంగా నిరూపించిన బిహార్‌లో బహుజన ఓటర్లు ఇచ్చిన తీర్పుతో రుజువైంది. నిజంగానే బీజేపీ- పరివార్ ప్రభుత్వానికి ‘దెబ్బకు దేవేంద్రలోకం’ కనిపించి నట్లయింది! బహుళ జాతుల, భాషల సమైక్య భారతదేశాన్ని చీలగొట్టే ప్రయ త్నంలో ఉన్న ఆ ప్రభుత్వానికి ఇది హెచ్చరికా? లేదా ఆ పార్టీలో ఆంతరంగిక కల్లోలానికి నిదర్శనంగా భావించాలా? బిహార్ ఫలితాల ప్రభావం విస్తరిం చకుండా, మనసులో ఉన్నా లేకపోయినా తాత్కాలిక ‘వైరాగ్యా’న్ని భాజపా ఆశ్రయించదలచినట్లుంది.

 

ఆ పదాల మీద ఎందుకీ శషభిషలు?

రాజ్యాంగంలోని ‘ప్రియాంబుల్’ (లక్ష్య నిర్వచనం)లో దేశాన్ని మతాతీత లౌకిక వ్యవస్థగా, సెక్యులర్, సోషలిస్టు, గణతంత్ర ప్రజాస్వామ్య ‘రిపబ్లిక్’ స్థాపన ధ్యేయం కలిగినదని పేర్కొన్నది.  ఈ లక్ష్యానికి  తూట్లు పొడవటంలో కాంగ్రెస్ గాని, బీజేపీ- పరివార్ గాని, లేదా ఈ రెండింటి సారథ్యంలో పదవుల కోసం ఎగబడిన యూపీఏ, ఎన్‌డీఏ కూటాలు గానీ - ఎవరికెవరూ తీసిపోలేదు. పాతతరం నెలకొల్పిన కొన్ని మంచి సంప్రదాయాలతో కాంగ్రెస్ నెట్టుకొచ్చిందే గాని, ‘పాతపుణ్యం’తో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపో యింది. కానీ బీజేపీ - పరివార్ ప్రభుత్వాలకు ఆ మాత్రపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన సైద్ధాంతిక మెలకువలు కూడా లేక సంకుచితమైన దృక్పథానికి మళ్లినాయి.

 

బిహార్ ఫలితాల తర్వాత నేడు  భారతదేశం లక్ష్యం ‘వసుదైక కుటుంబకం’ అనీ, భారతీయ తత్త్వచింతన ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనీ మోదీ ప్రకటిస్తున్నారు. సంతోషం. కానీ, దేశంలో బహుళజాతుల, బహుభాషా సంస్కృతులతో వెలుగొందవలసిన బహు జనుల, బహు ధర్మాలకు సరిసమానంగా వర్తించవలసిన వాటిని కేవలం ‘హిందూత్వ’ సిద్ధాంతానికి ఆపాదించడం సరికాదు. అలాగే, ఆయన ప్రాతి నిధ్యం వహిస్తున్న బీజేపీని ఇప్పుడైనా సెక్యులరిజానికి, రాజ్యాంగానికి బద్ధు రాలిని చేయగలుగుతారా? వైరాగ్యాలలో ఆపద మొక్కుల (ఎలాగైనా బయ టపడవేయమని) వైర్యాగం ఒకటి! కాకపోతే, ఇదంతా బిహార్ గాయాల నుంచి తేరుకొనేందుకు పన్నిన తాజా చిట్కా కావచ్చు.

 

ఇదేనిజం కాకుంటే సెక్యులరిజం, రాజ్యాంగం పట్ల ఏకాభిప్రాయం వినిపించకుండాఇప్పటిదాకా బీజేపీ నాయకులు తలా ఒక స్వరం ఎందుకు  వినిపించినట్టు? ఒకవైపున ‘రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం’ అని మోదీ ప్రకటించారు. ఇంకో వైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ‘సెక్యులరిజం’ అన్న పదాన్ని వాడుతున్న తీరుకు ఆక్షేపణ చెప్పారు. అంతకుమించి స్పష్టంగా విశ్లేషించలేకపోయారు. ఈ పదా న్ని ‘దేశంలో దుర్వినియోగం చేస్తూ, వ్యతిరేకిస్తు’న్న వారు బీజేపీ నాయకులు. ఆ నిందను రాజ్‌నాథ్ ఇతరుల మీదకి నెట్టాడు. సహనం కోల్పోయిన పరి వార్; మేధావుల మీద, రచయితల మీద జాతీయ మైనారిటీలపైన, వారి ప్రార్థనా మందిరాలపైన తమ క్యాడర్‌తో దాడులు చేయిస్తూ, ఎదుటివారి కళ్లల్లోని నలుసులు వెతుకుతోంది.

 

పైగా, ‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ పదాలను తొలి లక్ష్య ప్రకటన (ప్రియాంబుల్)లో అంబేడ్కర్ చేర్చలేదని, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ కాలంలో (1976) ఇందిరాగాంధీ చేర్చింది కాబట్టి అవి దుర్వినియోగమయ్యాయని వాదించారాయన.  ‘లా దినోత్సవం’ సభలో అదే రోజు ప్రసంగించిన అటార్నీ జనరల్ ‘సెక్యులర్’ పదాన్ని వదిలేసి పదే పదే ‘సోషలిస్టు ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా ఇండియాను ప్రకటిస్తూ ఉపన్యాసం దంచాడు. ఇంకా, ఇంతకుమించి ‘రాజ్యాంగాన్ని సాగదీయొద్దని’, సెక్యులర్ పదాన్ని చేర్చి సాగదీస్తే ‘గందరగోళం, సంక్షోభం’ తలెత్తుతుందనీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ ఎలాంటి గందర గోళంలో పడిందో దీనితో స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఒక చారిత్రక సత్యాన్నీ, మారని బీజేపీ మౌలిక ఆలోచననూ గుర్తు చేసుకోవాలి. వాజ్‌పేయి హయాంలో ప్రియాంబుల్‌నుంచి సెక్యులరిజం పదంతోపాటు ‘సోషలిజం’ అన్న పదాన్ని కూడా తొలగించడానికి  ప్రభుత్వ సలహాపైన అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జి చేసిన ప్రయత్నాన్ని మరవరాదు!

 

ఎందుకీ వక్ర భాష్యాలు?

 హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్ మూల పురుషులలో ఒకరు డాక్టర్ బి.ఎస్. మాంజీ నెలకొల్పిన సంకుచిత సంప్రదాయమే నేటికీ బీజేపీలో చిలవలు పలవలుగా అల్లుకొంటున్నది. డాక్టర్ మాంజీ ఇటాలియన్ నియంత ముస్సో లినీని, జర్మన్ ఫాసిస్టు నియంత నాజీ హిట్లర్‌ను కలుసుకుని ‘ఆర్యజాతి’ సిద్ధాంతం గురించి చర్చలు జరిపివచ్చినట్టు విన్నాం. 1948 నవంబర్‌లో బిహార్‌కు చెందిన ప్రముఖుడు ఆచార్య కె.టి. షా ముసాయిదా రాజ్యాం గంలోని 1వ అధికరణ, తొలి క్లాజులోనే ‘సెక్యులర్, ఫెడరల్, సోషలిస్టు’ పదా లను చేర్చాలని సవరణ ప్రతిపాదించగా అంబేద్కర్ నిరాకరించిన విష యాన్ని బీజేపీ నాయకులు ప్రచారంలోకి తెస్తున్నారు. ‘ప్రియాంబుల్’ను మార్చడానికి దానిని ఒక చిట్కాగా చూస్తున్నారు. నిజానికి అప్పటికి రాజ్యాంగ రచనే నిర్దిష్టరూపం తొడగలేదు. ఎందుకంటే ‘ఆదేశిక సూత్రాల’ను (డెరైక్టివ్ ప్రిన్సిపల్స్) రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు దన్నుగా చేర్చారు, వాటి ప్రకారమే పౌరులకు ప్రాథమిక హక్కులను వర్తింపచేయాలి. సెక్యుల రిజం విశ్వవ్యాపిత సత్యమని భావించి,  పాలకుల మీద విశ్వాసంతో బహుశా ఆ పదం అవసరాన్ని అంబేడ్కర్ పరిగణనలోనికి తీసుకుని ఉండకపోవచ్చు.

 

అంతేగాదు, పాలకులు రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలను పక్కదోవ పట్టించి పౌరుల ప్రాథమిక హక్కులకే (సొంత ఆస్తుల మోతుబరులకు స్వప్రయోజనపరులకు) రక్షణ కల్పించడంపైన శ్రద్ధ వహించే ప్రమాదముం దని కూడా ఆయన ఊహించలేదు. కాని ఆచరణలో ఆ ప్రమాదం తన కళ్ల ఎదుటే మొగ్గ తొడుగుతున్నందున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అంబే డ్కర్- ‘దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా, ప్రజాబాహుళ్యానికి సామా జిక, ఆర్థిక స్వాతంత్య్రం సమకూరకపోతే ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ పార్లమెంటును కూల్చివేయడానికి కూడా ప్రజలు సంకోచించర’ని అరవ య్యేళ్ల నాడే చాటిన వాడు అంబేద్కర్.

 

సుప్రీంకోర్టు ఎప్పుడో ఆదేశించింది!

పాలకులు ఆదేశిక సూత్రాలను మోసగించి, ప్రైవేట్ ఆస్తుల పరిరక్షణకు రాజ్యాంగాన్ని తాకట్టుపెట్టారు. జీవనోపాధికి, తిండికి, గృహవసతికి అను నిత్యం పాట్లు పడుతూన్న ప్రజా బాహుళ్యానికి వెసులుబాటు కల్పించగల అధికారాన్ని పాలకులకు కట్టబెట్టినవి ఆదేశిక సూత్రాలు. వీటికీ సున్న చుడుతూ, కార్పొరేట్ సామ్రాజ్యాల ఎదుగుదలకు, బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకు పాలకులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. సమానత్వ సూత్రాన్ని అడుగడుగునా చాటుతున్న రాజ్యాంగ అధికరణలనూ, హేతువా దాన్నీ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలన్న విస్పష్టమైన ఆదేశాలనూ పక్కకు నెట్టి, మూఢవిశ్వాసాలను పెంచుతూ రాజకీయ ప్రయోజనాలను కాపాడు కుంటున్నారు. ఈ పరిణామాన్నీ అంబేడ్కర్ ఊహించలేదు.

 

సెక్యులరిజాన్నీ, సోషలిజాన్ని, ప్రజాస్వామిక రిపబ్లికన్ వ్యవస్థనూ రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీం కోర్టు (1973/1974/1997) ఎమర్జెన్సీకి చాలా ముందు గానే పేర్కొన్నదని మరచిపోరాదు. అసలు ‘భారత ప్రజలమైన మేము’ అని దేశ ప్రజలే రాజ్యాంగాన్ని తమకు తాముగా అంకితం చేసుకున్న తరువాత - అదే సర్వసమ్మతమైన ప్రజాభిప్రాయంగా చెలామణీ కావాలన్నదే శాసనం! అదే, దేశ ప్రజలందరి హక్కుల పత్రం, అదే భారతదేశంలో నివసించే వారం దరి సమష్టి భావన, సమన్యాయం! ఇంతకూ సుద్దులు వల్లించే అవకాశవాద రాజకీయులూ, అంబేద్కర్‌ను తమ రాజకీయ అవసరానికి వాడుకోజూచే పాలకులూ అంబేద్కర్ ధర్మచింతనగా వెలువడిన ‘రిడిల్స్ ఆఫ్ హిందూ యిజం’ గ్రంథానికి (హైందవంలో అర్థం కాని చిక్కు ప్రశ్నలు) ఈ క్షణం దాకా సమాధానం ఇవ్వలేకపోవటం భావదారిద్య్రమా? 

 

రాజకీయ సంస్థలకు మత సంస్థలతోనూ, మత సంస్థలకు రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధం ఉండరాదని రాజ్యాంగ ముసాయిదా రచన తుది ఘడియలలో (1946-47) అనంతశయనం అయ్యంగార్ ప్రతిపాదించారు. ఆమోదం కూడా పొందిన ఆ విశిష్ట తీర్మానాన్ని అందరూ కలసి ఏ గంగలో కలిపారో! ఏవో కొన్ని బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేందుకు అవకాశవాద రాజకీయాలకు పాల్ప డడం మంచిది కాదు.!

 

 - ఏబీకే ప్రసాద్

 సీనియర్ సంపాదకులు

 abkprasad2006@yahoo.com.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement