రెండో మాట
‘‘ఇటీవల అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క రాష్ట్రం (అసోం)లో కాగా, మిగతా రాష్ట్రాల ఫలితాలను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఆ పార్టీ సాహసించింది. రెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేసుకుంటోంది.’’
- ఎన్డీఏ భాగస్వామి శివసేన (22.5.2016).
గంగలో మునిగిపోతున్నవాడు గడ్డిపోచను ఆసరా చేసుకున్నట్టు ఈశాన్య భారతంలో ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఆపద్ధర్మ ఐక్య సంఘటన ఆసరాతో అధికారంలోకి వచ్చిన బీజేపీ-ఆరెస్సెస్ పరివారం మిగతా నాలుగు రాష్ట్రాలలో చతికిలపడినా ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు పాకి వచ్చే వ్యూహాన్ని వదులుకోలేదు! ఇందులో భాగంగానే అది అత్యంత వివా దాస్పద విధానాల ద్వారా, సమాజాన్ని చీలుబాట్ల వైపు నడిపించే వ్యూహం ఫలితంగా వ్యవస్థ ‘గాయపడక’ తప్పని స్థితిలో తన రెండేళ్ల పాలనా రథాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఉత్సవాలను జరుపుకునే ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలకు, పొంతనలేని ప్రకటనలకూ మోదీ ప్రభుత్వం ఒడిగట్టింది.
ప్రభుత్వం జరుపుకునే విజయోత్సవాలకు బలమైన పునాది ఉండాలి. ఆ ప్రభుత్వం విభిన్న మతధర్మాలు, భాషాసంస్కృతులు, బహుళ జాతుల, మైనారిటీల, ఆదివాసీ తెగల, దళిత బహుజనుల విశాల ప్రయోజనాలను సంరక్షించగల సెక్యులర్ వ్యవస్థకు అండదండలు అందించగల ప్రజాస్వామిక పునాదిపైన మనుగడ సాగించగల ప్రభుత్వంగా ప్రజా బాహుళ్యం భావించాలి. ఈ సందర్భంగా పండిత మదన్‌మోహన్ మాలవ్యా ‘జాతీ యత’కు ఇచ్చిన విశిష్టార్థాన్ని గుర్తించటం అవసరం. ‘భారత ప్రజలమైన మనం - అంటే హిందువులు, ముస్లిములు, పార్శీలు, క్రైస్తవులు ప్రపంచం లోని మహా ప్రాచీన నాగరికతలకు వారసులైన వీరంతా కలిపే భారత ప్రజలని మరవరాదు’. ఇప్పుడా భావనను చెదరగొట్టే యత్నాలకు ఎన్డీఏ పాలనలో యత్నాలు పెచ్చరిల్లడం వల్ల ఇంతకుముందెన్నడూ లేనంతగా (గాంధీజీ హత్య ఉదంతాన్ని మినహాయిస్తే) గత రెండేళ్ల కాలంలో దేశ వ్యాపితంగా అభద్రతాభావం ఏర్పడింది.
మాట మారుస్తున్న మోదీ
ఒక్క మూడు మాసాల వ్యవధిలోనే బీజేపీ నాయకుల నాలుకలు తిరగబడిపోయాయి. అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ పదవీ స్వీకరణో త్సవంలో మోదీ మాట్లాడుతూ ‘దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఇంతకు ముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పాత్ర వహించాయని’ కితాబిచ్చారు (25.05.16). కానీ మూడు నెలలనాడే పార్లమెంటులో ‘దేశంలో దారిద్య్రాన్ని పెంచే మొక్కలను కాంగ్రెస్ నాటింద’ని మోదీ చెప్పారు. నిజానికి ఇన్నాళ్లుగా కాంగ్రెస్ (యూపీఏ)గానీ, తర్వాత బీజేపీ (ఎన్డీఏ) పాలకులుగానీ ‘అభివృద్ధి’ నినాదం చాటున అవినీతితి పెంచుతూ వచ్చారు. ‘హిందుత్వ’ నినాదం చాటున ఈ రాజకీయ కేంద్ర పాలనను చాటు చేసుకుని హేతువాద సంస్థల పైన, ఆర్టీఐ చట్టం కింద పాలక పక్షాల నాయకుల, సభ్యుల అవినీతికర చర్యలను బయటపెడుతున్న సామాజిక కార్యకర్తలపైన వేధింపులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి!
‘ప్రజాధనం దోపిడీని, అవినీతిని నిలవరించేశాం’ అని రెండేళ్ల ‘ప్రోగ్రెస్ చిట్టా’లో మోదీ ప్రకటించారు గానీ, ఆచరణలో బ్యాంకులు, జీవిత బీమా సంస్థలలో ప్రజల సొమ్మును దోపిడీ చేసి, మొండి బకాయిల కింద లక్షల కోట్ల రూపాయలను దిగమింగి ఉడాయించిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలపై తీసుకున్న నిర్దిష్ట చర్యల గురించి, రాబట్టుకొన్న ‘బ్లాక్‌మనీ’ విలువ ఎంతో చెప్పడంలో విఫలమయ్యారు! లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటివారు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా దోచుకుని దేశం విడిచిపోతే, మనం వేలు విడిచిన ‘బ్రిటిష్ మామ’ అక్కున చేర్చుకుని ‘మాల్యా మా పౌరుడు’ అతడిని ముట్టుకోడానికి వీల్లేదు, మీ ఇంటర్‌పోల్ కూపీలు ఇక్కడ చెల్లవని దండోరా వేస్తే - ఈ రెండేళ్లలోనూ మోదీ ప్రభుత్వం నోరు మెదపలేని దుస్థితి! కానీ మోదీ ‘వికాస పురుషుడు’ కాడని విమర్శించిన ఉమాభారతి మోదీ మంత్రిమండలిలోనే కొనసాగు తున్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులూ కొనసాగుతున్నారు.
అన్నిటా వైఫల్యాలే
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 1200 పాత చట్టాలను సవరించడమో, తొలగించడమో జరిగిందని మోదీ ప్రకటించుకున్నారు. అదే చేత్తో ప్రశ్నించే న్యాయవ్యవస్థపై కన్నెర్ర చేస్తున్నారు. పౌరహక్కుల్ని, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని, బాధ్యతలను గుర్తుచేసే ప్రజానుకూల నిబంధనలను కాలరాస్తూ ‘దేశద్రోహం’ పేరిట పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే సెడిషన్ చట్టాన్ని తొలగించలేదని మరచిపోరాదు! అలాగే బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భారతదేశంలో అన్ని శాఖలలో సామ్రాజ్య రక్షణ కోసం సాగు భూములపైన ఉన్న హక్కుల్ని అణచివేసి, భూములను బలవంతాన గుంజుకోడానికి తెచ్చిన చట్టాన్ని కూడా మోదీ ప్రభుత్వం తొలగించలేదు. సరికదా విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు భూమిని కట్టబెట్టడానికి ‘భూ సేకరణ’ సమీకరణకు వీలుగా రైతాంగాన్ని బలవంత పెట్టగల బిల్లును ప్రవేశ పెట్టడమూ ఈ రెండేళ్లలోనే జరిగింది! వ్యవసాయోత్పత్తులను బలవంతుల జూదగొండితనానికి కేంద్రమైన షేర్ (స్టాక్) మార్కెట్లో అనుమతించడాన్ని మోదీ ప్రభుత్వం నిషేధించలేక పోయింది. దేశవాళీ సంతల్లో దళారీలను తొలగించి వ్యవసాయోత్పత్తులకు రక్షణ కల్పించలేక పోయింది.
ఇక ఆర్థిక రంగం చూద్దాం. ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణల ప్రభావం మన్మోహన్ సింగ్ హయాంలోకన్నా మరింతగా దేశీయ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోంది. రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరికలను లెక్కజేయకుండా తగాదాలు పడినంత మాత్రానగాని, సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు ఆయనను తొలగించి పారేయమని సలహాలిచ్చినంత మాత్రానగాని అమెరికా తాఖీదులపై నడిచే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. సంస్థల ప్రభావంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభాల ఊబినుంచి బయటపడే అవకాశం లేదు. ఇది మోదీకి తెలుసు. పెట్టుబడిదారుల్ని ‘వాస్కోడిగామాలై తరలిరండి’ అని ఆహ్వాన పత్రాలు పంచిన మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే మన దేశీయులే స్వయంగా సరుకులు ఉత్పత్తి చేయాలని కోరుతున్నారా? లేక ‘వాస్కోడిగామాలై తరలివచ్చే విదేశీ గుత్త పెట్టుబడిదారులు ఇండియాకు వచ్చి సరుకులు తయారుచేసి పెట్టమని’ చెబుతున్నారా అన్నది తేలడం లేదు!
బ్యాంకులు సహా భారత పరిశ్రమలలోకి 29 శాతం నుంచి 49 శాతానికి విదేశీ గుత్త పెట్టుబడులను అనుమతించిన మన్మోహన్ సింగ్‌ను ప్రధాని మోదీ ఇప్పుడు వెనక సీటులో కూర్చోబెట్టి, ‘దేశాభివృద్ధికి విదేశీ గుత్త పెట్టుబడులను 49 శాతం నుంచి 100 శాతానికి పెంచితేగాని ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి న్యాయం చేయలేమనుకున్నట్టున్నారు. ప్రజల కష్టార్జితాలుగా వెలుగు చూస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను దేశ, విదేశీ గుత్తేదారి సంస్థలకు అయినకాడికి ధారాదత్తం చేసే మార్గంలో ముందుకు వేగంగా సాగుతూం డటం కూడా ఈ రెండేళ్లలోనే ఉధృతం అయింది. ఇక విదేశాంగ విధానం - ఏ దేశంతోనూ గర్వించదగ్గ సత్సంబంధాలను మోదీ నెలకొల్పలేకపోయారు. ఒక్క బంగ్లాదేశ్‌తో తప్ప (అదీ, అసోం బంగ్లాల మధ్య ముస్లింల వలసల కారణంగా) చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో సరిహద్దు వివాదాలు, సమస్యలు ఒక్కటీ కొలిక్కి రాలేదు.
ఇదేమి ప్రజాస్వామ్యం?
‘ప్రజాస్వామ్యానికి 500 లక్షణాలను పేర్కొన్న డేవిడ్ కొలియర్, స్టీవ్ లెవెస్కీ లాంటి ప్రసిద్ధ రాజకీయ శాస్త్ర పరిశోధకులు ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’ అన్న పదానికి ఒకే అర్థమే కానీ, రెండో అర్థం లేదని చెప్పారు. కానీ వీరు ప్రజాస్వామ్యానికి 500 లక్షణాలలో - ఏ ప్రజాస్వామ్యం మోయార్డ్ కీన్స్‌ది, ఏది మార్షల్‌ది, ఏది కారల్ మార్క్స్‌ది, ఏది ఒబామాది, మరేది ట్రంప్, మోదీల మార్కు ప్రజాస్వామ్యమో నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది! అలా ఎంపిక చేసుకునే బాదరబందీ పడలేకనే బహుశా రూసో మహనీయుడు నికార్సయిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి ఏది గీటురాయో ఇలా నిర్వచించి పోయాడు: తరతమ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ సరుకుల్ని, సేవల్ని (సర్వీసులు) సమాన ఫాయాలో అందించలేని ప్రజా స్వామ్యం ఓ కాగితపు పులి మాత్రమే!
నిజమైన ప్రజా ప్రభుత్వం స్థిరంగా నిలదొక్కుకోవాలంటే - ఎలాంటి అదుపూలేని వ్యక్తుల సంపద ఐశ్వర్యాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. ప్రజా శ్రేయస్సును కోరే పాలనా వ్యవస్థలో కోటీ శ్వరులకూ, మహా కోటీశ్వరులకూ చోటుండరాదు. వీరందరిదీ ఒకే మూస. వీరిలో ఒకర్ని కాదని మరొకర్ని ఆదరించలేం. సర్వజన శ్రేయస్సుకూ, సమష్టి శ్రేయస్సుకూ వీరు విఘాతం. వీరిని అనుమతించిన చోట - ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు బేరసారాలకు లోనయ్యే అంగడి సరుకుగా మారిపోతాయి.’ బీజేపీకి రాజకీయ, ఆర్థిక, దేశ వైదేశిక విధానాల రూపకల్పనకు అవసరమైన సైద్ధాంతిక పునాది లేక, కేవలం ఆరెస్సెస్ మత సంస్థ నీడలోనే తన ఉనికిని సమర్థించుకోవాలని భావించడంవల్ల దేశానికి దిశా, దశా గతిని నిర్ణయించ డంలో ఘోరంగా విఫలమయింది!
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
ప్రకాశం కరువైన వికాసం
Published Tue, May 31 2016 12:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement