రాజకీయాలలో ఆటవిడుపు
పతనమవుతున్న విలువలకు కొంచెం ఊపిరి పోసినందుకు దేశ ప్రజలందరూ సిద్ధ్ధూకు సెల్యూట్ చేయవచ్చు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దేశమంతటా విస్తరించి ఉంది. అటువంటి పార్టీనీ, రాజ్యసభ సభ్యత్వాన్నీ వదులుకుని ఆప్ వంటి చిన్న పార్టీవైపు చూస్తున్న సిద్ధూను ఫిరాయింపుల ఆకర్షణలో పడ్డ మన తెలుగు రాష్ట్రాలలో ప్రజాప్రతినిధు లంతా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. విధానాలు నచ్చనప్పుడు ఆ పార్టీని విడిచిపోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉండాల్సిందే.
దేశంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల అధికార రాజకీయాల పోకడ వైపు మళ్లీ ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించేటట్టు చేశాయి. నవ్విపోదురు గాక నాకేటి వెరపు అన్న చందంగా రాజకీయాలు నడుపుతున్న అధికార పక్షాలూ, అత్యంత హేయంగా అమ్ముడు పోయేందుకు సిద్ధపడుతున్న ప్రజా ప్రతినిధులూ ఒక్కసారి ఉలిక్కిపడే విధంగా సాగాయి ఆ పరిణామాలు. బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తున్నప్పటికి, ఎప్పుడు మిన్ను విరిగి న్యాయవ్యవస్థ రూపంలో మన మీద కూడా పడుతుందోనన్న ఆందోళనలో ఈ అధికార పక్షాలన్నీ పడ్డ మాట వాస్తవం.
అరుణాచల్‌ప్రదేశ్ వ్యవహారంలో గతవారం సుప్రీం కోర్టు వెలువ రించిన నిర్ణయం మొదటిదయితే, మూడు నెలలయినా పూర్తి కాకుండానే బీజేపీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలిపెట్టి, ఆ పార్టీకి కూడా నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంఘటన రెండవది. అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడటానికి కారణమైన సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఇదే వరసలో మొదట ఉంటుంది.
క్రీడకు విలువే ముఖ్యం
తాజాగా జరిగిన ఘటన గురించి మాట్లాడుకుంటే బీజేపీ నాయకుడు, మాజీ క్రికెటర్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మూడునెలల క్రితం పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మీద మిశ్రమ స్పందన వచ్చింది. రెండుసార్లు టికెట్లు ఇచ్చి లోక్‌సభకు తనను గెలిపించిన పార్టీకి ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడాన్ని కొందరు తప్పు పట్టారు. 2004లో మొదటిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక రెండేళ్లకే ఒక ప్రమాదం కేసులో జైలుకెళ్లిన సిద్ధూకు, 2009లో మరోసారి టికెట్ ఇచ్చి గెలిపించిన విషయం మరచి పార్టీకి ద్రోహం చేశాడని మరికొందరు విమర్శిస్తున్నారు. అకాలీదళ్- బీజేపీ స్నేహం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా కొంతకాలంగా సిద్ధూ, పార్టీల మధ్య ఎడమొహం పెడమొహం అన్నట్టుగానే ఉంది. నిజానికి మొన్న ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం కూడా ప్రేమతో కాదు, రాబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఆ పనిచేసిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ శాసనసభ మీద కూడా కన్నేసింది. 2014 పార్లమెంట్ ఎన్నికలలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంజాబ్‌లో ఆప్ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతో ఆ పార్టీకి పంజాబ్ మీద కొత్త ఆశలు కలగడం సహజమే. అందుకు జనాకర్షణ గల నాయకుడూ అవసరమే. నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు, ఆప్‌కు ఆయన అవసరం ఉంది. అందుకే ఆయన పార్టీకీ, పదవికీ రాజీనామా చేశారు.
ఇక నేడో రేపో సిద్ధూ ఆప్‌లో చేరడం ఖాయం. సిద్ధూను విమర్శిస్తున్న వాళ్లు మన రెండు తెలుగు రాష్ట్రాలలో గెలిచినవారు పార్టీని విడిచి అధికారపక్షం పంచన చేరడాన్ని ఇంకెంత ఎవగించుకుంటారో! సిద్ధ్ధూ తన రాజీనామా లేఖలో తప్పా ఒప్పా అన్న విషయం అలా ఉంచితే యుద్ధంలో తటస్థంగా ఉండటం కుదరదు అన్నాడు. నా పంజాబ్ మార్గాలన్నీ మూసేశారు అని కూడా వాపోయాడు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆమోదించారు.
సిద్ధ్ధూ విలువలకు కట్టుబడి రాజీనామా చేయడాన్నీ, ఆ రాజీనామాను రాజ్యసభ ైచైర్మన్ రాజకీయ అవసరాల కోసం ఆపి పెట్టకుండా వెంటనే ఆమోదించడాన్నీ అందరూ అభినందించాలి. సిద్ధ్ధూ తన పార్టీలో చేరి పంజాబ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచి విజయం వైపు నడిపిస్తాడని బహుశా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు సెల్యూట్ చేసి ఉంటాడు.
అలాంటి విలువలను ఊహించగలమా!
కానీ పతనమవుతున్న విలువలకు కొంచెం ఊపిరి పోసినందుకు దేశ ప్రజ లందరూ సిద్ధ్ధూకు సెల్యూట్ చేయవచ్చు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దేశమంతటా విస్తరించి ఉంది. అటువంటి పార్టీనీ, రాజ్యసభ సభ్య త్వాన్నీ వదులుకుని ఆప్ వంటి చిన్న పార్టీవైపు చూస్తున్న సిద్ధూను ఫిరాయిం పుల ఆకర్షణలో పడ్డ మన తెలుగు రాష్ట్రాలలో ప్రజా ప్రతినిధులంతా ఆద ర్శంగా తీసుకుంటే బాగుంటుంది. విధానాలు నచ్చనప్పుడు ఆ పార్టీని విడిచి పోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉండాల్సిందే. అటువంటప్పుడు ఆ పార్టీ ద్వారా లభించిన పదవిని సిద్ధూవలె వదిలేసి కొత్త పార్టీకి వలస వెళ్లి, ఆ పార్టీ టికెట్‌తో మళ్లీ పోటీ చేసి గెలిస్తే రాజకీయాలలో విలువలను కాపాడిన వాళ్లవు తారు. రాజ్య సభ సభ్యత్వాన్ని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన సిద్ధ్ధూను, ఆ పదవిని కాపాడుకోవడం కోసమే, పార్టీ మారినా టీఆర్‌ఎస్ కండువా మాత్రం కప్పుకోని మరో పార్లమెంట్ సభ్యుడు సుఖేందర్‌రెడ్డిని పక్క పక్కన నిలబెడితే ప్రజలు ఎవరిని గౌరవిస్తారు? కేంద్రంలో, రాష్ర్టంలో అధికారంలో ఉన్న పార్టీని విడిచి పెట్టి, పదవిని త్యజించి, తలదాచుకునే తావయినా సరిగ్గా లేని చిన్న పార్టీ వైపు చూస్తున్న సిద్ధూ పక్కన, తెలంగాణ రాష్ర్టం ఇచ్చి, తనకూ టికెట్ ఇచ్చి గెలిపించిన కాంగ్రెస్‌ను వీడి అధికార పక్షం పంచన చేరిన సుఖేందర్‌రెడ్డిని నిలబెట్టడం కూడా సరి కాదేమో!
సభాపతులు, అధికార పార్టీలు నేర్చుకోవాలి
ఇక ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ వ్యవహారాలలో బీజేపీకి జరిగిన శృంగ భంగం చూశాకయినా తెలుగు రాష్ట్రాల సభానాయకులు పార్టీ ఫిరాయించి తమ చెంత చేరిన వారి చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళితే పరువు ప్రతిష్టలకు వాటిల్లిన నష్టం కొంతయినా భర్తీ అయ్యేదేమో! సభా నాయకులు ఆ పని చేయనప్పుడు, ఫిరాయించిన వారి మీద అందిన ఫిర్యా దులను పరిగణనలోకి తీసుకుని సభాధ్యక్షులు వారి మీద చర్యలు తీసుకుంటే ఆ వ్యవస్థల ప్రతిష్టా నిలబడుతుంది. కానీ వ్యవస్థలకు ఒక ప్రతిష్ట ఉందన్న విషయాన్ని మన సభాధ్యక్షులు మరిచిపోతున్నారు.
అధికార పక్షాన్ని వీడిన సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసిన సభాధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్షం వైపు చేరిన సభ్యురాలిని ఓటింగ్‌కు అనుమతించడం ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ వ్యవహారంలో చూశాం. ఉత్తరాఖండ్ వ్యవహా రంలో కేంద్ర ప్రభుత్వం తనతోపాటు రాష్ర్ట పతి ప్రతిష్టను కూడా వివాదాస్పదం చేస్తే, అరుణాచల్‌ప్రదేశ్‌లో గవర్నర్‌ల వ్యవస్థ ప్రతిష్ట బజారు పాలయింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న ప్రహసనం ఒక్కసారిగా దేశమంతా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లోపభూయిష్టత మీద చర్చకు తెరలేపాయి.
పార్టీ మారిన మరుక్షణం చట్టసభలలో వారి సభ్యత్వం రద్దు కావాలన్న డిమాండ్ దేశమంతటా పలు రాజకీయపక్షాల నుంచి వినిపిస్తున్నది. చట్ట సభల సభాధ్యక్షుల వ్యవస్థ ప్రతిష్ట మసకబారడం ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరం. అయితే పరిస్థితి ఈ రకంగా దిగజారడానికి రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి. అత్యున్నత పదవిని అధిష్టించాక కూడా పక్ష పాతం వహించే సభాధ్యక్షులు కూడా బాధ్యులే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్టీ ఫిరాయింపుల చట్టానికి పకడ్బంది సవరణలు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే మంచిది. పార్టీ ఫిరాయింపుల చట్టం మీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి సమర్పించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు మీద, లేదంటే ప్రభుత్వమే అధికారికంగా ఈ విషయంలో రాజ్యాంగ సవరణ తెచ్చి చట్టాన్ని పటిష్టం చేయాలి.
పార్టీ ఫిరాయింపులు ప్రజలకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ప్రవర్తిస్తున్న రాజకీయ పార్టీలు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భారత రాజ్యాంగం పీఠికలో తొలిపంక్తి ‘భారత ప్రజలమైన మేము’ అని మొదలు పెట్టి ... ఆమోదించి, చట్టబద్ధం చేసి ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమ ర్పించుకుంటున్నాం అని ముగుస్తుంది. మరి ఆ ప్రజల రాజ్యాంగానికి కట్టు బడి ఎన్నికలలో గెలిచినవారు ఆ తరువాత మేం ప్రజలకు జవాబుదారీ కాదు అంటే కుదరదు. రాజ్యాంగం మీద ప్రమాణాలు చేయడం, ఏడాదికోసారి అంబేడ్కర్ జయంతులూ, వర్ధంతులూ జరపడం, భారీ విగ్రహాలు నెల కొల్పడంతో సరిపోదని నేతలు గ్రహించాలి.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com