న్యూఢిల్లీ: ఢిల్లీకి కేంద్ర సాయంగా ప్రణాళికేతర వ్యయం కింద రూ. 395 కోట్లు కేటాయించింది. 2015-15 ఆర్థిక సంవత్సరం కోసం శనివారం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయించారు. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం అధికం. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రణాళికేతర వ్యయంలో కేంద్ర పన్నులు, సుంకాల వాటాగా రూ. 325 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం అత్యధికంగా రూ. 394.99 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇది రూ. 69.99 కోట్లు అధికం. అంతే కాకుండా గత 14 ఏళ్లలో ఇంత మొత్తంలో దీనికి కేటాయించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2001-02లో ఢిల్లీకి రూ. 325 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి ఏ ఆర్థిక ఏడాదిలో కూడా అంత కంటే ఎక్కువ మొత్తం ఇవ్వలేదు.
అసంతృప్తిలో ఆప్
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాత్రం కేంద్ర బడ్జెట్‌లో ఢిల్లీకి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద నామామాత్రంగా కొన్ని కేటాయింపులు తప్ప ఢిల్లీకి చేసిందేమీ లేదని ఆరోపించింది. రాష్ట్రం విద్యుత్ కొరత, నీటి కటకటతో అల్లాడుతోందని చెప్పింది. వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుండటంతో భారీ విద్యుత్ కోతలు తప్పటం లేదని తెలిపింది. అంతేకాకుండా విద్యుత్ లోడ్ పెరిగి కొన్ని ప్రధాన విద్యుత్ సరఫరా లైన్లు ట్రిప్ అవుతున్నాయంది. నీటి ఎద్దడి కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య అని, దీని నుంచి బయటపడేందుకు నీటి సరఫరా వ్యవస్థలో మార్పులు చేస్తూ పలు ప్రాజెక్టులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పింది.వీటిని అమలు చేయాలంటే అధిక మొత్తంలో నిధులు అవసరమని పేర్కొంది. గత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నీటి రంగం(రూ. 500 కోట్లు), విద్యుత్(రూ. 200 కోట్లు) సంస్కరణల కోసం కేటాయించారని, ఇప్పుడు ఆ ఊసే లేదని ఆప్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఢిల్లీకి ప్రణాళికేతర వ్యయం కింద రూ.395 కోట్లు
Published Sat, Feb 28 2015 10:33 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement