సాక్షి, న్యూఢిల్లీ: కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందం.. బీజేపీ వార్షిక బడ్జెట్ వ్యవహారం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆయన పైవిధంగా స్పందించారు. బడ్జెట్‌లో కొత్తదనమేమీ లేదని, దిశారహితంగా ఉందని ఆయన ఆరోపించారు. తనను అధికారంలోకి తెస్తే ఇది చేస్తా.. అది చేస్తానంటూ నరేంద్ర మోడీ ఏడాది కాలంగా ప్రజలకు అనే క వాగ్ధానాలు చేసిన నేపథ్యం లో నేడు ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలు ఆశించారని, అయితే వారి ఆశలు అడియాశలే అయ్యాయని కేజ్రీవాల్ పెదవి విరిచారు. ధరల పెరుగుదల, అవినీతి, ద్రవ్యోల్బణాలను అదుపులో పెట్టడానికి ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదనలేవీ చేయలేదని ఆరోపించారు.
అవినీతిని అదుపులో పెట్టినట్లయితే ధరల పెరుగుదల అదుపులోకి వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించారని, కానీ బడ్జెట్ కూడా ఈ సమస్యపై మాట్లాడలేదని, సమస్యను ఎదుర్కొనేందుకు చర్యలను ప్రతిపాదించలేదని ఆయన ఆరోపిం చారు. వైద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచే ప్రతిపాదనలు కూడా బడ్జెట్‌లో లేవని విమర్శించారు. దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్లు, నర్సుల కొరత ఉందని ఆర్థిక సర్వే పేర్కొన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం కోసం ఏమీ చేయలేదని ఆయన తెలిపారు. అరుణ్ జైట్లీ స్థానంలో చిదంబరం ఉన్నా ఇలాంటి బడ్జెట్‌నే ప్రవేశపెట్టేవారని, యూపీఏ సర్కార్ బడ్జెట్‌లకు, ఈ బడ్జెట్‌కు ఏమాత్రం తేడా లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు.
కొండను తవ్వి ఎలుకను పట్టారు: కేజ్రీవాల్
Published Thu, Jul 10 2014 10:48 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement