
కథల కడలిపై సి.రా. సంతకం
అరవయ్యేళ్ల నాటి మాటేమో! ఇరవై దాటిన కుర్రాడొకడు ధాటీగా వచ్చి తెలుగు కథా రచనలో ఇదీ నా చోటు అంటూ మఠం వేసుక్కూచున్నాడు. గ్రూప్ ఫొటోలో గురజాడ, మల్లాది, చలం, కొకు, చాసో ఎందరెందరో! ఇలా హఠం చేసిన కుర్రాణ్ణి పండితులూ, పాఠకులూ రారమ్మన్నారు. చప్పట్లూ కొట్టారు. తెలుగు సాహిత్యంలో సైకలాజికల్ డ్రామాకి తెరలో, తలుపులో ఇంకేవో తెరిచాడన్నారు.
ఇదంతా 1958 ముందు నాటి కాలంలో టీ ఎస్టేట్లలో బాస్‌గా పన్జేసే సి.రామచంద్రరావు అనే టెన్నిస్ కమ్ గోల్ఫ్ ప్లేయర్ కథ. ఆయన కథల్తో గూడా అలాగే ఆడుకున్నాడు. ఇంతా చేస్తే రాసింది టాల్‌స్టాయ్‌లాగా వార్ అండ్ పీస్‌లూ వంద పుస్తకాలూ కాదు. తిప్పి తిప్పి కొడితే తొమ్మిదే కథలు! కాదు పదీ అంటాడాయన. స్కోర్ గురించి పేచీ ఎందుకు! చెప్పిందే ఒప్పుకుందాం. అసలు సంగతి గెలుపు. ఆయన గెలిచాడు. పాఠకుల హృదయాల్ని. ఒక ఆఫీసరు, ఒక కూలీ, ఒకమ్మాయి, లేబర్ యూనియన్ మనుషులు, ఆడా, మగా, పెళ్లాం మొగుడూ అయినవాళ్లూ కానివాళ్ల మనసుల్లో కదిలే, మెదిలే మూవీలని స్టిల్ ఫొటోగ్రాఫర్‌లా క్లిక్ చేశాడు. చిత్రం! అన్నీ క్లిక్ అయ్యాయి. వీక్లీ పాఠకులంతా అద్భుతాలంటూ హాహాకారాలు చేశారు.
కానీ ఆ తర్వాత ఆయనే క్లిక్ చేయడం మానేశాడు. కథల్లోకొచ్చి మఠం వేసినట్టే పోతానని మారాం చేశాడు. టెన్నిస్ రాకెట్ పట్టుకుని కలం వదిలేశాడు. రెనెగేడ్ రైటర్! ఆయనెలా పోతే మనకేంటి! కథలున్నాయిగా. ‘వేలుపిళ్లై’ మన వేలు విడిచిన మేనమామేగా! ‘ఏనుగుల రాయి’ కథలో మనం గుంపులో గోవింద అనుకుందాం! ‘నల్లతోలు’ నీదీ నాదీ! మన జాతి కథ. ఇలా చెప్పుకుంటూ పోతే టీ తోటల్లో ఎకరాల కెకరాల్లో పరిగెత్తినంత ఆయాసం వస్తుంది. కుదురుగా కూచుని ‘వేలుపిళ్లై’ పుస్తకం చదూకుంటే పోలా!
అలనాటి ఆ కథలు రాసిన ఈ టెన్నిస్ రాకెట్‌కి నిన్నే 85వ పుట్టిన రోజట. (బిలేటెడ్) ఛీర్స్!
మోహన్