పదునులేని ‘కత్తెర’కే పట్టమా? | censort cuts in indian cinema | Sakshi
Sakshi News home page

పదునులేని ‘కత్తెర’కే పట్టమా?

Published Thu, Feb 27 2014 11:29 PM | Last Updated on Sat, Aug 11 2018 8:30 PM

పదునులేని ‘కత్తెర’కే పట్టమా? - Sakshi

పదునులేని ‘కత్తెర’కే పట్టమా?

 ఇందిరాగాంధీ హయాంలో చలనచిత్ర సెన్సార్‌షిప్ విధానాన్ని సమీక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జీడీ ఖోస్లా అధ్యక్షతన కమిటీ (1969)ని నియమించారు. ముద్గల్ కమిటీ సిఫారసులతో పోలిస్తే, ఖోస్లా సిఫారసులే ఆధునికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు పొందిన ఖోస్లా సిఫారసులను ఎవరూ పట్టించుకోలేదు.
 
 సినిమా అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. నూరు వసంతాల భారత చలనచిత్ర సీమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, అరవై ఏళ్ల ‘సినిమాటోగ్రఫీ చట్టం-1952’ మాత్రం ఇంగ్లిష్ వాసనతో అలాగే ఉంది. ‘విశ్వరూపం’ చిత్ర వివాదంతో మేల్కొన్న కేంద్రం సినిమా చట్టానికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేయడానికి విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికతో పాటు, సినిమాటోగ్రఫీ బిల్లు 2013ను కూడా ఇటీవలే అందచేసింది. చలన చిత్ర సెన్సార్ వ్యవస్థ మీద ప్రభుత్వ పట్టును మరింత బిగించడానికి వీలు కల్పించే పలు ప్రతిపాదనలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి.
 
 సెన్సార్ బోర్డ్ ఓ కీలుబొమ్మ

 ప్రస్తుతం సెన్సార్ బోర్డ్, చలనచిత్ర అప్పీలు ట్రిబ్యునల్ చైర్మన్‌లు,సభ్యుల నియామకాల మీద కేంద్రానిదే ఏకఛత్రాధిపత్యం. అస్మదీయులనీ, రాజకీయ నేపథ్యం ఉన్నవారినీ సెన్సార్ బోర్డ్ సలహా సంఘం సభ్యులుగా నియమించడం అలవాటుగా మారింది. రాజకీయ నియామకాల వల్ల ఏ అర్హతా లేని వారు సయితం సెన్సార్‌బోర్డ్ సభ్యులైపోతున్నారన్న విమర్శ ఉంది. సెన్సారింగ్ ప్రక్రియ పదును తగ్గడానికి కారణం ఇదేనని సెన్సార్‌బోర్డ్ ప్రస్తుత చైర్ పర్సన్ లీలా శాంసన్ వ్యాఖ్యానించారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. నిజానికి ఈ సభ్యుల ఎంపికకు సంబంధించి కళలు, సినిమా, నాటకరంగం, న్యాయశాస్త్రం వంటి రంగాల వారిని గురించి కమిటీ సూచించినప్పటికీ, అర్హతలేవీ ప్రతిపాదించలేదు. సరిగ్గా ఈ నియామక ప్రక్రియనే కొత్త కమిటీ కొనసాగించినట్టయింది. సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద అప్పీలుకు వెళ్లే అవకాశం ప్రస్తుతం నిర్మాతకే ఉంది. దీనికి భిన్నంగా ట్రిబ్యునల్ అధికార పరిధిని విస్తరించి సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద ఎవరైనా అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కమిటీ చేసిన ప్రతిపాదన ఆహ్వానించదగినదే. కానీ, చట్టబద్ధంగా ఏర్పడిన సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమాంతర పునర్ విచారణ అధికారాలను కమిటీ తొలగించకపోవడం ఆశ్చర్యమే. ఈ విశేష అధికారాల కొనసాగింపు కేఏ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధం కూడా.
 
 ఖోస్లా కమిటీ నివేదిక
 ఇందిరాగాంధీ హయాంలో చలనచిత్ర సెన్సార్‌షిప్ విధానాన్ని సమీక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జీడీ ఖోస్లా అధ్యక్షతన కమిటీ (1969)ని నియమించారు. ముద్గల్ కమిటీ సిఫారసులతో పోలిస్తే, ఖోస్లా సిఫారసులే ఆధునికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కూడా పొందిన ఖోస్లా సిఫారసులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్‌షిప్ విషయంలో కేంద్ర ఆధిపత్యానికి స్వస్తి పలకాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధ్యక్షుడి నాయకత్వంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర ధ్రువీకరణ బోర్డ్ ఉండాలని కూడా ఖోస్లా ప్రతిపాదించారు. కఠినమైన సెన్సార్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ నిరంతర జోక్యాల వల్ల బోర్డ్ సభ్యులలో బాధ్యత కొరవడుతోందని, ఈ లోపమే దాని సామర్థ్యాన్ని నాశనం చేసిందని కూడా ఖోస్లా కమిటీ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ ప్రాపకంతో నియమిస్తున్న సలహా మండళ్లను రద్దు చేయాలనీ, బోర్డ్ సభ్యులే చిత్రాలను పరిశీలించి ధ్రువీకరించే పూర్తి బాధ్యతను స్వీకరించాలని పేర్కొన్నది. అలాగే సెన్సారింగ్ మార్గదర్శకాలను రూపొందించుకునే అధికారం బోర్డ్‌కే ఉండాలని, కేంద్రం అజమాయిషీకి తావు ఉండరాదని కూడా ఖోస్లా కమిటీ భావించింది.
 
 అధికారాలన్నీ కేంద్రం దగ్గరే

 సెన్సార్‌బోర్డ్ ఆమోదం పొందిన సినిమాల ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వాలు సరైన కారణాలు లేకుండా నిలిపివేయడాన్ని నిరోధించే మార్గమేదన్నదే కొత్త కమిటీ పరిశీలించిన అంశాలలో ముఖ్యమైనది. కానీ దీనికి సూచించిన పరిష్కారాలు సమస్యను మరింత జటిలం చేసేటట్టు ఉన్నాయి. ఒక సినిమా ప్రదర్శన వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగినపుడు లేదా అలాంటి అవకాశాలు ఉన్నాయని భావించినపుడు ఆయా రాష్ట్రాలు ఆ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకురావాలనీ, దీని మీద కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలనీ కమిటీ ప్రతిపాదించింది. అలాగే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ట్రిబ్యునల్‌లో సవాలు చేయవచ్చునని కూడా సూచించింది. అంటే ఇంతవరకు సినిమాలను నిషేధించే పనిని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే, ఇకపై చిత్రప్రదర్శన కేంద్రం దయాదాక్షిణ్యాల మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిస్థితి మీద వివరాలు అందించాక, వాటి మీద కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి కాలపరిమితినీ నిర్దేశించలేదు. రాజ్యాంగం ప్రకారం చలన చిత్రాల ప్రదర్శన, శాంతిభద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. ఒక సినిమా ప్రదర్శనను నిలిపివేయడం వంటి సున్నితమైన అంశాన్ని, అదికూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చే విషయాన్ని కేంద్రం విచక్షణకు వదిలివేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఇటువంటి సందర్భాలలో సదరు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వెసులుబాటు కల్పించడం, తన ముందుకువచ్చిన వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలోగా తేల్చడం ఈ సమస్యకు సరైన పరిష్కారం కాగలదు. అలా ఒక చిత్రప్రదర్శన నిలిపివేత అంశాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పరిధి నుం చి తప్పించినట్టు కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశాన్ని విస్తరించి, దాని పరిధిని విస్తరించాలని కమిటీ చేసిన సిఫారసును గౌరవించినట్టు కూడా అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ట్రిబ్యునల్ తీర్పు న్యాయపరమైనది కావడం వల్ల, దాని మీద అప్పీలుకు నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లవలసి ఉంటుంది. అలా ఆ నిర్ణయం నిర్దిష్టతను కూడా సంతరించుకుంటుంది.
 
 ప్రేక్షకుల ఊసేలేని నివేదిక
 ఈ అంశాలకు సంబంధించి విదేశాలలో అమలులో ఉన్న చట్టాలను, మంచి పద్ధతులను కమిటీ ఏమాత్రం అధ్యయనం చేయలేదు. అలాగే అంతర్జాలం, సామాజిక మీడియా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చలనచిత్ర సెన్సార్ ప్రక్రియలో ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని పెంచడం, తద్వారా బోర్డ్ నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడం వంటి ముఖ్యమైన విషయాలలో సెన్సార్‌బోర్డ్ వహించే కీలక పాత్ర గురించి కమిటీ కనీసం ప్రస్తావించలేదు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ చట్టంలో పెద్దగా మార్పు లేనప్పటికీ సినిమా సెన్సార్‌షిప్ మీద పూర్వపు కమిటీల నివేదికలనూ కొత్త కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదు. కొత్త ముసాయిదా బిల్లులో ‘కొత్త’ ప్రతిపాదనలు చాలావరకు ఇప్పుడు అమలులో ఉన్నవే. 1983 నుంచి మక్కికి మక్కి ఎత్తి రాస్తున్నవే. టీవీ చానెళ్లలో ప్రసా రం చేసే సినిమాలకు ప్రత్యేక రేటింగ్ రూపొందించవలసిన తక్షణ ఆవశ్యకతను కూడా కొత్త కమిటీ గుర్తించలేదు.
 
 ఎవరికీ పట్టని పోస్టర్ల ప్రమాదం
 సినిమా ప్రచార సామగ్రిలో అశ్లీల, హింసాత్మక దృశ్యాలను ప్రచురించే వికృత ధోరణులను అరికట్టడానికి సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలోనే ఏర్పాటయిన ‘స్వయం నియంత్రణా’ కమిటీల పనితీరు కూడా ప్రహసనాన్ని తలపిస్తున్నది. సెన్సార్ కమిటీ కత్తిరించిన దృశ్యాలు కూడా పోస్టర్ల రూపంలో వీధి వీధినా దర్శనమిస్తున్నాయని కొత్త కమిటీ విమర్శించింది. సినిమా ప్రచారసామగ్రి మీద సెన్సార్ రేటింగ్ (ఏ, యూ/ఏ)ను ప్రదర్శించకపోవడం కూడా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నది. ఇలా భావించినప్పటికీ ముద్గల్ కమిటీ ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని చెప్పి ఊరుకుంది. కానీ పైరసీని తీవ్రమైన నేరంగా పేర్కొన్నది. కమిటీ పలు తిరోగమన ప్రతిపాదనలు చేయడం ఒకటైతే, వాటిమీద చర్చ లేకపోవడం దురదృష్టం. కాలంచెల్లిన సెన్సార్ వ్యవస్థను మార్చాలని తరచూ కోరే సినీ ప్రముఖులు కూడా ఈ కమిటీ గురించి నోరు మెదపడం లేదు. ఇన్ని లోపాలున్నా ఈ ముసాయిదాయే రేపోమాపో పార్లమెంటు ఆమోదం పొందే ప్రమాదం ఉందన్న సంగతి వారు ఎందుకు గుర్తించడంలేదు?     
 (వ్యాసకర్త ‘మీడియావాచ్-ఇండియా’ ఉపాధ్యక్షులు)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement