ప్రమాదంలో పౌర సమాజం
రెండో మాట
మానవ హక్కుల పరిరక్షణా కార్యకర్తలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రంగంలోకి దిగారు. వారిని హతమార్చడం ద్వారా పౌర సమాజం నోరు మూయించారు. అనుకున్న స్థాయిలో ఎదగకుండా, సివిల్ సొసైటీ తేజస్సు కోల్పోయి నిస్తేజ స్థితికి చేరుకోవడం వీటి ఫలితమే. ఇంతకుముందెన్నడూ లేనంతగా పాలక శక్తులు పౌర జీవనంలోని ప్రతి కోణంలోనూ– ప్రజల ఆహార అలవాట్లలో, మత విశ్వాసాలలో, వస్త్రధారణలో జోక్యం చేసుకునే విధానానికి తెరలేపి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి.
‘ప్రజలను నిరంకుశ పాలకులు మూకకొలువుకు అలవాటు చేస్తారు. ప్రజలు తమను కిమ్మనకుండా అనుసరిస్తున్నారుగదా అని, తమ అధికారానికి ఇక ఢోకా ఉండదన్న నమ్మకంతో ఆ గుడ్డి విధేయతను తాము ఖుషీగా పొందగలమన్న నిరంకుశ పాలకులు విశ్వాసం ఇకముందు ప్రజాస్వామ్య సంస్థలనూ, ప్రజాస్వామిక సంప్రదాయాలనూ కుమ్మరిపురుగుల్లా తొలిచి వేయడం ఖాయం. ఫలితంగా పౌర స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకూ, మానవ హక్కులకూ, వాటి పరిరక్షణకూ భయంకరమైన హాని జరుగుతుంది.’
– జి. సంపత్ (ప్రసిద్ధ పత్రికా విశ్లేషకులు, విమర్శకులు; ‘ది హిందూ’, డిసెంబర్ 4, 2016)
‘మన ఓటర్లయితే నాయకులని ఎన్నుకుంటారేగానీ ఆచరణలో అసలైన అ«ధికారం దేశపౌరుల చేతుల్లో లేదు.’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
దేశంలో ఎదుగుతున్న పౌర సమాజాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడలూ, వ్యూహాలూ శరవేగంగా అమలులోకి వస్తున్నాయన్న గుర్తింపు నేటి అవసరం. ప్రజా బాహుళ్యానికి చెందిన సర్వ విభాగాలను ఈ స్పృహ ఆవరించవలసిన సమయమిది. అసలు పౌర సమాజం నిరంతరం జాగరూకమై ఉండవలసిన అవసరం ఎంతటిదో 84 ఏళ్లకు ముందే, జి. సంపత్ చెప్పడానికి ఎంతో ముందే– హెచ్చరికగా డాక్టర్ అంబేడ్కర్ అత్యంత విలువైన సందేశం ఇచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన సందేశమిది: ‘భారత ప్రజలకూ, దేశానికీ నాజీ హిట్లర్ (జర్మనీ)జాతి, వర్ణ వివక్షా సిద్ధాంతం, దాని భావజాలం కూడా మన దేశ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రత్యక్షంగా ఎదురయ్యే సవాళ్లే. నాజీయిజాన్ని ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనడానికి భారతీయులు సదా అప్రమత్తులై ఉండాలి’(అంబేడ్కర్ స్పీక్స్. సంపుటం –2, సం. ప్రొ. నరేంద్ర జాధవ్, 2013).
పౌర సమాజం ప్రాధాన్యం
మనది ఇంకా రాజ్యాంగం నిర్వచించి, ప్రతిపాదించిన రిపబ్లికన్ (పూర్తి జనతంత్ర) వ్యవస్థ కాకపోవచ్చు. ఉన్నంతలోనే ఎన్నికల ప్రకారం ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలైనా సక్రమంగా విజయవంతంగా పనిచేయాలంటే దేశంలో స్థిరమైన పౌర సమాజం ఒక అంకుశం మాదిరిగా నిరంతరం పనిచేయవలసి ఉంది. కానీ ఇప్పటికే ఏర్పడి, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పౌర సమాజ వ్యవస్థ (సివిల్ సొసైటీ) కార్యకలాపాలు, అటు ప్రభుత్వానికీ, ఇటు దేశ పౌరులకూ దిక్సూచిగా పనిచేయడానికి వీలైన వాతావరణం ప్రస్తుత పాలనా వ్యవస్థలో మృగ్యమైపోతోంది.
భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం రాజ్యాంగం లిఖితపూర్వకంగా హామీ పడింది. అయితే వాక్, సభా స్వాతంత్య్రాలకు భంగం కలిగించే రీతిలో బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకుల నోటి నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ధోరణిని నాయకులు ఆచరణలోనూ ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణులకు ముగుదాడు వేయవలసినదే పౌర సమాజ వ్యవస్థ. అధికార, అనధికార, పాలక, ప్రతిపక్షాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడుచుకునే విధంగా చేయడంలో కూడా పౌర సమాజ వ్యవస్థదే కీలకపాత్ర.
ఈ కృషిలో పౌర సమాజంలోని సంఘాలు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షణా సంస్థలు, పత్రికలు, వృత్తిదారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు భాగస్వాములవుతారు. పాలనా వ్యవస్థకూ, ప్రజా ప్రయోజనాల రక్షణకూ మధ్య అంతరాన్ని తగ్గించే యత్నం చేస్తారు. నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల మనుగడ అవసరాన్ని నొక్కి చెబుతూనే, పాలక వర్గాలు నిరంకుశ విధానాల వైపు మళ్లినప్పుడల్లా పెడమార్గం పట్టిన ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిపించేందుకు (రీకాల్) ప్రజలకు ఉన్న హక్కును రక్షించడం కూడా పౌర సమాజపు లక్ష్యమే.
ఇలాంటి పంథాలోనే వివిధ ఖండాలలోని పౌర సమాజాలన్నీ పనిచేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే–రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన మానవ హక్కులు, పని హక్కు, జీవించే హక్కు వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసే వ్యవస్థ పౌర సమాజం. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు వెన్నుదన్నుగా నిలవడం, దగాపడిన పౌరులకు అండగా ఉండడం; వీరి హక్కులను కాపాడడం కూడా పౌర సమాజం లక్ష్యంగా ఉంటుంది.
బాధ్యత మరింత పెరిగింది
కానీ నేటి ప్రజా వ్యతిరేక, దేశ విదేశీ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రాజ్యాంగం నిర్వచించిన ఆర్థిక సమానత్వ స్థాపనకు లక్ష్యానికీ; జాతి, మత, కుల, వర్గ వివక్ష లేని సమాజ స్థాపనకూ విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాలక వ్యవస్థకు కళ్లాలు వేయవలసిన అవసరం నేటికీ మిగిలే ఉంది. కానీ ఇలాంటి కోర్కెలను సివిల్ సొసైటీ ప్రతిబింబించి, ప్రజలలో చైతన్యం తీసుకు రాకుండా సివిల్ సొసైటీ నేడు వివిధ స్థాయిల్లో అదిరింపులు, బెదిరింపులు ఎదుర్కొంటోంది. దేశం నలుమూలల్లో ప్రభుత్వ స్థాయిలో రహస్యంగా డజన్లకొద్దీ సామాజిక కార్యకర్తలను, మానవ హక్కుల పరిరక్షణా సంస్థల నాయకుల్ని, సివిల్ సొసైటీ కార్యకర్తల్నీ (డాక్టర్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గీ వగైరా) హతమార్చిన హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు జాగ్రత్తపడ్డాయి.
అందుకు నిరసనగా వివిధ సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన డజన్ల కొలదీ జాతీయస్థాయి పురస్కార గ్రహీతలు తమ తమ ‘పద్మశ్రీ’బిరుద బీరాలను కాలిగోటికి సమానమని భావించి బీజేపీ–ఆరెస్సెస్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వాపస్ చేయవలసి వచ్చింది. యూనివర్సిటీలలో దళిత, మత మైనారిటీలకు చెందిన, సామాజిక చైతన్యంతో దీపిస్తున్న విద్యార్థి నాయకులపై భావ ప్రకటననే ‘దేశద్రోహ’నేరంగా ప్రకటించి వారి నోరు మూయించడానికి (రోహిత్, కన్హయ్య కుమార్ వగైరా) పాలకవర్గాలు కత్తులు దూశాయి. మానవ హక్కుల పరిరక్షణా కార్యకర్తలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రంగంలోకి దిగారు.
వారిని హతమార్చడం ద్వారా పౌర సమాజం నోరు మూయించారు. అనుకున్న స్థాయిలో ఎదగకుండా, సివిల్ సొసైటీ తేజస్సు కోల్పోయి నిస్తేజ స్థితికి చేరుకోవడం వీటి ఫలితమే. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో పాలక శక్తులు పౌర జీవనంలోని ప్రతి కోణంలోనూ–ప్రజల ఆహార అలవాట్లలో, మత విశ్వాసాలలో, వస్త్రధారణలో జోక్యం చేసుకునే విధానానికి తెరలేపి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి. ఈ విషయంలో స్వామి వివేకానంద, పండిత మదన్ మోహన్ మాలవీయ సమతుల్యమైన ధోరణి ప్రస్తుత పాలనా విధానాలకు విరుద్ధంగా ఉందని చెప్పాలి.
ఎందుకంటే, వర్ణ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల మీద డాక్టర్ అంబేడ్కర్ సెంట్రల్ లెజిస్లేటివ్ స్టేట్ అసెంబ్లీలో (1951 సెప్టెంబర్ 20న) వేసిన ప్రశ్నల పరంపరకు పండిత మాలవీయ ఆర్యజాతి పుట్టుకను తవ్వుతూ ఇలా అంగీకరించాల్సి వచ్చింది: ‘‘ఆర్యులకు వర్గ విభజన అనే సాంఘిక వ్యవస్థ అంటూ ఒక లోపాయికారీ వ్యవస్థ ఏనాడూ లేదు. ఆ విభజన అనంతర కాలంలో పుట్టిన పుండు. ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు’’ అన్నారు. తాడిత పీడిత వర్గాలు హైందవ సమాజపు వర్ణ వ్యవస్థలోని దోపిడీ పద్ధతుల నుంచి బయటపడ్డం కోసమే అన్య మతాలను ఆశ్రయించి, మతం మార్చుకునే ప్రయత్నాలు చేశారని స్వామి వివేకానంద (కంప్లీట్ వర్క్స్: సంపుటి 8) పాఠం చెప్పవలసి వచ్చింది.
నిత్య జాగరూకతే కర్తవ్యం
సమాజంలో ఇలాంటి చర్యలు ఎందువల్ల సంభవిస్తాయో, నాజీ హిట్లర్ జర్మనీలో వలే ప్రజల్ని మూక కొలువుకు బలవంతాన ఎలా అలవాటు చేయవచ్చునో నిరూపిస్తూ తన పరిశోధనాగారంలో సాక్షాత్తూ ప్రయోగాల ద్వారా స్టాన్లీమిల్ గ్రామ్ అనే సుప్రసిద్ధ అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త (1974) నిరూపించాడు. తన అనుభవాల సారాన్ని అతను ‘‘పాలకవర్గ అధికారానికి విధేయత’’అనే గ్రంథంలో (ఒబీడియన్స్ టు అథారిటీ) నిరూపించాడు. ఈ విషయాల్ని సమీక్షిస్తూ జి. సంపత్ ఎన్నో వివరాలు ఉదహరించారు.
‘జీ! హుజూర్’ మనస్తత్వాన్ని పౌరుల్లో ఎలా నూరిపోయవచ్చునో జర్మన్‌ల అనుభవం తర్వాత కొంతమంది అమాయకులపై ‘మూక కొలువు’ప్రయోగం ద్వారా మిల్‌గ్రామ్ జయప్రదంగా నిరూపించారని చెప్పాడు. దీనినే ‘గొర్రె దూకుడు’పద్ధతి అంటారు. తన ప్రయోగాల ద్వారా ప్రొఫెసర్ మిల్‌గ్రామ్ రూపొందించిన ఒక చలనచిత్రం పేరు ‘ప్రయోక్త’– ‘ఎక్స్‌పెరిమెంటల్ బయోపిక్’(2015). నిరంకుశ పాలనా వ్యవస్థలో పైకి కానరాని రహస్య పద్ధతులలో జర్మన్ జాతి రక్తమే పరిశుద్ధమైనదనీ, మిగతా మైనారిటీల జాతులన్నీ పరిశుద్ధం కానివన్న జాత్యహంకార సిద్ధాంతంపైనే యూదు మైనారిటీలను లక్షలాదిగా హిట్లర్ మూకలు విషవాయు ప్రయోగం ద్వారా హతమార్చడం చరి త్రలో చెరపరాని అత్యంత విషాదకర సన్నివేశం. అందుకే దేశంలోని పౌర సమాజానికి రానున్న ప్రమాద ఘంటికలు గురించి ముందస్తుగానే హెచ్చరికలు అందించారు కొందరు మేధావులు.
మన దేశం రిపబ్లిక్ వ్యవస్థ (జనతంత్ర) కాకుండా కేవలం మాటల గారడీ ప్రజాస్వామ్య వ్యవస్థ (డెమోక్రసీ)గా మిగిలి పోవడంవల్ల ఏది మనదో, ఏది కాదో తేల్చుకోలేకుండా ఉన్నాం. చివరికి నేటి పాలనా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందంటే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగరీత్యా సంక్రమించిన విశేషాధికారాలను కూడా (ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ) హయాం తరువాత) మింగేయడానికి ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌లో శాంతి కోసం, ‘కూపీ’ సమాచారానికి ఆధారమైన ‘ఆధార్’ ప్రజలకు అందాల్సిన వస్తు సేవలకు కూడా విధిగా వర్తింపజేయాలన్న షరతును సుప్రీం కొట్టివేసినా, తన నిర్ణయం చుట్టూనే కేంద్రం చాంద్రాయణం చేస్తోంది.
ఈ వరస చూస్తుంటే ఓ కవి వ్యంగ్య సాదృశ్యం జ్ఞాపకం వస్తోంది: ‘‘పెద్ద పులి ఆవుని చంపడం మానేసి పాలు తాగడం ప్రారంభించింది! ఇలాంటి అహింసా విజయం ఒక్క అమెరికాలోనే సాధ్యమని నమ్ముతుందట’’ఎందుకనట?/ ‘‘అమెరికాలో వర్గాల్లేవు. ఇండియాలో వర్ణాలు (కులాలు) ఉండవట! అంతమందీ ధనవంతులే! / ఆహా! ఎంత సుందర స్వప్నం! అయినా, ఈ ఊహ ఖరీదు ఎన్ని డాలర్లో!’’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in