‘కేజీ టు పీజీ’ ఉచితం మిథ్యేనా? | Common School to all Childrens | Sakshi
Sakshi News home page

‘కేజీ టు పీజీ’ ఉచితం మిథ్యేనా?

Published Mon, Jun 1 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

‘కేజీ టు పీజీ’ ఉచితం మిథ్యేనా?

విశ్లేషణ
 
తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మారడానికి పిల్లలందరికీ కామన్ స్కూల్ ద్వారా సమానమైన నాణ్యమైన విద్యను అందివ్వగలగాలి. పిల్లల చదువు ఎలా? అనే ఆందోళన ఎవరికీ కలగని పరిస్థితిని తెలంగాణలో కల్పించాలి. కానీ అది ప్రభుత్వ ప్రాధాన్యాలలో లేకపోవడాన్ని,  బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన శాతాన్ని చూస్తే  తెలంగాణ ప్రభుత్వానికి విద్య అంటే ఎంత చులకన భావన ఉందో తెలుస్తుంది. రాష్ట్రాలు బడ్జెట్‌లో 30 శాతం విద్యకు కేటాయించాలని కొఠారీ కమిషన్ సూచిస్తే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది 10 శాతం కంటే తక్కువే.
 
తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. అయితే ఆ ఆకాంక్షలు సాకారం కావడానికి భౌగో ళిక తెలంగాణ మొదటి అవసరమని, తెలంగాణ రాష్ట్రమంటూ ఏర్పడితే ప్రజల అవసరాలకు స్పందించే ఒక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడు తుందని ప్రజలు భావించారు. మాలాంటి వాళ్లం ప్రజల ఆకాంక్షలను స్పష్టంగా వ్యక్తీకరించుకోవాలని, ఆ ఆకాంక్షలు, పరిష్కార మార్గాలు కూడా ఉద్యమ క్రమంలోనే స్పష్టంగా ఏర్పడాలని, నూతన రాష్ట్ర నిర్మాణానికి పునాదిలో కావలసిన విలువల వ్యక్తీకరణ, వ్యవస్థీకరణ కూడా ఉద్యమ క్రమంలోనే రూపొందాలని ప్రస్తావించాం. అయినా భౌగోళిక తెలంగాణ కాంక్ష మొత్తం ఉద్యమాన్ని ఆక్రమించుకుంది. అది ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్నది. తెలంగాణ ఉద్యమక్రమంలో తెరాస పార్టీ ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ నినాదాన్ని చేపట్టింది. ఇది ఒక విప్లవాత్మక నినాదం. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగానికి జరిగిన హాని బహుశా మరే ఇతర రంగానికి జరగలేదు. అందుకే ఈ నినాదాన్ని అందరూ హర్షించారు.

అమ్మకానికి విద్య వినూత్న వికృత విలువ
 విద్య 1985 దాకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, అమ్మే వస్తువుగా మారలేదు. మా తరానికి దాదాపు ఉచిత విద్యే అందింది. నా మొత్తం విద్యకు మా కుటుంబం పెట్టిన ఖర్చు కేవలం రూ. 2,500. నేను చదివిన వివేకవర్థిని కళాశాల ఎయిడెడ్ కాలేజీగా ఉండేది. అది మహారాష్ట్రీయులు ప్రారంభించిన కాలేజీ అయినా మహారాష్ట్రేతరులకు కూడా విద్య ఉచితమే. 1983లో మన దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి మన విద్యా విధానం విపరీతమైన మార్పులకు గురైంది. విలువలు పూర్తిగా మంట కలిసి ఒక వ్యాపార సంస్కృతి విస్తృతి చెంది విద్యారంగాన్ని కూడా మింగడం ప్రారంభించింది. దాంతో విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడి ప్రవేశించి ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేటు కళాశాలలు ఇబ్బడి ముబ్బ డిగా ప్రారంభించారు. అందరికీ ఒకే విద్య, నాణ్యమైన విద్య, ఉచిత విద్య అనే ఉదాత్త భావాలు మంటగలిసి, ఎవరు డబ్బులు పెట్టగలిగితే వాళ్లకు విద్య అనే ఒక అప్రజాస్వామిక, అమానవీయ విద్యా విధానానికి తలుపులు తెరచు కున్నాయి. దీంతో ఎంసెట్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇతర కోర్సులు విద్యే కాదనే ప్రచారం జరిగింది. ఫలితంగా ఒకటి, రెండు తరాల యువత మొత్తం విధ్వంసానికి గురైంది. ప్రైవేటు విద్య విస్తరిస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ద్వారానే ధ్వంసం చేయించగలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా మంత్రులు, ముఖ్య మంత్రులు ప్రైవేటు స్కూళ్ల ప్రతినిధులుగా మాట్లాడటం పెరిగింది.

ఇంటర్ విద్యలో రెండు, మూడు సంస్థలు ప్రవేశించి మరెవ్వరినీ. ఏ కాలేజీని బతకని వ్వలేదు. ఈ సంస్థల అధిపతులు కోటీశ్వరులయ్యారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా విద్య ద్వారా ఇంతగా లాభాలు గడించిన వాళ్లు ఉండరు. నిజానికి పెట్టుబడిదారీ దేశాల్లో కూడా విద్యను అమ్మరు. ఇది మన దేశం ‘ప్రపంచ నాగరికత’కు ప్రసాదించిన వికృత విలువ. ప్రైవేటు విద్యా మార్కెట్‌లో ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో, తెలంగాణ ఉద్యమంలో కార్పొరేటు విద్యకు వ్యతిరేకంగా నినాదాలొచ్చాయి. విద్య సామాజిక రం గంలో, ప్రభుత్వ నిధులతో నడవాలన్న ఆకాంక్షకు బీజాలుపడ్డాయి. ఈ నేప థ్యంలో ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ నినాదం అందరినీ ఆకర్షించింది.
 
బ్రహ్మపదార్థంగా మారిన ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూనే విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయేమోనని ‘భ్రమ’పడిన వాళ్లలో నేనొకడిని. తెలంగాణ లాంటి ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ దేశవ్యాప్త చర్చగా మారింది. దీంతో దాదాపు 18 రాష్ట్రాలకు చెందిన ‘అఖిల భారత విద్యా హక్కు ఫోరం’ సభ్యులు తెలంగాణ వైపు ఆసక్తితో చూశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకున్నా, ఒక స్వాగ తింపవలసిన నమూనాగా ఉంటుందని భావించాం. తెలంగాణ పునర్‌నిర్మా ణంపై చర్చలో విద్యా రంగం ఎలా మారాలన్న అంశం మీద తెలంగాణ రాక ముందు, వస్తుందన్నప్పుడు, వచ్చినాక వ్యాసాలు రాయడం జరిగింది. వాటిని పట్టించుకున్న నాథుడెవ్వడూ లేడు. తెలంగాణలో జరిగినంతగా విద్యారంగ ప్రైవేటీకరణ దేశంలో ఏ రాష్ట్రం లో జరగలేదు. దాదాపు 80 శాతం స్కూళ్లు కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. ఈ మధ్యే కస్తూర్బా కాలేజీలో ప్రభుత్వ డ్రిగీ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల అధ్యా పకులు, ప్రిన్సిపాళ్ల సంఘాల సదస్సులో ప్రభుత్వ ఉన్నత విద్యారంగ దీన స్థితిని విద్యామంత్రి కడియం శ్రీహరి గారికి వివరించారు. వందల సంఖ్యలో అధ్యాపకుల పోస్టులు నింపకపోవడం, కాంట్రాక్టు లెక్చరర్ల అనిశ్చిత పరిస్థితి, కాలేజీలకు ప్రిన్సిపాల్స్ లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి నిదర్శనం. ఒక ఏడాది కావస్తున్నా తెలంగాణ ప్రభుత్వం వీటి గురించి ఒక్క అడుగుముందుకు వేయలేదు. ఇక ఎయిడెడ్ కాలేజీలను ఒక పథకం ప్రకారం ఖూనీ చేశారు. సదస్సు జరిగిన కస్తూర్బా కాలేజీ మహిళా విద్యకు చేసిన సేవ చాలా గొప్పది. ఏ మాత్రం స్పృహ ఉన్న ప్రభుత్వమైనా వీటిని రక్షించుకుం టుంది. ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’లో ఉన్నత విద్యాసంస్థలను కాపాడుకో వాలనే ఆకాంక్ష ఉన్నట్లు లేదు.

ఈ నినాదమే బ్రహ్మపదార్థంగా మారింది.
 ఇక విశ్వవిద్యాలయాల స్థితి గురించి అడగవలసిన అవసరమేలేదు. ఒక రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వీసీలు లేకపోవడం బహుశ దేశ చరిత్ర లోనే ఒక పెద్ద విషాదం. వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లైబ్ర రీలకు, లేబొరేటరీలకు గ్రాంట్లు లేవు. భవనాలు భూత్ బంగళాలుగా మారు తున్నాయి. ఇవన్నీ పోగా విశ్వవిద్యాలయాలకు అంత భూమి ఎందుకు, అక్కడ పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ అన్న ముఖ్యమంత్రేనా? అనే అనుమానం కూడా వచ్చింది.
 
కొత్త స్కూళ్లు ఎన్నో వస్తాయనుకుంటే...

 ఇక స్కూలు విద్యకు వస్తే వేల స్కూళ్లను మూసేస్తామంటున్నారు. ఈ స్కూళ్లల్లో పిల్లలే లేరంటున్నారు. పిల్లలంతా ఏమైపోయినట్టు? తెలంగాణ వస్తూనే కొత్త స్కూళ్లు తెరుస్తారని, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తారని ఆశించాం. క్రమంగా కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టి కార్పొరేటు, ప్రైవేటు స్కూళ్లను నియంత్రించి అంతిమంగా రద్దు చేస్తా రనుకున్నాం.  విరుద్ధంగా స్కూళ్లు మూసే కార్యక్రమం మొదలు పెట్టారు. వేలాది మంది విద్యార్థులు ఎప్పుడు డీఎస్సీ వేస్తారా అని ఎదురుచూస్తుంటే ఈసారి ఉపాధ్యాయ నియామకాలే ఉండకపోవచ్చు అనేట్టున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే, గత ఏడాది నవంబర్‌లో ‘అఖిల భారత విద్యా హక్కు ఫోరం’ పిలుపు మేరకు పది తెలంగాణ జిల్లాల్లో ‘శిక్షా సంఘర్ష్ యాత్ర’ జరిగింది. దానికి ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. సాధారణ ప్రజలు, గ్రామీణ పేదలు ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగ్గా నడపాలని, వాటికి అన్ని వసతులను కల్పించాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలంగా సమాజం పిల్లలకు నాణ్యమైన విద్య కావాలనే కోరికను వ్యక్తీకరిస్తున్నది. కేసీఆర్ ఇచ్చిన నినాదానికి ఈ నేపథ్యం ఉంది.

 తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మారడానికి పిల్లలందరికీ కామన్ స్కూల్ ద్వారా సమానమైన నాణ్యమైన విద్యను అందివ్వగలగాలి. పిల్లల చదువు ఎలా? అనే ఆందోళన ఎవరికీ కలగని పరిస్థితిని తెలంగాణలో కల్పించాలి. కానీ అది ప్రభుత్వ ప్రాధాన్యాలలో లేకపోవడాన్ని,  బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన శాతాన్ని చూస్తే  తెలంగాణ ప్రభుత్వానికి విద్య అంటే ఎంత చులకన భావన ఉందో తెలుస్తుంది. కొఠారీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో 30 శాతం విద్యకు కేటాయించాలని సూచించింది. మేం కనీసం 20 శాతమన్నా కేటాయించమని వేడుకున్నాం. కానీ ఇచ్చింది 9 శాతం. దీంతో విశ్వవిద్యాలయాల కేటాయింపులు హాస్యాస్పదంగా మారా యి. పాలమూరు విశ్వవిద్యాలయానికి ఎనిమిది కోట్ల బడ్జెట్ ఏమిటి? ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయానికైనా, అతి పేద దేశాల్లో కూడా ఇంత తక్కువ కేటాయించరు. యూనివర్సిటీ అవసరాలు తెలియక కాదు, విద్య అంటే చిన్న చూపుతో లేదా ప్రైవేటు విద్యకు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు తలుపులు తెరవడం కొరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 తెలంగాణ రెండవ సంవత్సరంలో ప్రవేశించాక విద్యారంగాన్ని కాపా డుకునే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం. దానికి మించి నిరంతర ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రభుత్వ విధానాలు మారతాయన్న జ్ఞానం తెలంగాణ ప్రజలకున్నది. ఆ ప్రజాస్వామ్య ఎరుకే తెలంగాణకు రక్ష.
 
http://img.sakshi.net/images/cms/2015-06/51433182862_Unknown.jpgజి. హరగోపాల్
(వ్యాసకర్త ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హక్కుల నేత)
మొబైల్:9989021741

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement