కృష్ణాతీరం కార్పొరేట్ల పరం | Corporate aspect krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరం కార్పొరేట్ల పరం

Published Wed, Sep 10 2014 12:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

కృష్ణాతీరం కార్పొరేట్ల పరం - Sakshi

కృష్ణాతీరం కార్పొరేట్ల పరం

2004 సంవత్సరానికి ముందు తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో ఏర్పడిన ‘సింగపూర్ సంబంధాలు’ ఎంత దృఢమైనవో, ఇప్పుడు ఆ దేశ కంపెనీలు మిడతల దండులా విజయవాడకు దూసుకు వస్తూ ఉండడంతో రుజువైనాయి. మోసపూరిత పెట్టుబడులకు నిలయంగా దానికి పేరుంది.
 
‘సరళీకృత ఆర్థిక విధానాలతో, ప్రపంచీకరణ ప్రవేశంతో జాతీయ ప్రభుత్వాల సంప్రదాయక పాత్ర ముగిసిపోయిం ది. జాతీయ ప్రభుత్వాలు ఇక ఎంత మాత్రం జాతీయార్థిక వ్యవస్థల నిర్ణాయక శక్తులుగా ఉండలేవు. కారణం? జాతీ య ఆర్థిక వ్యవస్థలే ఉనికిలో ఉండవు. ఎందుకంటే, ప్రభు త్వాల  రాజకీయ పాత్రను కూడా  ప్రపంచీకరణ నిర్వీర్యం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి విస్తరణ కార్యకలా పాలలో మునిగి తేలుతున్న కంపెనీలు జాతీయ ప్రభు త్వాలు పెట్టే ఆంక్షలనూ, అదుపాజ్ఞలనూ సునాయాసంగా తోసిరాజనగల శక్తి కలిగినవే.’   -కెనిచీ ఓమే (‘బోర్డర్‌లెస్ వరల్డ్’ గ్రంథకర్త, జపాన్)

ఈ కెనిచీ ఓమే ఎవరని ఆశ్చర్యపోతున్నారా? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధా నిగా కొత్త ప్రభుత్వం నిర్ణయించిన తరువాత మూడురోజులకల్లా సింగపూర్ భవన నిర్మాణ బహుళజాతి సంస్థలు విజయవాడ వచ్చి వాలా యి. ఇలాంటి గుత్త కంపెనీల కోసం ప్రపంచ బ్యాంకు నియమించే సలహా సంప్రదింపుల సంస్థ లలో ఒకటి మెకెన్సీ అండ్ కంపెనీ, జపాన్. ఈ మెకెన్సీ మేనేజింగ్ డెరైక్టరే కెనిచీ ఓమే.

మెకెన్సీ ఘనత ఎంతో!

నిజానికి మెకెన్సీ కన్సల్టెన్సీ పేరు వినగానే అనివార్యంగా గుర్తుకు వచ్చే మరో పేరు-  చంద్రబాబు నాయుడు. 1991 సంవత్సరం తరువాత ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణలు భారత్‌ను చుట్టబెట్టిన కాలంలో, వాటిని అన్ని రాష్ట్రాల కంటే ముందు నాటి ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వా నించినవారు చంద్రబాబే. ఆ సంస్కరణలను నాటి ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు చేయడంలో తోడ్పడిన బహుళ జాతి కంపెనీలలో ఒకటే మెకెన్సీ కన్సల్టెన్సీ. చంద్రబాబు తొమ్మి దిన్నరేళ్ల పాలనలో ఈ కన్సల్టెన్సీ చేసిన నిర్వాకం ఏమిటో వ్యవసాయ, పారిశ్రామిక, ప్రభుత్వ ఉపాధి, ఉద్యోగ, కార్మి క రంగాలలో పని చేసిన వారందరికీ అనుభవమే. స్వచ్ఛం ద ఉద్యోగ విరమణ కత్తిని చూపించి ఏడాదికి రెండు శాతం వంతున ఉద్యోగులను ఇళ్లకు పంపించేయడం అందులో ఒకటి. వ్యవసాయ రంగాన్ని క్రమంగా కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలోకి తీసుకువెళ్లేందుకు ఆలోచనలూ, పథకాలూ ముందుకు తీసుకురావడం,  జిల్లాలలోని వ్యవసాయ కార్య క్రమాల నిర్వహణకు సలహాలు అందించే విస్తరణాధికా రుల సంఖ్యలో కోత పెట్టడం కూడా మెకెన్సీ కార్యక్రమమే. వ్యవసాయం దండగమారిదని, ఆ రంగానికి ఇచ్చే సహా యాన్ని కుంటుపరచడం, దరిమిలా వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆ పరిణామాల పర్యవసానమే. ప్రభుత్వ రంగ సంస్థలను చతికిలపడేటట్టు చేసి, కార్పొరేట్ ప్రయోజనాలను ముందుకు తేవడం కూడా అందులో భాగమే. పన్నులు పెంచే ఉద్దేశంతో జల వినియోగదారుల సంఘాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల నుంచి యూజర్ చార్జీలు దండుకోవడం అప్పుడు జరిగినదే. ఆల్విన్, నిజాం సుగర్స్ వంటి సంస్థలతో పాటు, 30 వరకు సహకార సంస్థలకు తాళాలు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం కూడా అప్పుడే మొదలైంది. ఇంకో సంగతి కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌కు అందిస్తున్న నిధులు, అవి ఖర్చు అవుతున్న తీరు, ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న భారీ అవినీతిపై  ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ, ఫండింగ్ ఏజెన్సీ డీఎఫ్‌ఐడీ ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఈ నివేదికను 2001- 2002 సంవత్సరంలో  సస్సెక్స్ విశ్వవిద్యాలయం (బ్రిట న్)కు చెందిన ప్రొఫెసర్ జేమ్స్ మానర్ రూపొందించారు. అదో చరిత్ర.

కృష్ణా తీరాన్ని తాకిన ‘బహుళ’ తుపాను

ఇప్పుడు మళ్లీ అదే బహుళ జాతి కన్సల్టెన్సీ మెకెన్సీని ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడబోయే కొత్త రాజధానిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా తీర్చి దిద్దడానికి అవసరమైన అధ్యయనం చేసేందుకు నియమించినట్టు వార్తలు వచ్చా యి. ఈ క్రమంలోనే సింగపూర్ బహుళ జాతి కంపెనీలు ఆగమేఘాల మీద విజయవాడకు చేరుకున్నాయి. అడుగు పెట్టగానే కాలుష్యానికి తావివ్వని భారీ భవంతుల నిర్మా ణాన్ని త్వరితగతిన చేపట్టి ‘నగరాభివృద్ధి’ని వేగవంతం చేసేందుకు స్థానికంగా ఉన్న ప్రైవేటు భవన నిర్మాణ బడా సంస్థలతో లాభసాటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమావేశాలు కూడా నిర్వహించాయి. ఆ సంస్థల నుంచి ఎంపిక చేసిన కొన్నింటికి తమ కార్యక్రమం గురించి బహు ళజాతి కంపెనీలు వివరించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

రాజధాని మీద ముందే నిర్ణయం

ఇంతకీ రాజధానికి ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియ మించిన శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? సూపర్ సిటీ నిర్మాణానికి విజయవాడ-గుంటూరు పరిసరాలు తగవనీ, పంట భూములను కొనుగోలు చేయడం రాష్ట్ర భవితవ్యానికి చేటనీ ఆ సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న జనాభా, భవన నిర్మాణానికి అనువైన స్థలాల దృష్ట్యా సింగిల్ సిటీ రాజధాని నిర్మాణం సాధ్యం కాదనీ నివేదిక తేల్చింది. కీలకమైన కార్యాలయా లను ఒకచోట ఏర్పాటు చేసుకుని, ఇతర శాఖల కార్యాల యాలను సాధ్యమైనంత మేర విస్తరించాలని కూడా కమిటీ సూచించింది. అలాగే హైకోర్టును విశాఖలో ఏర్పాటు చేయాలని  సలహా ఇచ్చింది. కానీ ముందస్తు వ్యూహం తోనే ఈ సలహాలలో చాలా వాటిని కొత్త ప్రభుత్వం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ భూముల కొరత లేకపోవడం; అటు రాయలసీమకూ, ఇటు విశాఖ, సీమాం ధ్ర ప్రాంతాలకూ దాదాపు సమాన దూరంలో ఉండడం వంటి సౌకర్యాలు ఉన్న వినుకొండ- దొనకొండ ప్రాంతా న్ని రాజధానిగా ఎంపిక చేయవచ్చునన్న ప్రతిపాదనను కూడా అసెంబ్లీలో చర్చించడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించ లేదు. ఈ ప్రతిపాదనకు ఏకపక్షంగా నారా వర్గం తిరస్కరించింది.  

పాత బంధాలు చిగురించాయి

2004 సంవత్సరానికి ముందు తొమ్మిదేళ్ల టీడీపీ హయాం లో ఏర్పడిన ‘సింగపూర్ సంబంధాలు’ ఎంత దృఢమై నవో, ఇప్పుడు ఆ దేశ కంపెనీలు మిడతల దండులా విజయవాడకు దూసుకు వస్తూ ఉండడంతో రుజువైనాయి. సింగపూర్ ఒక నగర రాజ్యం -సిటీ స్టేట్. సముద్ర ప్రాం తంలో దీవిగా ఏ ఆహార పంటలకూ నోచుకోకుండా ఐటీ సర్వీసులు మినహా సమస్తం దిగుమతుల మీద ఆధారప డిన చిరు దేశమది. ఇక పాలనా వ్యవస్థను చూద్దామా! ప్రజాస్వామిక వ్యవస్థకాని, పరిమిత నియంతృత్వ వ్యవస్థ. లీకువాన్‌యూ కుటుంబ రాచరికం. లీకువాన్‌కు చెందిన పీఏపీ గత 52 ఏళ్లుగా ఏకపక్షంగా పాలనలో ఉంది. మోస పూరిత పెట్టుబడులకు నిలయంగా దానికి పేరుంది.

సుందర దృశ్యాలను చూద్దాం!

ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ ‘సాదర’ ఆహ్వానంతో విజయవాడ వచ్చిన సింగపూర్ కంపెనీలు స్థానికంగా ఉండే ఎలాంటి కుబేర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాయి? ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ‘సాంకేతికం గా అనే ఆవిష్కరణలు ముమ్మరిస్తున్న కాలంలో ఎలాంటి ఆలస్యం లేకుండా భవన నిర్మాణాలు వీలవుతున్నాయి’ అని గ్రేటర్ విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్ స్థాపకుడు గద్దె రాజలింగు చెప్పారు. అంటే ఉచిత హామీల మేరకు, సవాలక్ష పథకాల పేరిట ఆవిష్కరించుకోబోయే సుందర దృశ్యాలకు మనమందరం కూడా ప్రేక్షకులమే. రేపు జరగబోయే ఘన పరిణామాల గురించి ముందుగా ఊహించుకునే అవకాశం కల్పించిన కెనిచీ ఓమేకు జేజేలు.
 
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  -   ఏబీకే ప్రసాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement