పంటసిరికి సింగపూర్ మురికి | Farmers are not interested on Land Acquisition for state capital | Sakshi
Sakshi News home page

పంటసిరికి సింగపూర్ మురికి

Published Tue, Nov 18 2014 12:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పంటసిరికి సింగపూర్ మురికి - Sakshi

పంటసిరికి సింగపూర్ మురికి

విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

రాజధానికి భూముల ‘సేకరణ’, ‘సమీకరణ’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించింది. అయితే రైతులు ఈ సేకరణ కీ, సమీకరణకీ లేదా బలవంతపు ఆక్రమణకీ (ఆర్డినెన్స్ ద్వారా) ఆస్కారం ఇవ్వరాదన్న నిశ్చయంతో ఉన్నారని టీవీ చానళ్లు, పత్రికలు వెల్లడిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే, సింగపూర్ సిటీ స్టేట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదర్శమైపోయింది.

అక్కడ కనిపించే బడా పెట్టుబడి సంస్థలు, కార్పొరేషన్‌లు, నాజూకుతనం పేరుతో నిర్మితమైన గేటెడ్ కమ్యూనిటీస్ అనే బందెలదొడ్లను చూసి ప్రేరణ పొందిన ముఖ్యమంత్రి వాటిని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. సుక్షేత్రాలుగా ఉన్న పంట భూముల మీదనే ఈ నాజూకు చిన్న నగరాలను నిర్మించాలని ఆరాటపడుతున్నారు.

 
‘సింగపూర్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చాను. అధికారంలో ఉన్నా లేకున్నా సింగపూర్ ప్రభుత్వంతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి.’    
- చంద్రబాబు
 
తెలుగువాళ్ల విశిష్ట నీతి శతకాలలో ‘భాస్కర శతకం’ ఒకటి. దీనికే ‘వివేక శతకం’ అని కూడా పేరు. భాస్కర కవి అజ్ఞాత కుల గోత్రీకుడు కాబట్టి, ఆయన శతకం మిగిలిన వాటి మాదిరిగా దూసుకు రాలేకపోయింది. దేశ సంచారిగా భాస్కర కవి రకరకాల ప్రభువులను చూసి ఉండవచ్చు. ఆ అనుభవంతోనే ఒక పద్యం అల్లాడు.

దాని సారాంశం- ‘మానవుడు పశువులను పితికితే పాలు రావొచ్చు. కానీ పొదుగే కోసి పారేస్తే పాలు రావు. అలాగే పాలకుడు ప్రజలను ఆత్మీయంగా పిలిచి, అవసరం ఏమిటో చెప్పి, ఆదరంతో అడిగితే ధనమిస్తారేమోగానీ, ఆ ప్రజానీకాన్ని (రైతులని) అదిలించి, బెదిరించి, దండించి, కొట్టి మరీ ‘తెండ’ంటే వారు ఇవ్వరు. ఇవ్వకపోగా ఆ పాలకుడి అధికారినికే చేటు వస్తుంది’. భాస్కర కవి భావం పాతబడలేదని చెప్పే సందర్భమే ఇప్పుడు కనిపిస్తున్నది.
 
సింగపూర్ అంటే ఎందుకంత ప్రేమ?
అప్పుడు తెలుగుజాతిని చీల్చడానికి సమ్మతించిన టీడీపీ అధినేత, కొత్త రాజధాని నిర్మాణానికి కావలసిన నిధుల సమీకరణలో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సింగాపురం (సింగపూర్) పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న రాజధానిని కోల్పోయిన తరువాత కట్టుకొయ్యలా, మొండెంలా మిగిలిన రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి సింగపూర్‌లో పర్యటించారు. ఏ విధంగా చూసినా సింగపూర్ దీవి ఆంధ్రప్రదేశ్‌కు దీటైనది కాదు.

వైశాల్యం, జనాభాల విషయంతో పాటు, ప్రకృతి వైపరీ త్యాల దృష్ట్యాను నమూనాగా తీసుకోవలసినది కూడా కాదు. జనసాంద్రత రీత్యా విశాలమైన ప్రభుత్వ భూము లు (పంట భూములు కాదు సుమా!) లభ్యమయ్యే ప్రాం తం ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమవుతుంది. అక్కడి గుంటూరు (49 లక్షలు), కృష్ణా జిల్లా (45 లక్షలు)లలో విశేషంగా జనాభా కేంద్రీకరించి ఉంది. కార్మిక శక్తిలో 65 శాతం గుంటూరు జిల్లాలో, 56 శాతం కృష్ణా జిల్లాలో ఉంది.

రాజధాని ఎంపిక అంశాన్ని నిర్ధారిం చేందుకు కేంద్ర హోం శాఖ ఒక కమిటీ (శివరామకృష్ణన్ కమిటీ)ని నియమించింది. నిజానికి విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి (వీజీఎంటీ) పరిసరా లలోనే రాజధాని ఉండాలన్న కొత్త రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఆ కమిటీ ఏకీభవించలేదు. క్షుణ్ణంగా పరిశీలిం చిన తరువాత వినుకొండ, దొనకొండ, మార్టూరు బెల్ట్‌ను కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కనీసం పరిశీలించకుండా మంత్రివర్గం తోసిపుచ్చింది.
 
కోస్తాతీరం తరచూ పెనుతుపానులకు గురి కావడంతో పాటు, భూకంపాలకు కూడా లోనవుతున్నం దున విజయవాడను రాజధాని నగరంగా ఎంపిక చేయడం సరికాదని ఎంపిక కమిటీ భావించింది. కోస్తాలోని నాలుగు జిల్లాలు భారత దేశంలోనే ధాన్యాగారాలుగా పేరు తెచ్చుకున్నాయి. కాబట్టి, రెండేసి మూడేసి పంటలతో హర్యానా, పంజాబ్‌లతో తులతూగుతున్న అక్కడి పంట భూములను రాజధాని నిర్మాణం పేరిట నిరుపయోగం చేయవద్దని కమిటీ సూచించింది. అయినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో చంద్రబాబు, ఆయన మంత్రివర్గం వ్యవహరిస్తున్నది. వీరు అప్పటికే వీజీఎంటీ పరిధిలో భూములను క్రయం చేసుకుని ఉన్నందునే రాజధాని ఎంపిక కమిటీ చేసిన నిర్మాణాత్మక ప్రతిపాదనలకు విరుద్ధంగా వెళ్లారు.
 
సుక్షేత్రాలను ఎందుకు పాడు చెయ్యడం?
రాజధానికి భూముల ‘సేకరణ’, ‘సమీకరణ’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించింది. అయితే ఆయా ప్రాంతా లలో రైతులు ఈ సేకరణకీ, సమీకరణకీ లేదా బలవంతపు ఆక్రమణకీ (ఆర్డినెన్స్ ద్వారా) ఆస్కారం ఇవ్వరాదన్న నిశ్చయంతో ఉన్నారని టీవీ చానళ్లు, పత్రికలు వెల్లడిస్తు న్నాయి. ఇంత జరుగుతున్నా సరే, సింగపూర్ సిటీ స్టేట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదర్శమైపోయింది. అక్కడ కనిపించే బడా పెట్టుబడి సంస్థలు, కార్పొరేషన్‌లు, నాజూకుతనం పేరుతో నిర్మితమైన గేటెడ్ కమ్యూనిటీస్ అనే బందెల దొడ్లను చూసి ప్రేరణ పొందిన ముఖ్యమంత్రి వాటిని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు.

సుక్షేత్రా లుగా ఉన్న పంట భూముల మీదనే ఈ నాజూకు చిన్న నగరాలను నిర్మించాలని ఆరాటపడుతున్నారు. కానీ లక్షలాది మంది జీవికను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, ఆహార భద్రత లక్ష్యానికి ఎసరు తెచ్చే ఈ ఆలోచన మంచిది కాదనే రాజధాని ఎంపిక నిపుణుల కమిటీ మొత్తుకుంది. ఇప్పటికే రుణానంద లహరిని గానం చేస్తున్న ప్రభుత్వం, ఇటీవలి హుద్‌హుద్ తుపానుతో రాష్ర్ట పునర్‌నిర్మాణ వ్యయాన్ని కూడా భరించవలసి వస్తోంది. ఈ సంకట పరిస్థితులలో ప్రజలకు భారం కాని విధంగా సాధారణ రాజధాని నిర్మాణం కూడా కాదు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధపడుతూ, దానిని చేపట్టే బాధ్యతను సింగపూర్ ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు.
 
విదేశీ గుత్త పెట్టుబడి సంస్థల పరం చేస్తారా?
ఆ బాధ్యతను సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించడం అంటే విదేశీ గుత్త పెట్టుబడులతో నడుస్తున్న బహుళజాతి కంపెనీలకు అప్పగించడమే. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటి వరకు 200 సంస్థలతో సమావేశాలు నిర్వహిం చారు. ప్రభుత్వ-ప్రైవేట్ పెట్టుబడుల భాగస్వామ్యం అంటే స్థూలంగా కార్పొరేట్ వ్యవహారం కిందే లెక్క. ఎందుకంటే, ఈ వ్యవహారంలో ప్రభుత్వాలు బ్రోకర్ల పాత్రకే (ముద్దుపేరు ఫెసిలిటేటర్లు) పరిమితం కావాల న్నది ప్రపంచ బ్యాంకు విధించే షరతులలో ప్రధానమై నది.

దీనికి తోడు అతడికంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో మన్మోహన్‌సింగ్‌ను మించి పోయి, నరేంద్ర మోదీ బహుళజాతి గుత్త కంపెనీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచి ఉంచుతున్నారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పాలకులు అలాంటి సింగపూర్ కంపెనీల దోపిడీకి రాష్ట్రాన్ని అప్పనంగా అప్పగిస్తున్నారు. అసలు సింగపూర్ మనుగడే 80 శాతానికి పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కార్పొరేషన్‌లతో ముడిపడింది. వీటితో మిలాఖత్ అయి; రాజకీయ, పారిశ్రామిక, వర్తకవాణిజ్యాలు నిర్వహించు కునే గోకెంగ్‌స్వీ, అల్బర్ట్ విన్‌సీమిస్ పక్కా వ్యాపారులే. ఇక సింగపూర్‌ను దిగుమతులపై ఆధారపడే ఒక దీవిగా ఆ దేశ పాలకులు మార్చేశారు.

తరువాత 1997లో ప్రధాని పదవికి వారసునిగా వచ్చిన గోచోక్ టాంగ్ హయాంలోనే సింగపూర్ ఆసియాలో ఆర్థిక సంక్షోభానికి కారణమైందనే వాస్తవాన్ని మరచిపోరాదు. సింగపూర్ ‘సంకర పాలన’కు పేరు మోసిందని లండన్ ‘ఎకనమిస్ట్’ వ్యాఖ్యానించిన సంగతిని కూడా విస్మరించరాదు. సింగపూర్ అక్కడి ప్రజలది కాదు. అమెరికా, జపాన్, యూరప్‌లకు చెందిన ఏడువేల బహుళ జాతి కంపెనీలది మాత్రమే. ఇండియాకు చెందిన కార్పొరేట్ కంపెనీలే అక్కడ 1,500 ఉన్నాయి. సింగపూర్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి భాగంలోనూ విదేశీ గుత్త కంపెనీలదే హవా. అక్కడి కార్మికులలో 50 శాతం సింగపూరేతరులే. అంటే అది వాపు. అది ప్రపంచంలో 14వ పెద్ద ఎగుమతిదారు అని ప్రతీతి. కానీ వీటిలో అధికభాగం బహుళజాతి ఐటీ కంపెనీల ఎగుమతులే. అదీ దాని సంత (మార్కెట్ ) ఆర్థిక వ్యవస్థ.
 
వికేంద్రీకరించినా బాగే!
ఈ నేపథ్యంలోనే కావచ్చు, రాజధాని ఎంపిక కమిటీ మరో సాదృశ్యాన్ని తెచ్చింది. ఛత్తీస్‌గఢ్, గాంధీనగర్, భువనే శ్వర్‌లలో విస్తారమైన భూములు ఉన్నందునే అవి పూర్తి స్థాయి కలిగిన కొత్త నగరాలుగా అవతరించగలిగాయి. 115 చదరపు కిలోమీటర్ల నుంచి 419 చదరపు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందగలిగాయి. ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం వీలుకాకపోవచ్చు. అయినా నష్టం లేదనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరిపా లనా కేంద్రాలను వికేంద్రీకరించవచ్చునని కూడా రాజ ధాని ఎంపిక కమిటీ సూచించింది.

కార్యాలయాల మధ్య దూరాభారం ఉన్నప్పటికీ పాలన సులభంగానే సాగించ వచ్చునని ఆ కమిటీ చెప్పింది. సాగు భూములను ఎంపిక చేస్తే రైతులు చితికి పోవడమే కాకుండా, క్రయ విక్రయ వ్యాపారానిదే పై చేయి కాగలదని కూడా కమిటీ చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది అదే. కాబట్టి వీజీఎంటీ పరిధి దాటడం మంచిదని ఇప్పటికైనా గుర్తించాలి. అయినా ఎన్నికల ప్రచారంలో బాబు వినిపించిన ప్రత్యేక ప్రతిపత్తి కాస్తా, ప్రత్యేక పథకంగా ఎందుకు దిగజారిందో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement