మూడేళ్లలోపే పోలవరం పూర్తి
పట్టిసీమ సభలో సీఎం పట్టిసీమ ఎత్తిపోతల జాతికి అంకితం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను స్ఫూర్తిగా తీసుకుని 2018 కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి జిల్లాల రైతులు భూ సేకరణకు సహకరిస్తే ఏడాదిలో మూడు పంటలకూ నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో శనివారం ఎత్తిపోతల పథకాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పట్టిసీమ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. అన్ని పైపుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు తరలిస్తామన్నారు. వాస్తవానికి ఈ రోజునే పథకాన్ని ప్రారంభించాలని భావించినా నాణ్యతలో రాజీ పడటం ఇష్టం లేక వాయిదా వేశామని చెప్పారు.
గోదావరి నీరు కృష్ణా డెల్టాకు..
పట్టిసీమతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తాడిపూడిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ఇక్కడ మిగులు జలాలను మాత్రమే కుడి కాలువ ద్వారా తీసుకెళతామన్నారు.
ఆమోదయోగ్యంగా భోగాపురం భూసేకరణ
సాక్షి, విశాఖపట్నం: నిర్వాసితులు, రైతులు, బాధితవర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా అందర్ని ఒప్పించిన తర్వాతే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు భూసేకరణ జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల సంఖ్య తక్కువగా, భూసేకరణపై ఖర్చు కూడా తగ్గించేదిగా విధానం ఉండాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణపై స్థానిక విశ్వప్రియ ఫంక్షన్‌హాలులో సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో శనివారం సమీక్షించారు.