పరభాషా వేలంవెర్రి నుండి విముక్తి పొందుదాం
గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా ప్రపంచీ కరణ అనే బానిస కొలువుకు కుదురుకున్న నాటి నుంచీ, రెంటికీ చెడ్డ రేవడులను సృష్టిం చే పనిలో కేంద్ర, రాష్ట్ర పాలకులు తలము నకలై ఉన్నారు. నీటిలో చేపపిల్ల ఈదినంత హాయిగా, ప్రకృతీ, సమాజాల గురించిన ప్రాథమిక జ్ఞానం ద్వారా తల్లి భాషను నేర్చుకోగలిగే ప్రక్రియను తల్లకిందులు చేశా రు. ఇంగ్లిషునొక పాఠ్యాంశంగా చేయటంతో ఆగక, ఇంగ్లిష్ మాధ్యమంలోనే పాఠాలన్నీ బోధిస్తున్నారు. ఈ తల్ల కిందుల విద్యావిధానం విద్యార్థుల సృజనను చంపేసి, వారిని ధనం మత్తుకు హత్తుకు పోయేవారిగా.. ప్రజల, దేశం పట్ల, చివరకు సొంత కుటుంబాల పట్ల బాధ్యతలేని వారిగా మారుస్తోంది.
మాతృభాష ద్వారా ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటే అంత సులువుగా ఇతర భాషలూ వాటి ద్వారా లభించే జ్ఞానమూ పొందగల మని విద్యావేత్తల సూచనలు పాలకులు విస్మరించారు. ‘మాతృభాషలో విద్యాబోధన సాధించడానికి ఎంతటి కల్లోలం రేగినా మంచిదే’నన్న గాంధీజీ పలుకుల్నీ విస్మరించారు. దేశానికి ఆయువు పట్టులాంటి ఆర్థిక, రాజకీయరంగాలలో మార్కెట్ శక్తులకు లొంగిపోయిన వారికి, భాష విషయంలో పెద్ద పట్టింపేమీ ఉండదు. చదువుకుంటున్న వారిలో నూటికి 30 మంది మాతృభాషలో ధారాళంగా చదవలేకపోయినా, స్పుటంగా మాట్లాడలేకపోయినా, తప్పులు లేకుండా రాయలేకపో యినా.. ఆ భాష మాతృభాషగా దిగజారుతున్నట్లేనని 2001లోనే హెచ్చరించిన యునెస్కో, తెలుగుకు ‘చావు’ హోదానిచ్చింది.
సాంస్కృ తిక సామ్రాజ్యవాద విషగాలులకు తెలుగుభాష, జాతి, సంస్కృతి విల విలలాడుతున్నాయి. నేటి ఇంగ్లిష్ మాధ్యమం పాఠశాలల ద్వారా గత 30 ఏళ్లలో చదువుకున్న తెలుగువారిలో ఒక్కరైనా మంచి ఇంగ్లిష్‌లో కవి త్వం, కథలాంటి సృజన చేసినవారే లేరు. మానవ హృదయ స్పంద నలను ఆవిష్కరించలేని భాషా పరిజ్ఞానం జోసఫ్ స్టాలిన్ అన్నట్లు బజా రులో ‘తట్టబేరగాళ్ల భాష’గానే ఉండిపోతుంది.
ఇంగ్లిష్ వ్యామోహంలో కూరుకుపోయిన బానిస పాలకులతో చెలిమే కలిమిగా భావించే కొందరు భాషాభిమానులు, తెలుగు భాష చావుకు ప్రజలను తప్పు పట్టడంలో గొప్ప ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు.
‘బక్కవాని మీద బాహుబల ప్రదర్శనం’ గావించే ఇటువంటి వారినో కంట కనిపెట్టి ఉండాలి. ప్రస్తుత కాలంలో భాష గురించిన ఏ చర్చ అయినా నేటి ఈ ఇంగ్లిష్ పెత్తనమనే దురవస్థ నుంచి బయటపడవేసే దిగా ఉండాలి. తెలుగు భాష ప్రాచీనతను నిర్ధారించే శాస్త్రీయ వివేచ నను ఆహ్వానిద్దాం కానీ, భాషల మధ్య అనారోగ్యకరమైన పోటీకి, ఘర్షణకూ దింపే కుట్రలకు దూరంగానే ఉండాలి.
ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచ మాతృభాషా పరిరక్షణ దీక్షా దినో త్సవంగా యునెస్కో ప్రకటించింది. ఇంగ్లిష్ భాషాధిపత్యం వేలంవెర్రి నుంచి తెలుగుజాతి విముక్తి కావాలని జనసాహితి కోరుకుంటోంది. నేటి మాతృభాషా పరిరక్షణ దినోత్సవాన్ని కింది కనీస కోర్కెల సాధ నకు పునరంకితమయే దీక్షా దినంగా పాటించమని జనసాహితి ప్రజ లకు పిలుపునిస్తోంది. 1. కనీసం 10వ తరగతి వరకైనా తల్లిభాషలోనే విద్య నేర్పాలి. 2. డిగ్రీవరకు తెలుగు అధ్యయనం తప్పనిసరి అంశంగా ఉండాలి. 3. ప్రభుత్వ ఆదేశాలు, నూతన పథక రచనలు తెలుగులోనే రూపకల్పన జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి. 4. గ్రూప్-1, సివిల్స్ పరీక్షలకు తప్ప మిగిలిన సమస్త అంశాలు తెలుగు, ఉర్దూలో రాసే అవ కాశం ఉండాలి. 5. రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో తెలుగునే వాడాలి. 6.తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి, తెలుగులో దరఖాస్తు చేసేవారికి ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో తొలి ప్రాధాన్యత ఉండాలి.
నేడు మాతృభాషా పరిరక్షణ దినోత్సవం
(వ్యాసకర్త జనసాహితి ప్రధాన కార్యదర్శి, మొబైల్: 9440167891)