మన అత్యద్భుత విజయం ఈసీ...!
అవలోకనం
భారత ప్రజాస్వామ్యం సాధించిన అత్యున్నత విజయం ఏదైనా ఉందంటే అది భారత ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేస్తూ ఉండటమే. ఈసీ పనితీరులో ప్రజల పాత్ర కంటే మన ఉన్నతాధికారవర్గం, ప్రభుత్వ యంత్రాంగం చేసిన దోహదమే ఎక్కువగా ఉంది. భారత ఎన్నికల ప్రక్రియ చాలా సాఫీగా, మరింత సమర్థవంతంగా, మరింత విశ్వసనీయంగా ఉండటమే కాకుండా చాలా చౌకగా నిర్వహించడానికి అనువుగా ఉంటోంది. అమెరికాతో సహా ప్రపంచంలోని ఏ ఇతర పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థల్లో కంటే త్వరితంగా ఫలితాలను అందించే ఘనత మన ఈసీకే దక్కింది. రెండురోజుల క్రితం ముగిసిన బిహార్ శాసనసభ ఎన్నికలు ఈ వాస్తవాన్ని చక్కగా ప్రదర్శించాయి.
బిహార్, హరియాణా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ అంత సులభం కాదని వయసుమళ్లిన మన తరంలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్నికల హింస గురించి మాత్రమే నేను ప్రస్తావించడం లేదు. ఎన్నికల సమయంలో హింసాత్మక చర్యలు దేశం మొత్తం మీద దాదాపుగా ముగిసిపోయినట్లు కనబడుతుంది. ప్రభుత్వం తన పనిని నిర్వర్తించే క్రమంలో ప్రదర్శించే ఆర్భాటం కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.
ఇండియాలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ తీరును ఇద్దరు ఎన్నికల కమిషనర్లు మార్చివేశారు. వీరిలో తొలివ్యక్తి టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు). ఈయనకు ఎందుకంత ప్రాధాన్యత అంటే శేషన్ కంటే ముందుగా సీఈసీలుగా పనిచేసినవారు ప్రభుత్వానికి దాదాపు కీలుబొమ్మల్లాగా వ్యవహరించేవారు. తనకు అందు బాటులో ఉన్న చట్టాలను ఉపయోగించుకున్న శేషన్ తన కార్యాలయాన్ని అత్యంత శక్తివంతంగా మార్చివేశారు. ఈయన నేతృత్వంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయడం ప్రారంభించింది. నాకు గుర్తున్నంతవరకు ఈయన హయాంలోనే ఎన్నికల కమిషన్... ఎన్నికల ప్రచార సమయంలో ప్రసంగాలను రికార్డు చేయటానికి వీడియోగ్రాఫర్లను పంపటం మొదలెట్టింది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ప్రభ్వుత్వం ఎలాంటి హామీలు గుప్పించకుండా శేషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
శేషన్ నేతృత్వంలో 1995లో బిహార్‌లో తొలిసారిగా సాఫీగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ గెలిచారు. ఇది జరిగి 0 ఏళ్లయింది. బిహార్‌లో పోలింగ్ కేంద్రాలకు భద్రత కల్పించి శాంతి నెలకొల్పడానికి శేషన్ 650 కంపెనీల పారామిలిటరీ దళాలను (అంటే 65,000 మంది) మోహరించారు. శేషన్ సాధించిన విజయం ఎన్నికల సమయంలో మనలో చాలామంది చూస్తూవచ్చిన ఆరాచక పద్ధతులకు పూర్తిగా కానీ, తక్కువగా కానీ ముగింపు పలికింది. ఆనాటి నుంచే ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయ బద్ధంగా జరుగుతాయన్న నమ్మకం మాకు కలిగింది.
శేషన్ వారసుడిగా సీఈసీగా వచ్చినవారు ఎంఎస్ గిల్ (1996-2001). శేషన్ లాగే గిల్ కూడా మాజీ బ్యూరోక్రాట్. కాబట్టే రాజకీయ పార్టీలను తటస్థం చేయడానికి ఎన్నికల కమిషన్ ఎప్పుడు, ఎలా జోక్యం చేసుకోవచ్చు అనే అంశం ఈయనకు క్షుణ్ణంగా తెలుసు.
ఇండియాలో ఎన్నికలకు విశ్వసనీయత తెచ్చినవారు శేషన్ అయితే, ఓటర్ పక్షాన నిలబడిన ఘనత గిల్‌కు దక్కింది. ఆయన ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఓటు వేయడానికి పట్టే సమయాన్ని ఎంతగా తగ్గించాయంటే ఇప్పుడు ఓటేయడానికి మనం కొద్ది నిమిషాల కంటే ఎక్కువగా వేచి ఉండనవసరం లేదు. ఈవీఎం అని భారతీయులు చాలామంది పిలుస్తున్న యంత్రానికి అసాధారణ మైన నైపుణ్యం ఉంది. అదే సమయంలో అది అత్యంత సాధారణమైన డిజైన్‌తో ఉండేది. నేను ఓటెయ్యడానికి వెళ్లిన ప్రతి సమయంలోనూ అదెంత సులభంగా పనిచేస్తోందో అంటూ అబ్బురపడేవాడిని. ఒక ఈవీఎం తయారీకి రూ. 5,500లు ఖర్చు అవుతుంది. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కాబట్టి మన విద్యుత్ కోతలు దాన్ని ఏమాత్రం ప్రభావితం చేయవు కూడా.
నిరక్షరాస్యత అధికంగా ఉన్న కారణంగా భారత రాజకీయ పార్టీలు తమవైన చిహ్నాలతోనే గుర్తింపు పొందుతుంటాయి. రాజకీయ పార్టీల గుర్తులను ఎంచు కుని పక్కనున్న బటన్‌ని నొక్కటం మన ఓటర్లకు అత్యంత సులభమైన విషయం. గట్టిగా వినిపించే శబ్దంతో తమ ఓటు చెల్లుబాటయిందని ఓటర్లు ధ్రువ పర్చుకుంటారు.
తన హయాంకు ముందే ఈవీఎంలు ఉనికిలోకి వచ్చినప్పటికీ, వాటిని పరీక్షించేవారు కాదని గిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక మార్కెట్‌లో చదవటం తెలియని వారితో గిల్ ఈవీఎంలపై ఒక నమూనా పరీక్ష నిర్వహించారు. ఈవీఎంలు మన దేశంలో పనిచేస్తాయని ఆయన సమాధాన పడ్డారు. 1996లో వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టారు. 1998లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ప్రయోగించారు. ఇవి ఎంత గొప్ప ఫలితాన్ని అందించాయంటే అతి స్వల్పకాలంలోనే పేపర్ బ్యాలెట్ రద్దయిపోయింది. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత కొద్దిరోజులకే గిల్‌ను నేను హైదరాబాద్‌లో కలుసుకున్నాను. అప్పుడు ఆయన ఎంత ఉద్వేగంతో ఉన్నారో నాకిప్పటికీ గుర్తే. తనను చూడడానికి వచ్చిన కారణం ఏమిటని ఆయన నన్ను అడగడానికి 40 నిమిషాలపాటు వాటిగురించి మాట్లాడుతూ ఉండిపోయారు.
ప్రస్తుతం బిహార్‌లో జరిగిన ఎన్నికలకు, పోలింగ్ కేంద్రాల భద్రతకు ఎన్నికల కమిషన్ రూ. 300 కోట్లు ఖర్చుపెట్టింది. ఇదెంత తక్కువ ఖర్చో చెప్పాలంటే, ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్ వార్షిక బడ్జెట్ రూ.1,700 కోట్లు. కాగా బిహార్ జనాభా ఆస్ట్రేలియా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
అభ్యర్థులతో ఎలా వ్యవహరించడం అనేది బిహార్‌లో ప్రస్తుత ఎన్నికలు చేసిన కొత్త ఆవిష్కరణ. దీనివల్లే గతంలో అనుమతులకు చాలా సమయం పట్టినప్పటికీ ఇప్పుడు 24 గంటల్లో అనుమతులు లభిస్తున్నాయి. లౌడ్‌స్పీకర్లు అమర్చటం, ర్యాలీలు నిర్వహించడం వంటి వాటికి సంబంధించిన అనుమ తులను ఈసీ ఇప్పుడు సులభంగా పర్యవేక్షించగలుగుతోంది.
రెండో విషయం ఏమిటంటే ఓటర్ల ఫిర్యాదులను ట్రాక్ చేసే సాఫ్ట్‌వేర్. బిహార్‌లో ఈ ఎన్నికల్లో 7,452 ఫిర్యాదులు వస్తే, వాటిలో 7,316 ఫిర్యాదులు పరిష్కరించేశారు. ఏ రకంగా చూసినా ఇది అద్భుతం. మరొక విషయం ఏమి టంటే ఎన్నికల కమిషన్ నియమించుకున్న ప్రైవేట్ వాహనాలను జీపీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి, వాటిని ఉపయోగించుకున్నందుకు సత్వరం డబ్బు చెల్లించడానికి మరో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం.
ఎన్నికల ప్రక్రియను మరింత సురక్షితంగా చేయడానికి పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగుపడుతోందని నేను భావిస్తుంటాను. భారతీయులందరూ గర్వించాల్సిన విషయమిది.
ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)