పచ్చనిచెట్టూ ప్రత్యక్షదైవమే!
వృక్షాల విశిష్టతను మన పురాణాలు చాటాయి. వృక్షాల ప్రాముఖ్యం, పరిరక్షణ గురించి పిల్లలకు బోధించాలి. కానీ, అది మనం చెయ్యం.
రెండు సంఘటనలు ప్రస్తావిస్తాను. 2009లో చిలుకూరు బాలాజీ ఆలయంలో ధ్వజస్తంభాన్ని మార్చవలసి వచ్చింది. కావలసిన చెక్కను ఒక పొడవాటి చెట్టునుండి తీసుకుని, వేదమంత్రో చ్ఛారణల మధ్య ప్రతిష్ట చేస్తారు. అందుకు అనువైన చెట్టును నిర్ణయించడమే అన్నిటి కన్నా ముఖ్యం. అనుమతి కోసం అటవీ శాఖకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు అంగీకరించి, అనువైన చెట్టు ఆదిలాబాద్‌లో ఉన్నదని చెప్పారు. ఆ చెట్టు పొడవు 100 అడుగులు. నరికిన తర్వాత దాని పొడవు 40 అడుగులు. ప్రతిష్ట తర్వాత పొడవు దాదాపు 31 అడుగులు.
ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా చెట్టు నరికితే, పరి హారంగా 1,000 మొక్కలను నాటాలి. ధ్వజస్తంభ ప్రతిష్టానంతరం దానికి ఇత్తడి కవచం వేసి అలంకారం చేశాక ప్రకృతికి నష్టపరిహారం ఎలా చేయాలా అని ఆలోచించాము. గుడికి వచ్చే భక్తులలో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేసే యువకుడికి అపూర్వమైన ఆలోచన కలిగింది. వారి బృందం ఆధ్వర్యంలో నడు స్తున్న ‘స్క్విరిల్స్’ పేరిట స్వచ్ఛందంగా ప్రతి వారాంతంలో 108 మొక్కలను చిలుకూ రులో అందరికీ పంచారు.
వారాంతంలో గుడి ఆవరణ పచ్చటి మొక్కలతో కళకళలాడేది. వేప, మామిడి, జామ వంటి మొక్కలను ప్రతి శనివారం ఉదయం పొద్దుట 10.30కు యువకులు భక్తులకు పంచేవారు. భక్తులు ప్రసాదంలా ఇళ్లకు తీసుకెళ్లి నాటుకునేవారు. చిన్నారులు చిట్టి చేతులతో మొక్కలు పట్టుకుని ప్రదక్షిణలు చేస్తుంటే కనువిందుగా అనిపించేది, ఆ మొక్కలే దేవునికి ప్రదక్షిణ చేస్తున్నట్టు. ఎందరెందరో భక్తులకు ఈ ఆలోచన నచ్చి, తమ పిల్లల పుట్టిన రోజుకు వచ్చినవారికి ఇలా మొక్కలను బహు మతిగా ఇస్తున్నామని చెప్పారు. ఎంత బాగుంది!
ఒకరోజు ఓ మధ్యవయస్కుడు వచ్చి నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యాపారం నష్టాల్లో ఉందట. అప్పులు తీర్చాలని బ్యాంకులు నోటీసులు జారీచేశాయట. వాస్తు శాస్త్ర నిపుణుని వద్దకు వెళ్తే ఆయన ఇంటికొచ్చి చూసి, ముందున్న రావిచెట్టు వల్లనే సమస్యలొస్తున్నాయని చెప్పా రట. రహదారిలో ఠీవిగా నిల్చున్న ఈ రావి వృక్షం వల్ల ఎండ పడక ఇల్లు చీకటిగా మారిందని చెప్పారట. చెట్టు కొట్టివేస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారట.
‘‘చెట్టు ఎవరికీ అపకారం చేయదు. దాన్ని పోషిస్తే పుణ్యం. కొట్టేస్తే మహాపాపం. రావి వృక్షం శ్రీమహా విష్ణువుకు మారు రూపం. ఆయన నివాసస్థలం. ‘వృక్షా ణాః అశ్వద్ధోస్మి’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమా త్ముడు’’ అన్నాను. దాన్ని పూజించు... నీ సమస్యలన్నీ మటుమాయమవుతాయని హితవు చెప్పాను. అటు తర్వాత ఆయన సమస్యలన్నీ తీరాయి. వ్యాపారం నెమ్మ దిగా పుంజుకుంది.
అపుత్రస్య చ పుత్రత్వం పాదపా ఏవ కుర్యతే
తీర్థేషు పిండదానాదీన్ రోపకాణాం దదన్తితే
మొక్కలు నాటితే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అన్ని తీర్థాలలో పిండదానం చేసిన ఫలం వృక్షాల ద్వారా దక్కుతుంది అని దీని భావం. (పద్మ పురాణం)
వృక్షాలను పెంచిపోషిస్తే పర్యావరణానికి... తద్వారా ప్రపంచానికంతకూ మేలు జరగడమే కాదు. అలాచేసిన వారికి పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయి.
- సౌందరరాజన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు