మృతాత్మలను ద్వేషించలేం..! | even we dont hate them says frace attak victim | Sakshi
Sakshi News home page

మృతాత్మలను ద్వేషించలేం..!

Published Thu, Nov 19 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

మృతాత్మలను ద్వేషించలేం..!

మృతాత్మలను ద్వేషించలేం..!

ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి?
 
 ఉగ్రవాద దాడుల్లో ప్రేమాస్పదురాలైన జీవన సహచరిని అతడు శాశ్వతంగా కోల్పోయాడు. పన్నెండేళ్లపాటు నిస్వార్థంగా ప్రేమను పంచి పెట్టిన అమృతమయమైన ఒక సుకుమార, సున్ని త నిసర్గ సౌందర్యాన్ని అతడు ఉగ్రదాడిలో పోగొ ట్టుకున్నాడు. పారిస్‌లోని బటాక్లాన్ థియేటర్‌లో, నవంబర్ 17న ఐఎస్‌ఐఎస్ చేసిన మెరుపుదాడిలో ఒకేచోట 82 మంది తోటి ప్రేక్షకులతోపాటు ప్రాణాలు కోల్పోయిన ఆమెకు కాని, ఆమెను కోల్పోయిన ఆ భర్తకు, వారి నెలల ప్రాయపు చిన్నారి కుమారుడికి కాని ఏ రాజకీయాలూ తెలీవు. తమకు అందుబాటులో ఉన్న జీవితాన్ని కాసింత సంతోషంతో, కాసింత స్వేచ్ఛా స్వాతం త్య్రాలతో గడుపుదామనే చిన్న కోరిక తప్ప వారికి ఈ ప్రపంచంలో పెద్దగా ఆశలూలేవు.

కానీ మృత్యువు వికటాట్టహాసం చేసిన ఆ కాళరాత్రి తన నెచ్చెలిని పోగొట్టుకున్న ఆ పౌరుడు జీవితకాల బాధను కూడా దిగమింగుకుని యావత్ ప్రపంచానికీ చిరుసందేశం పంపుతున్నాడు. తన భార్యను చంపిన వారికి తన ద్వేషాన్ని పొందే అవకాశం కూడా ఇవ్వబోనంటూ అతడు చరిత్ర కనీవినీ ఎరుగని తిరస్కార సందేశాన్ని ఉగ్రవాదులకు అందించాడు. ద్వేషంతో కాదు.. ప్రేమతో, వెరపు లేనితనంతో జీవిస్తామంటున్న ఈ సాధారణ పౌరుడు శ్వేతజాతీయుడు కాదు. ఒక పర్షియన్. బతుకు కోసం ఫ్రాన్స్‌ను మాతృదేశంగా చేసుకున్న పరదేశీయుడు. పేరు ఆంటోనె లేరిస్. ఆమె పేరు హెలెన్ ముయాల లేరిస్ (35 ఏళ్లు). ఇద్దరిదీ పన్నెండేళ్ల బంధం. వారికి పదిహేడు నెలల కుమా రుడు మెల్విల్.


 పారిస్ ఉగ్రదాడిలో సహచరిని కోల్పోయిన మూడు రోజులకు ‘మీరు నా ద్వేషాన్ని కూడా పొందలేరు’ (యు విల్ నాట్ హావ్ మై హేట్రెడ్) అంటూ ఫేస్‌బుక్‌లో ఫ్రెంచ్ భాషలో లేరిస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆన్‌లైన్ పాఠకుల హృదయాలను  కదిలిస్తోంది. 129 మందిని బలిగొన్న ఉగ్రవాదు లను ఉద్దేశించి లేరిస్ రాసిన పోస్టును ఇంతవరకు లక్షా పాతికవేలమంది షేర్ చేశారు. అలాగని లేరిస్ ఉపన్యాసాలేవీ దంచలేదు. కేవలం నాలుగు చిన్ని పేరాల స్పందన మాత్రమే ప్రపంచంతో పంచుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో తానూ తన కుమారుడు మాత్రమే ఉండొచ్చు కానీ ప్రపం చంలోని అన్ని సైనిక బలగాలకంటే తాము ఇప్పు డు అతిశక్తిమంతులం అంటూ ఉగ్రదాడులను లెక్కచేయనితనంతో ఆ తండ్రి చేసిన పోస్ట్ ఇప్పు డు యావత్ ప్రపంచం ముందూ మన కాలపు ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది.  


 ఉగ్రదాడుల పట్ల లేరిస్ వినిపించిన ఆ మానవ ధిక్కారాన్ని తన మాటల్లోనే విందాం.
 'శుక్రవారం రాత్రి మీరు ఒక అసాధారణ మైన జీవితాన్ని (నా జీవిత ప్రేమమూర్తిని, నా కుమారుడి తల్లిని) బలిగొన్నారు. కానీ మీరు నా ద్వేషాన్ని పొందలేరు. మీరెవరో నాకు తెలీదు. నాకు తెలుసుకోవాలనీ లేదు. మీరు మృతాత్మలు.. అంతే. మీరు ఎవరి కోసం గుడ్డిగా మనుషులను చంపుతున్నారో ఆ దేవుడు మమ్మల్ని తన ప్రతి బింబంగా చేసుకున్నట్లయితే మాత్రం.. నా భార్య దేహంలోకి మీరు చొప్పించిన ప్రతి తూటా ఆయన హృదయంలో ఒక్కో గాయమై తీరుతుంది. అం దుకే, నా ద్వేషాన్ని కూడా మీకు నేను దక్కని వ్వను. సరిగ్గా మీరు ద్వేషాన్నే కోరుకుంటున్నారు. కాని ద్వేషం పట్ల ఆగ్రహంతో స్పందించడం అనేది బాధితులను అదే అజ్ఞానంలో పడవేయడంతో సమానం. ద్వేషమే మిమ్మల్ని అలా తయారు చేసింది. మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. నా దేశపౌరుల పట్ల నేను అవిశ్వాసం ప్రదర్శించాలని, నా భద్రత కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయాలని మీరు  కోరుకుంటున్నారు. కాని అక్కడే మీరు ఓడిపోయారు.


 నేను ఆమెను ఇవ్వాళ ఉదయం చూశాను. చివరిసారిగా అంటే రాత్రింబవళ్లు నిరీక్షించిన తర్వాత ఆమెను ఇవ్వాళే చూశాను. శుక్రవారం రాత్రి ఆమె బయటకు వెళ్లినప్పుడు ఎప్పటిలాగే ఆమె సౌందర్యంతో మెరిసిపోయింది. 12 ఏళ్లుగా తన ప్రేమతో నన్ను దాసోహం చేసుకున్న అద్భుత సౌందర్యంతో ఆమె వెళ్లిపోయింది. నిజమే. ఆమెను కోల్పోయిన బాధలో నేను కుప్పగూలిపో వడం నిజమే. మీరు చిన్న విజయం సాధించారని నేను అంగీకరిస్తున్నా. కానీ గుండెను తొలిచివే స్తున్న ఈ బాధ తాత్కాలికమే. ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆమె మాతో ఉంటుందని నాకు తెలుసు. మీరు ప్రవేశించలేని ప్రేమాన్విత స్వేచ్ఛా స్వర్గంలో మేం మళ్లీమళ్లీ కలుసుకుంటూనే ఉంటాం.


 ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. నేనూ, నా కుమారుడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పద ల్చుకున్నా. ప్రపంచంలోని సకల సైనిక బలగాల కంటే మేము శక్తిమంతులం. మీ మీద దృష్టి పెట్టేం త సమయం నాకు ఏమాత్రంలేదు. మా అబ్బాయి మెల్విల్‌ను నేను నిద్రలేపాల్సి ఉంటుంది. అతడి వయసు 17 నెలలు మాత్రమే. అతడు ఎప్పటిలాగే తన ఆహారం తీసుకుంటాడు. ఎప్పటిలాగే మేము కలిసి ఆడుకోవడానికి వెళతాం. ప్రతిక్షణం అణువ ణువునా చెక్కుచెదరని సంతోషాన్ని అనుభవిస్తూ.. ఈ చిన్నారి జీవితాంతం మిమ్మల్ని అవమాని స్తూనే, భయపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే, అతడి ద్వేషాన్ని కూడా మీరు  పొందలేరు'
 సేకరణ: కె.రాజశేఖరరాజు

Advertisement
Advertisement