ముగ్గురు మరాఠీల ముచ్చట
రెండో మాట
రెండు తెలుగు రాష్ట్రాలపై పట్టుకు మోదీ వ్యూహం పన్నుతున్నారు. అమలు జర గని హామీలతో మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రాలను త్రిశంకు స్వర్గంలో ఉంచుతోంది. ఉత్తరాదిన ప్రాభవాన్ని కోల్పోతున్న మోదీ దక్షిణాదిపై ఆశలు పెట్టుకున్నారు.
యజమానులు పన్నిన వలను తెంచుకుని బయటప డడం స్వచ్ఛంద బాని సలకు సాధ్యమేనా? స్వతంత్ర భారత దేశ పాలనా వ్యవస్థ అల్లుతున్న బలవంతపు భూసేకరణ చట్టాల బకాసురుల కౌగిలి నుంచి పేద, మధ్య తరగతి రైతాంగాన్ని రక్షించడం సాధ్యమా? సొంత భూములు కోల్పోయి కౌలు ఉచ్చునుంచి తప్పించుకోలేక కునారిల్లుతున్న వ్యవ సాయ కార్మికులూ, వీరందరిపై ఆధారపడి ఉన్న గ్రామీణ చేతి వృత్తులవారి ప్రయోజనాలను కాపాడడం సాధ్యమవుతుందా? కానీ తమకు అసాధ్యం కానిదేదీ లేదని చెప్పడానికే నడుం కట్టారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నిరంకుశ ఆర్డి నెన్స్‌కు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ఉద్య మాన్ని ఉధృతంగానే సాగిస్తున్నారు.
పలు రైతాంగ ప్రయోజనాలను కాపాడుతూ అంతకు ముందు యూపీఏ 2013లో చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ భూసేకరణ, పునరావాస చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మోదీ ప్రభుత్వం దేశ, విదేశీ గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఒక ఆర్డినెన్స్‌ను 2014-15 సంవత్స రంలో తెచ్చింది. దీనిని ఆధారం చేసుకుని పరిశ్రమాభి వృద్ధి పేరుతో, పట్టణాభివృద్ధి పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు ఆవురావురుమంటూ అన్ని రకాల ఉల్లంఘన లకు పాల్పడ్డాయి. అందుకే బీజేపీ ఆర్డినెన్సుల రాజ్యంలో ‘మూర్తిత్రయం’ అవత రించింది. వారే- మోదీ, చంద్రబాబు, కేసీఆర్. ఈ క్రమంలోనే ఈ త్రయం తమ పార్టీల మధ్య బాంధవ్యం పటిష్టం కావడా నికి అనువైన పునాదులు నిర్మించుకోవడానికి వెనుకా డడంలేదు.
కబ్జా బాటలో పాలకులు
భ్రమలు కల్పించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల లోనూ పట్టు సాధించడా నికి మోదీ వ్యూహం పన్నుతు న్నారు. మరోపక్క విభజన సమస్య మీద పైకి కత్తులు నూరుకుంటున్నట్టు కనిపిస్తూ, లోపాయికారీ సంబంధా లను కాపాడుకుంటున్న టీఆర్‌ఎస్, టీడీపీలు మోదీతో సాన్నిహిత్యం సాధించడానికి పోటాపోటీగా పావులు కదుపుతూనే ఉన్నాయి. అమలు జరగని హామీలతో మోదీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను త్రిశంకు స్వర్గంలో ఉంచుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఒక్కొక్క చోట ప్రాభవాన్ని కోల్పోతున్న క్రమంలో దక్షిణాది రాష్ట్రా లలో పాగా వేసే వ్యూహంలో భాగంగా, 2019 ఎన్నికలే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తన పార్టీ పాతుకు పోవాలని మోదీ ఆశపడుతున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్-యూపీఏ హడా వుడిగా తలపెట్టిన వ్యూహం ఎంత స్వార్థపూరితమైనదో, అనంతర పరి స్థితుల ఆధారంగా నెగిటివ్ ఓటును నమ్ముకుని రాజ్యాధికారానికి నిచ్చెనలు వేసిన బీజేపీ- ఎన్డీఏ వ్యూహమూ అంతే స్వార్థపూరితమైనదన్న సంగతి విస్మ రించరాదు. రాజధాని నిర్మాణం పేరుతో, శివరామ కృష్ణన్ సాధికార నివేదిక లోని హెచ్చరికలకు విరుద్ధంగా టీడీపీ పాలకులు గుంజడానికి ప్రయత్నించారు. 120 పంటలకు అనువైన వేలాది ఎకరాల ఆ మాగాణి భూములను సేకరణ/సమీకరణ పేరుతో బెదిరింపులు, అదిలింపుల ద్వారా రైతుల నుంచి తీసుకోవాలని టీడీపీ సర్కారు ఆలోచించింది.
2013 చట్టం ఆధారంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా భూసేకరణను అడ్డగోలుగా ఆరంభించింది. అయితే 2014-15 సంవత్సరంలో మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన ఆర్డినెన్స్ నుంచి ప్రేరణ పొందిన తెలంగాణ రైతాంగం, వ్యవసాయ కార్మికులు వరస వారీ పిటిషన్ల ద్వారా న్యాయ స్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అటు అమరావతి, మచిలీపట్నం భూములు; ఇటు మల్లన్నసాగర్, కాళేశ్వరం నిర్వాసిత రైతాంగం కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల చర్యలను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ప్రజా వ్యతిరేక సర్వేలను, చివరికి వైస్‌చాన్స్‌లర్‌ల నియామకాలను, గవర్నర్‌లను కాదని తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నియామకాల గురించి కూడా హైకోర్టు నిలదీ సింది.
భూసేకరణలో 2013 చట్టంలో పేర్కొన్న రైతాంగ ప్రయోజనాంశాలకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వా లనీ, భూసేకరణ ప్రక్రియలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనీ నిర్దేశించినా వాటిని తెలుగు రాష్ట్రాల పాలకులు పాటించలేదు. ఇక పారదర్శకత ఉండాలన్న మాటకు చోటే లేదు. కాబట్టే మల్లన్నసాగర్ (మెదక్‌జిల్లా) రిజర్వాయర్ కోసం భూములను ఖాళీ చేయించే అంశం అంతా గందరగో ళంలో పడింది. ‘తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ మన్న సంగతి మరచిపోయి న్యాయస్థా నాలు వ్యవహరి స్తున్నాయ’ని ఒక పాలకుడు నోరు పారవేసుకున్నాడంటే అర్థం ప్రజాజీవనంలో ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రా లను సయితం వీరు పాటించ నిరాకరిస్తున్నారు.
నిబంధనలకు పాతర
2013లో నాటి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పారదర్శక భూసేకరణ చట్టాన్నీ, దాని స్వభావాన్నీ తారుమారు చేస్తూ కేంద్రంలో మోదీ వచ్చాక తెచ్చిన ఆర్డినెన్సు నిజా నికి కొన్ని భూముల స్వాధీనానికీ, వాటిని బడా పారి శ్రామిక వేత్తలకు భూములను కట్టబెట్టడానికీ వీలుగా తెచ్చినదే. అయితే ఈ ఆర్డినెన్సు కాలపరిమితి ముగిసి పోవటంతో పునరుద్ధరించలేదు. దాంతో 2015 నాటి ఆర్డినెన్సు కాస్తా మురిగిపోవలసి వచ్చింది. ఈ ఆర్డినెన్సు రాగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊపిరి పీల్చు కుని తానూ ఒక ఆర్డినెన్సుకు ‘ఏతాం ఎత్తి’ ముందుగానే అమలులోకి తెచ్చి 2013 చట్టానికి ‘తూ.న.బొడ్డు’ చెప్పేశారు. 2013 చట్టంలో చెప్పినట్టు స్థానిక సమాజం లోని వివిధ వర్గాల నుంచి స్పందనను తప్పనిసరిగా పొంది రికార్డు చేయాలన్న నిబంధన మోదీ ఆర్డినెన్సు (2015) ద్వారా రద్దయి పోయినట్టు భావించి ఆగమే ఘాల మీద 2015 జీవోను భూముల నిర్బంధ సేకర ణకు వీలుగా బాబు విడుదల చేశారని మరచిపోరాదు.
ఈ తతంగం అంతా కనిపెడుతున్న రాష్ట్ర హైకోర్టు కూడా భూసేకరణ తీరును సమీక్షించి తీరవలసిందేనని అభి ప్రాయపడింది. అమరావతి భారీ రాజధాని నిర్మాణాల పేరుతో ఇప్పుడు సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా పెట్టుబడి కంపెనీల షరతులకు కట్టు బడి పోవాలనుకున్న టీడీపీ పాలకులకు వీరిలో ఎవడి భారీ పెట్టుబడులతో రాజధాని నిర్మాణం చేపట్టాలో తెలి యక నానా గందరగోళంలో పడ్డారు. ప్రపంచంలోకెల్లా పెద్ద రాజధానిగా అమరావతిని నిర్మించాలనుకున్న నాయకునికి, తాజాగా మరో దారినపోయే ‘దానయ్య’ లాగా ‘సైట్ ఫ్రాంక్ ఎల్.ఎల్.పి’ అనే ఓ కొత్త బ్రిటిష్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ తారసిల్లింది. ఇది గ్రామీణ స్వరూప స్వభావాలనే రూపుమాపేసి విజయ వాడ-గుంటూరు పట్టణాలను కాస్తా ‘నగర వాటిక’ లుగా మార్చేస్తుందట.
టీడీపీ అధికార భాగస్వామి అయిన బీజేపీకి కూడా ఏవగింపు కలిగించేంతగా సింగ పూర్ కంపెనీల (అసెండాస్, సింగ్ బ్రిడ్జి, సింబ్‌కోర్)కు అమరావతి భూముల్ని 90 ఏళ్ల కౌలుకి ‘స్విస్ ఛాలెంజ్’ నిర్మాణ పద్ధతుల్లో టీడీపీ ధారాదత్తం చేయబోతోంది: ‘‘ఈ భూముల్ని ఈ కంపెనీలకు ధారాదత్తం చేయడంతో ఆంధ్రప్రదేశ్ కాస్తా పెద్ద ఊబిలో కూరుకుపోయినట్టే. ఈ కంపెనీలు మన దేశానికి సంబంధం లేనివి కాబట్టి, వాటిని అదుపు చేయగల/నియంత్రించగల న్యాయశాస్త్ర నిబంధనలకు అతీతం కాబట్టి, పెక్కు దీర్ఘకాలిక లిటి గేషన్ (లావాదేవీ)లో మన రాష్ట్రం కూరుకుపోతోంద’’ని బీజేపీ సహితం హెచ్చరించాల్సి వచ్చింది. అంతే గాదు, ఇటీవల సుప్రీంకోర్టు సహితం (24-7-16) ‘‘స్విస్‌ఛా లెంజ్ విధానం పారదర్శకంగా లేదు. ప్రభుత్వాలు చేపట్టే, ప్రాజెక్టులు, నిర్మాణాల గురించి అందరికీ తెలిసే విధంగా ఉండాలేగానీ రహస్యంగా వ్యవహారాలు జరప రాదు’’ అని హెచ్చరించాల్సి వచ్చింది. సింగపూర్ సర్వేలు, నిర్మాణ సంబంధమైన పటాలూ ఏ దశలో ఉన్నాయో ఎవరికీ తెలియదు. ‘‘కేంద్రమూ, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే వ్యవస్థ ద్వారానే అభివృద్ధీ, అభ్యున్నతీ సాధ్యమ’’ని ప్రధాని మోదీ మాటవరసకు అంటున్నారు గానీ ఆచరణలో సామాజి కంగా చీలు బాటలలో ప్రయాణిస్తున్న సెక్యులర్ వ్యతిరేక బీజేపీ విధానాల ద్వారా ఆ ప్రగతి సాధ్యపడదు.
ఏబీకే ప్రసాద్,
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in