
ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రాయని డైరీ
వదిలి వెళ్లడమా? వదిలించుకుని వెళ్లడమా? రెండూ గౌరవమే. రెండోది మరింత గౌరవం. వదిలి వెళ్లాలంటే మోదీజీ చెవిలో ఎవరైనా ఊదాలి... ‘ఇంకా ఎన్నాళ్లు ఆ నరసింహన్’ అని! సంఘ్ పరివార్‌లో సమర్థులకు కొదవా?! ఈపాటికి ఊదే ఉంటారు. ఆయనా వినే ఉంటారు. గవర్నర్‌ని మార్చడానికి టూ థర్డ్ మెజారిటీ అవసరం లేదు. ఆర్డినెన్సులు, ఇంపీచ్‌మెంట్‌లు, రెఫరెండమ్‌లు అక్కర్లేదు. ఒకవేళ అవి ఉన్నా, మోదీజీ వంటి రాజనీతిజ్ఞులు కిందామీద పడే అగత్యం లేదు. ఇక్కడ తీసి అక్కడ పెట్టడమే. బహుశా బిహార్ ఎన్నికలయ్యాక.. అక్టోబర్‌లోనో, నవంబర్‌లోనో ఇక్కడి తీసి అక్కడ పెడతారేమో మోదీజీ. తియ్యడం ఆయనకు పెద్ద పని కాదు. అలాగని పెట్టడ మూ చిన్న పనేం కాదు. ఒకరిద్దరున్న పరివారం కాదు కదా బీజేపీ అండ్ కో. టైమ్ పడుతుంది. అంతవరకు ఆగి వెళ్లడమా?
అంతకు ముందే వెళ్లిపోవడమా?
నేను వదిలి వెళ్లినా, వదిలించుకుని వెళ్లినా చంద్రబాబు సంతోషిస్తాడు. చంద్రశేఖర్రావూ సంతోషిస్తాడు. ఆయన మంత్రులూ సంతోషిస్తారు. ఈయన మంత్రులూ సంతోషిస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రులు సంతోషంగా ఉండాల్సిందే. కానీ వాళ్ల సంతోషం కోసం రాష్ట్ర గవర్నర్ సంతోషాన్ని హరిస్తామంటే ఎలా?! అలుగుతారు. ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తారు. నాతో మాత్రం ముక్క మాట్లాడరు. రెండు వైపుల పదునైన కత్తిలాంటి గవర్నర్ పోస్టు... వీళ్ల దెబ్బకి రెండు పడవల మీది ప్రయాణం అయింది.
పౌరుడికి గానీ, ప్రథమ పౌరుడికి గానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే సరిపోయిందా? వినేవాళ్లు ఉండొద్దా? చంద్రబాబు వినడు, చంద్రశేఖర్రావూ వినడు. కేసీఆర్‌కి ఫేవర్‌గా ఉన్నానని చంద్రబాబు అనుమానం. చంద్రబాబుతో ఫ్రెండ్లీగా ఉంటున్నానని కేసీఆర్ అభ్యంతరం. హైదరాబాద్ ఇద్దరిదీ అని, గవర్నర్ ఇద్దరివాడు అని వీళ్లకు గుర్తున్నట్టు లేదు! రాజ్‌భవన్‌కి ఆయనొస్తే ఈయన రాడు. ఈయనొస్తే ఆయన రాడు. వచ్చినా, నా మొహం చూస్తుంటారు తప్ప మొహమొహాలు చూసుకోరు! పిల్లలా? ముఖ్యమంత్రులా? ఇండిపెండెన్స్ డే ‘ఎట్-హోమ్’కి ఇద్దరూ డుమ్మా కొట్టారు. కోపాలుంటే మాత్రం సంప్రదాయాల్ని మర్చిపోతామా?
ఢిల్లీ నుంచి అజిత్ దోవల్ ఫోన్ చేశాడు. ఐపీఎస్‌లో నా బ్యాచ్‌మేట్. ‘ఏంటి గురూ... ఏదో వింటున్నా’ అన్నాడు. ‘ఏం విన్నావ్?’ అన్నాను. ‘కొత్త గవర్నర్ వస్తాడంట’ అన్నాడు. నవ్వాను. తిరుమల బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ఉంటాయి. ఫ్యామిలీని తీసుకుని రారాదూ’ అన్నాను. అజిత్ వస్తే అటు కనకదుర్గమ్మ నవరాత్రులకూ వెళ్లి రావచ్చు. తెలంగాణ మూవ్‌మెంట్ ఉన్నంత కాలం ‘ఈ గవర్నర్ యాంటీ తెలంగాణ’ అన్నారు తెలంగాణ నాయకులు. తెలంగాణ వచ్చాక, ‘ఈ గవర్నర్ యాంటీ ఆంధ్రా’ అంటున్నారు ఆంధ్రా నాయకులు. ఎక్కడైనా గవర్నర్ పాలన ఉంటుంది. ఇక్కడేమిటో యాంటీ గవర్నర్ పాలన!
-మాధవ్ శింగరాజు