ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా? | government neglecting handicapped students | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా?

Published Sat, Nov 28 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా?

ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా?

ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం.  తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు  ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ.  
 
తల్లిగర్భం ధరించినప్పటినుంచి ఐదేళ్ళ వరకు తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అందేలా చూడటం కూడా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఫ్లోరైడ్ రహిత, రక్షిత తాగునీటిని అందించాల్సిన బాధ్యత సైతం ఏలికలదే. వీటిలో ఏ ఒక్క విషయంలో పాలకులు తమ బాధ్యత మరిచినా  దాని దుష్ర్పభావం చిన్నారుల జీవితాలపై పడుతుంది. మరి మనచుట్టూ వివిధ రకాలైన వైకల్యాలతో పుట్టిన చిన్నారుల పట్ల దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంటే దానిని ఏమనాలి? వైకల్యం ప్రకృతి ఇచ్చిన శాపమైతే, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండడం సమాజం ఇచ్చిన మరో శాపం కిందే పరిగణించాలి.  
 
అలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా ఒక లక్షా 30 వేల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం వారు దాదాపు 2 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. మూగ, చెవిటి, అంధత్వం లాంటి వివిధ రకాలైన అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక అవసరాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. అయితే వారి అవసరాలకు తగిన విధంగా అన్ని అవకాశాలున్న పిల్లల మాదిరిగానే విద్యా వకాశాలను కల్పించాలని వారి కోసం అనేక చట్టాలు చేసింది.
 
1992లో వచ్చిన భారత పునరావాస మండలి చట్టంలోని 27, 28, 30, 31 సెక్షన్లు వికలాంగుల విద్యాభివృద్ధికి తోడ్ప డేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని సూచిస్తుంది. 1999 లో వచ్చిన జాతీయ ట్రస్ట్ ప్రకారం తల్లిదండ్రులు లేని వికలాంగులైన పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకొని వారి బాధ్యతలను చూడాలని చెపుతోంది. వీటితోపాటు విద్యా హక్కు చట్టంలో కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్ని రకాలుగా విద్యావకాశాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు ఈ పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలాగే కేవలం శిక్షణ కలిగిన మహిళా టీచర్లు మాత్రమే వీరికి బోధించాల్సి ఉం టుంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదని తెలంగాణ ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆరోపిస్తోంది. విద్యాహక్కు చట్టం (2009), ప్రాథమిక హక్కు 21(ఎ) చట్టాలు కూడా అమలు కావడం లేదు.
 
ఇందులో 2009 నాటి చట్టంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు నాటి మానవవనరుల అభివృద్ది మంత్రి గొప్ప ఆశను కల్పించే అంశాన్ని ప్రతిపాదించారు. పాఠశాలకు హాజరు కావడం కూడా సాధ్యంకాని స్థితిలో ఉన్న బాల బాలికలకు ఇంటి దగ్గరే చదువు నేర్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేకపోయింది. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉచిత నిర్బంధ విద్య కూడా ఉంది. అది కూడా అమలు జరగడం లేదు. ఇలాంటి హామీలు అమలు కాకపోతే ప్రధానంగా నష్టపోయేది ప్రత్యేక అవసరాలు కలిగిన ఇలాంటి చిన్నారులే.
 
 సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల కారణంగా కొందరు బాలలు ఇంటి వద్ద అక్షరానికి నోచుకుంటున్నా, పాఠశాలలకు వెళ్లే సమ యానికి వారికి కొన్ని వాస్తవికమైన ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. వీరి స్థాయినీ, పరిస్థితినీ అర్థం చేసుకుని బోధించగల, ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యా యులు అక్కడ ఉండడం లేదు. ఇదొక విషాదం. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి అక్ష రాస్యత మీద ఆధారపడి ఉందన్న మాట నిజమే కానీ, ఇలాంటి శాపగ్రస్త బాలలకు చదువు గొప్ప వరమవుతుంది. ఆ అవసరం వారికి ఇంకాస్త ఎక్కువ. వారిలోని నిరాశా నిస్పృహలను తొలగించి, కొత్త జీవితం సంతరించుకుని, ఆత్మగౌరవంతో బతకడానికి వీరికి చదువు మరీ మరీ అవస రమన్న సంగతి ఇప్పటికైనా గుర్తించాలి. ఈ అంశం మీద ప్రజా చైతన్యం అత్యవసరం. ఇది అలాంటి బాలబాలికలను కలిగి ఉన్న తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. మొత్తం సమాజం దీనిని తమ బాధ్యతగా స్వీకరించి, వారిని తమతో సమంగా నడిచేటట్టు చేయడం కోసం కనీసం ప్రయత్నించాలి.
 
నిజానికి ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి బాలల పట్ల దృష్టి పెట్టింది. ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం- 2007 అందుకు సంబంధించినదే. దీని ప్రకారం  సమితిలోని సభ్య దేశాలన్నీ వికలాంగ బాలల సమస్యలను పరిష్కరించి, వారికి కూడా అభివృద్ధి ఫలితాలు అందేలా చేయాలి. దీనిని నాటి కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగిపోయింది. కానీ అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది.
 
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది మూగ, చెవిటి, అంధ, మానసిక వైకల్యం గల పిల్లలున్నా వారి సంఖ్యకు తగిన విధంగా పాఠశాలలు లేవు. వీరికోసం ప్రత్యేకించిన కళాశాల ఒక్కటి కూడా లేదు. వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సౌకర్యాలు అంతంత మాత్రమే.  వీరి లాంటి విద్యార్థులకు బోధించడానికి అవసరమైన ప్రత్యేక అర్హతలు కలిగిన ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ప్రభుత్వం తయారు చేయలేదు. ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం.  తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు ఇక్కడ ఎక్కువ.  ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అని ఒక పేరు పెట్టినా ఆ విధంగా ఈ నిర్భాగ్యులను ప్రభుత్వం కనికరించడం లేదు. కనీసం అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు అక్రమమార్గంలో సౌకర్యాలు పొందుతున్నా, అలాంటి అనైతిక వర్తనను కూడా ప్రభుత్వాలు అరికట్టలేక పోతున్నాయంటే, ఈ పిల్లల పట్ల ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది.
 
ఈ అంశంలో అలాంటి అవినీతిపరుల కన్ను తెరిపించే చర్యలు కూడా అవసరమే. వికలాంగులకు ఇప్పటికే ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్ ని పది శాతానికి పెంచాలని, వీరికోసం ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని, వీరికి ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులను నియమించా లంటూ వస్తున్న డిమాండ్లు ఎంతో సమంజసమైనవి. కొత్త రాష్ట్రం ఏర్పడడం సంతోషదాయకమే. కానీ పాత సమస్యలు అలాగే మిగిలిపోతే తెలంగాణను సాధించుకున్న ప్రయోజనం నెరవేరుతుందా?
 - అత్తలూరి అరుణ
 (ఈ నెల 29వ తేదీన ఇందిరాపార్కు వద్ద వేలాది మంది మూగ, చెవిటి, అంధ పిల్లలతో భారీ బహిరంగ సభను తలపెట్టిన సందర్భంగా ...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement