వాళ్లకు ఇప్పటికి గుర్రం దొరికింది మరి! | Gurram jashuva birth annivarsary on September 28 | Sakshi
Sakshi News home page

వాళ్లకు ఇప్పటికి గుర్రం దొరికింది మరి!

Published Sun, Sep 27 2015 1:14 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

వాళ్లకు ఇప్పటికి గుర్రం దొరికింది మరి! - Sakshi

వాళ్లకు ఇప్పటికి గుర్రం దొరికింది మరి!

 సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జయంతి
వారి పుస్తకాల్లోనే కాదు, రచయితల జీవితంలోనూ కావాల్సినంత సాహిత్యం దొరుకుతుంది. అయితే, మన దగ్గర ఎందరో రస హృదయులు ఉన్నా కూడా, ‘లేఖక స్పృహ’ లేకపోవడం వల్ల, ఎన్నో రుచిగొలిపే సాహిత్య మొరమొరాలు రికార్డు కాకుండాపోయాయి. రచయితల్ని మరింత సన్నిహితంగా అర్థం చేయించే రసవద్ఘట్టాలు  నమోదు కావాలి! జాషువా జయంతి సందర్భంగా, ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు ‘అన్నమయ్య గ్రంథాలయం, గుంటూరు’
 (ఫోన్: 9440320580) వారి సౌజన్యంతో:
 
 జాషువాతో మొదటి పరిచయంలోనే సంజీవ్‌దేవ్ ‘‘మీకు అంత పెద్ద మీసాలు లేకుంటే ఎంత బాగుంటుందో’’ అన్నారు. జాషువా కొనవేలితో మునిమీసాలను ఎగదువ్వుతూ, ‘‘జాషువా తనలో కవిత్వం లేకపోయినా సహించగలడు కాని మీసాలు లేనిది మాత్రం సహించలేడు’’ అని పెద్దగా నవ్వారు.
 అంటరానివాడనే కారణంతో జాషువాని ఆటలలోకి రానివ్వని తోటి విద్యార్థిని యీడ్చి చెంపపై కొట్టి ‘‘సోదరా! ఈ దెబ్బ నీకు కాదు; నీలోని కులభేదానికి’’ అన్నారు.
 
 గుంటూరు పట్టణంలో ఏకా దండయ్య  పంతులు ‘ప్రాడ్యివాక శిరోమణులు’, ‘గుప్తదాన శౌండులు’. వారి తల్లి రుక్మిణమ్మకు అంకితం జాషువా ఖండకావ్యాల మొదటి సంపుటి. అందలి మొదటిపద్యం ‘సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్పినట్టి సాధ్వి’ని చదివించుకొని పంతులు జేబులో చెయ్యిపెట్టి 20 రూపాయలు కవికట్నంగా సమర్పించుకొనేవారు. ఒక మారు, రెండు మార్లు కాదు, పలు తడవలు జరిగాక ఎవరో వాచాలుడు ఊరుకోక, ‘‘కవిగారూ! ఒక్క పద్యం చదివితేనే 20 రూపాయలు ఇస్తున్నారే పంతులుగారు, మీకేమనిపిస్తుంది?’’ అన్నాడు. జాషువా తడుముకోకుండా ‘‘ఏమనిపిస్తోందా? మా పంతులుగారి జేబులో ఎప్పుడూ 20 రూపాయలేనా వుండేవి అనిపిస్తుంది’’ అని ఫెళ్లున జవాబిచ్చారు.
 
 గాంధీజీ అంటే గొప్ప గౌరవం జాషువాకి. ఒకమారు ఆయన దర్శనార్థం వార్ధా ఆశ్రమానికి వెళ్లారు. గాంధీజీ సన్నిధిలో ఆ సమయానికి జర్మన్ పండితుడొకాయన ఉన్నాడు. ఒక రాజకీయనాయకుడు జాషువాని ‘‘దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయెట్’’ అని పరిచయం చేస్తే ఆ పండితుడు అయోమయంగా ముఖం పెట్టారు. ఆ సంఘటనని జాషువా ఆ తర్వాత మిత్రునితో చెబుతూ, ‘‘కవితకు కులమతాలు అంటగట్టడం ఎలాంటి సభ్యతో అర్థం కాదు’’ అన్నారు.
 
 ఏకా ఆంజనేయులు- జాషువా అన్నా, జాషువా కవిత్వమన్నా పరవశించిపోయేవారు. ఎంత డబ్బు ఇచ్చినా నిలుపుకోవటం లేదని గుంటూరులో ఒక యిల్లు కట్టించి యిచ్చారు. పైగా గుంటూరులో ఏ హోటల్‌లోనైనా గుర్రం జాషువా తిని, బిల్లు వెనుక ‘గుజా’ అని వ్రాలు చేస్తే, ఆంజనేయులే బిల్లు చెల్లించేవారు. హిందూ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదవడానికి గుంటూరు వచ్చిన బూదరాజు రాధాకృష్ణ ఒకరోజు వొళ్లెరగని జ్వరాన పడ్డాడు. మూడు రోజులుగా ‘రైల్వేస్టేషన్ సాహితీ సభ’కు బూదరాజు రాకపోవడంతో సంగతేంటో చూద్దామని జాషువా ఆయన గదిని వెతుక్కుంటూ వెళ్లేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అమాంతం భుజాన వేసుకుని డాక్టర్ ఆమంచర్ల చలపతిరావు వద్దకు మోసుకు వెళ్లడమే కాదు, తర్వాతి నాలుగు రోజులూ తల్లిలా సంరక్షించారు జాషువా.
 
 ఆంధ్రవిశ్వవిద్యాలయం విశ్వనాథ సత్యనారాయణకు ‘కళాప్రపూర్ణ’ ఇచ్చిన తర్వాత, జాషువాకు కూడా దాన్ని ప్రదానం చేసింది. ఈ సంగతి తెలిసిన విశ్వనాథ తనదైన శైలిలో విరుపుగా, ‘‘గుర్రాన్నీ గాడిదనూ ఒకే గాటన కట్టారన్నమాట!’’ అన్నారు. అది ఎవరినోటో విన్న జాషువా, ఏమీ తొణక్కుండా, ‘‘వాళ్లకి ఇప్పటికి గుర్రం దొరికింది మరి’’ అని తిప్పికొట్టారు. జాషువా ఇంటిపేరులో ఉన్న ‘గుర్రం’ వల్ల ఈ వ్యాఖ్యకి మరింత సొగసు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement