మరణం లేని వీరుడు చేగువేరా
అర్జెంటీనా క్యూబా గుండెల కొండల నడుమ నుంచీ ప్రభవించిన సూర్యగోళం!
కొన్ని ప్రమాద విపత్కర సన్నివేశాల్లో
నీ సాహసానికి పర్వతాలు సైతం సాగిలపడాల్సిందే
ఆస్తమాని -యజమాని మాట వినే పెంపుడు వేటకుక్కే గదా!
పాము కుబుసం విడిచినట్టు సామ్రాజ్యవాదుల గుండెల్లో భయం రైళ్లు పరుగెట్టించావ్
క్షతగాత్రులైన వారిని ఆయుధాలుగా మలిచావ్
గెరిల్లా పోరుదారిలో పచ్చ రక్తనాళాల్లో
ఎర్రరక్త ప్రవాహాలు పుట్టించావ్
ఏకాకులైన ప్రజలకి నీ ఆత్మీయతను జతచేశావ్
మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతాం
నీకు చావంటే భయంలేదు
మరణం అంచున పరిహసిస్తావ్
చావు నీ దగ్గర దగా పడి ముఖం తిప్పుకుంది
నీ విషయంలో మృత్యువు వాయిదా పద్ధతిలోకొచ్చింది.
మాలో మేం బ్రతుకుతాం
నా వృత్తి పిల్లలకు బొమ్మలు నేర్పటం
ఏదో నెలకు ఆరు రాళ్లు, పద్దెనిమిది కొమ్ములు... తరువాత నీళ్లొదిలేయటం
ఇంతటితో మా తెలుగు సినిమా పూర్తవుతుంది
నీ అనన్యత అలాంటిది కాదుగదా చే
నువ్వు మరణంలో కూడా ఎదగగలవ్
అందరికీ మేలు చేసే వృత్తివిప్లవకారుడవు నువ్వు
నీ త్యాగానికి హద్దులు లేవు, నీ కార్యాలు అల్పమైనవి కావు..యుద్ధంలో వీరుడ్ని చంపలేరు
మహా అయితే కుట్రతో తప్ప!
జనం అశ్రుధారలతో, జ్వలించే గుండెనెత్తురులతో
నీ మరణం ప్రాణప్రతిష్ట పొందింది
నువ్వు అమరుడవు
నీ అమరత్వం బహు రమణీయం
(నేడు చేగువేరా వర్ధంతి సందర్భంగా...)
‘‘సరిశాసి’’ (ఎన్.సర్వేశ్వర్రావ్), కంచికచర్ల, మొబైల్: 9391996005