బుష్ కాలం నుంచి అమల్లో ఉన్న ‘రాండ్ డాక్ట్రిన్’ను తిరగేసి హిల్లరీ సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఇరాన్-ఇరాక్-సిరియాల షియా అనుకూల కూటమికి విరుగుడుగా సున్నీ ఉగ్రవాద మూకలను పెంచి పోషించి, ప్రభుత్వాలను కూల్చే, మార్చే ఆటకు తెరదీశారు.
అమెరికాపై చరిత్ర పగబట్టినట్టుంది. వియత్నాం నుండి ఇరాక్, అఫ్ఘానిస్థాన్, సిరియా, ఉక్రెయిన్‌ల వరకు అది ‘లోక కళ్యాణం’ కోసం ఏంతలపెట్టినా లక్షించినది సిద్ధించలేదు. గరళాన్ని మించిన చేదు ఫలితాలను దింగమింగక తప్పలేదు. ఇరాక్‌లో ‘పేట్రేగుతున్న ఐఎస్‌ఐఎస్’ భూతాన్ని మట్టుబెట్టబూ నితే అదీ బెడిసికొట్టక తప్పనట్టే ఉంది. లేకపోతే దశాబ్దాల శతృత్వాన్ని మరచి ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తే చుక్కెదురవు తుందా? ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా ఆలీ ఖమేనీ దాని శీలాన్ని తప్పు పడతాడా? ‘ఇరాక్ అమెరికా శిబిరంలో చేరడమా? లేక స్వతంత్ర ఇరాక్‌ను వాంఛించేవారితో చేరాలా? అనేదే నేటి సంక్షోభం సారం. తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తేవాలనేదే అమెరికా తాపత్రయం’ అని ఖమేనీ ఆదివారం ప్రకటించారు. ఐఎస్‌ఐఎస్‌పై పోరాటానికి తమ ఎలైట్ బలగాలను పంపిన ఆయన ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులను అంగీకరించేది లేదని తేల్చేశారు. పైగా ఇది మత పోరు కాదు, ఆధిపత్య పోరని ప్రకటించారు. ఇక ఇరాన్ సైనిక దళాల అధిపతి మేజర్ జనరల్ హసన్ ఫిరోజాబాది ‘ఐఎస్ ఐఎస్ హిల్లరీ క్లింటన్ మానస పుత్రిక. అది షియా, సున్నీల మధ్య యుద్ధాన్ని వాంఛిస్తోంది. అందుకే ఇరాన్-అమెరికా సహకారం అర్థరహితం’ అంటూ బాంబు పేల్చారు.
ఇంతకూ అమెరికా విదేశాంగ మంత్రి పదవికి సలాం కొట్టి తన మానాన తాను బతుకుతున్న హిల్లరీని ఫిరోజాబాదీ ఎందుకు రచ్చకెక్కిస్తున్నట్టు? ‘హార్డ్ ఛాయిసెస్’ (సంక్లిష్ట సందిగ్ధాలు) పుస్తకం రాసుకుని అమ్ముకోడానికి కష్టపడుతున్న ఆమెను కష్ట పెట్టడం తగునా? ఈ నెల పదిన విడుదల కావాల్సిన ఆ పుస్తకం ముందుగానే... సరిగ్గా ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ సృష్టించిన సంక్షోభంతో పాటే ‘లీకయింది’. ఇరాక్‌పై ఒబామా వైఖరి పూర్తిగా సరైనదంటూ ఆ పుస్తకంలో కితాబులిచ్చిన హిల్లరీ... సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చ డం కోసం ఆయన మిలిటెంట్లకు సహాయాన్ని అందించకపోవ డాన్ని తప్పుపట్టారు. ఇరాక్‌పై ఒబామా వైఖరి మాత్రం నేటి వరకు సరైనదేనని సూచించారు. 2010 ఎన్నికల్లో ప్రధాని నౌరి అల్ మలికి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రత్యర్థి అలావీయే పై చేయి సంపాదించారనేది బహిరంగ రహస్యం. నేటి ‘షియా ఉన్మాది, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించగల ప్రభుత్వానికి నేతృత్వం వహించే శక్తిలేని’ మలికిని దొడ్డిదారిన గెలిపించినది ఒబామా. అది 2002 నుంచి బుష్ అనుసరించిన ‘రాండ్ డాక్ట్రిన్’ (విధానం) కొనసాగింపు. అది 9/11 ఉగ్రవాద దాడుల తదుపరి అరబ్బు ప్రపంచంలో అమెరికా అనుసరించాల్సిన విధానాన్ని సూచించింది. నేడు మొసుల్, తిక్రిత్ వంటి నగరా ల్లో షియాలపట్ల సున్నీలలో రగులుతున్న తీవ్ర విద్వేషాలకు అదే కారణం. ఆ నగరాలన్నిటా అప్పట్లో సున్నీల ఊచకోత సాగింది. ఆ ఘనకార్యానికే నోబెల్ ‘శాంతి’ దూత ఒబామా మలికికి రెండోసారి పట్టంగట్టారు. హఠాత్తుగా ఇప్పడు ఎందుకు ఆయనపై కన్నెర్ర చేస్తున్నట్టు? ‘రాండ్ డాక్ట్రిన్’ చెత్తబుట్టకు చేరి, ‘హిల్లరీ డాక్ట్రిన్’ అమలులోకి వచ్చింది కాబట్టి.
మలికి అమెరికా కీలుబొమ్మగా మిగిలిపోక తోటి షియా దేశమైన ఇరాన్‌తో చెయ్యి కలిపారు. ఇరాన్‌కు ఇటు సిరియాతోనూ అటు రష్యాతోనూ ఉన్న అనుబంధం అందరికీ తె లిసిందే. ఎప్పటిలాగే అమెరికా ఆశించినదానికి విరుద్ధంగా ‘దుష్ట రాజ్యం’ ఇరాన్ ప్రాంతీయశక్తిగా బలపడింది. పైగా అసద్‌తో సైతం మలికి చేయి కలిపాడు! కాబట్టే ‘పెంటగాన్ ప్రియతమ నేత’ హిల్లరీ రాండ్‌డాక్ట్రిన్‌ను తిరగేసి అమెరికాకు సరికొత్త విధానాన్ని రూపొందించారు.
ఇరాన్ - ఇరాక్ - సిరియాల షియా అనుకూల కూటమికి విరుగుడుగా 9/11 దాడులకు కారణమైన సున్నీ ఉగ్రవాద మూకలను పెంచి పోషించి, ప్రభుత్వాలను కూల్చే, మార్చే ఆటకు తెరదీశారు. హిల్లరీ అయితే సిరియాలో సైనిక జోక్యం చేసుకొనేదంటూ సౌదీ, ఇజ్రాయెల్ నేతలు ఒబామాను పిరికి అధ్యక్షునిగా ఊరికే దుయ్యబట్టలేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చే కథ అడ్డం తిరగడానికి ఒబామాయే కారణమని ‘సంక్లిష్ట సందిగ్ధాలు’లో హిల్లరీ స్పష్టంగానే ధ్వనించారు. సిరియాలో చేసిన తప్పును ఒబామా ఇరాక్‌లో ‘దిద్దుకుంటున్నారు’. ఆదిలోనే హంసపాదులా ‘హిల్లరీ మానస పుత్రిక’ సైతం చిక్కుల్లోపడింది. ఇరాన్ అమెరికా ఐఎస్‌ఐఎస్ వ్యతిరేక పోరాటం బుట్టలో పడ లేదు సరికదా... సౌదీ అరేబియా సైతం అమెరికా సైనిక జోక్యానికి అడ్డు చెబుతోంది. ఇరాన్, అమెరికాలు ఒక పక్షాన నిలవడం కాదుగానీ... ఇరాన్, రష్యా, సౌదీలు ఒక్కటై నిలిచే అవకాశాలు తెరుచుకుంటున్నాయి. భావి అధ్యక్షురాలుగా వెలిగిపోతున్న హిల్లరీ భవిష్యత్తు ఇరాక్‌లో తేలే పరిస్థితి ఏర్పడింది.
- పిళ్లా వెంకటేశ్వరరావు
హిల్లరీకి ఇరాక్ అగ్నిపరీక్ష
Published Tue, Jun 24 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM
Advertisement
Advertisement