నాడు వంచన... నేడు వక్రభాష్యం... | Hypocrisy on rayala seema people | Sakshi
Sakshi News home page

నాడు వంచన... నేడు వక్రభాష్యం...

Published Sun, Oct 6 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Hypocrisy on rayala seema people

ఇమామ్

సంపాదకులు, కదలిక

 

గతంలో చేసుకున్న ఒప్పందాలు, అమలుచేయాలనుకున్న పథకాలు సాకారం కాలేదు కాబట్టి నేడు రాయలసీమకు కృష్ణాజలాల్లో హక్కే లేదంటూ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు ‘సాక్షి’లో రాశారు. నేడు రాయలసీమలో అమలు జరుగుతున్న తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట ప్రాజెక్టు కేటాయింపులు, అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు- వీటన్నింటి మీద సీమవాసులకు ఉన్న హక్కు కాదనలేనిది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి కేటాయింపులన్నీ మిగులు జలాలతో ముడిపడి ఉన్నందున, వాటి కోసం కోస్తా, తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాల మీద సీమ ఆధారపడి ఉండాలని విద్యాసాగర్‌రావు అభిప్రాయంగా కనిపిస్తోంది.
 
 హామీలన్నీ నీటి మూటలే!
 
 తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే సీమకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్న దశలో 1956లో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేశారు. రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. మెకంజీ (తుంగభద్ర పథకం 1901), శ్రీభాగ్ (1936) ఒప్పందం, కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం నిర్మించాలంటూ ఖోస్లా కమిషన్ చేసిన ప్రతిపాదన, గండికోట ప్రాజెక్టును 60 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని, కేసీ కెనాల్ 6 వేల టీఎంసీల సామర్థ్యంతో ఆధునీకరణ సిఫార్సులు- అన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ 1956కు మునుపు రాయలసీమకు నికర జలాల కేటాయింపులు చారిత్రక వాస్తవం. ఈ అంశాలేవీ ప్రస్తావించకుండా రాయలసీమలో నిరంతరం కరవులు ఉన్నాయని, కాబట్టి సీమవాసులు ఆ దుస్థితిలోనే జీవించాలని విద్యాసాగర్‌రావు సెలవిచ్చారు.
 
 అందుకు ఆయన ‘కదలిక’ ప్రత్యేక సంచిక ‘తరతరాల రాయలసీమ’లోని వ్యాసాలను సాక్ష్యంగా చూపుతున్నారు. ఆ సంచికలో కరవుల గురించి మాత్రమే వ్యాసాలు లేవు. కరవు పరిష్కారాలు, సీమతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల నీటి అవసరాలను ఎలా తీర్చవచ్చో చెప్పే వ్యాసా లూ ఉన్నాయి. రాష్ట్రంలోని జలవనరుల వినియోగం ద్వారా తెలంగాణ, కోస్తాం ధ్ర, రాయలసీమలోని ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు ఎలా తీర్చవచ్చో వివిధ సందర్భాలలో ప్రచురించడం జరిగింది. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో వ్యాసాలు ప్రచురించడం, ఉద్యమాలు చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఒక ఒక ఉదాహరణ. 1990లో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి రాష్ట్రంలోని పది మంది రిటైర్డు చీఫ్ ఇంజనీర్లను సమావేశపరిచి, కృష్ణ నీటిని ఎగువన ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమ జిల్లాల అవసరాలు తీర్చడంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో పంటమార్పిడి ద్వారా దాదాపు 190 టీఎంసీల నీటిని ఎలా ఆదా చేయ వచ్చునో, ఆ నీటిని నికరజలాలుగా రూపొందించవచ్చునో చెప్పే నివేదికను రూపొందించారు. ఆ నివేదికలో శ్రీశైలం ఎడమగట్టుకు 30, గాలేరు-నగరికి 40, హంద్రీ-నీవాకు 40, భీమా ఎత్తిపోతల పథకానికి 20, వెలిగొండ ప్రాజె క్టుకు 40, తుంగభద్ర సమాంతర కాలువకు 20 టీఎంసీలు కేటాయించవచ్చనే విలువైన ఆయుధం రాయలసీమ, తెలంగాణ ప్రజల చేతికి అందించారు.
 
 నల్ల గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలని డాక్టర్ వైఎస్ గౌరవాధ్యక్షులుగా కొనసాగిన రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తీర్మానాలు చేశారు. వాస్తవాలు ఇలా ఉండగా, సీమ వాసులు నేడు కృష్ణా నీటిపై హక్కు కేవలం తెలంగాణ, సీమాంధ్రవాసుల ఔదా ర్యంపై ఆధారపడాలని విద్యాసాగర్‌రావు సెలవివ్వడం ఏ రకమైన విజ్ఞత? గోదావరి జలాల మళ్లింపు ద్వారా రాయలసీమ, తెలంగాణ సేద్యపు నీటి అవసరాలు ఎలా తీర్చవచ్చో డాక్టర్ వైఎస్ జలయజ్ఞంలో చూపించారు. పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 230 టీఎంసీల నీటిని కృష్ణలోకి మళ్లించి  శ్రీశైలం, నాగార్జునసాగర్ ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటిని ఎగువన రాయలసీమ, తెలంగాణలకు వినియోగించవచ్చునన్న సదాశయంతో జలయజ్ఞం చేపట్టారు.
 
 ఆత్మద్రోహం తగునా!
 
 2004 నుండి 2013 జూన్ వరకూ జలయజ్ఞంలోని ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల వివరాలు పరిశీలిద్దాం. ఆంధ్రలో రూ.20 వేల 230, తెలంగాణలో రూ.35 వేల 28, రాయలసీమలో రూ.18 వేల 180 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే వైఎస్ ఐదు ప్రాజెక్టులను చేపట్టారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని కృష్ణ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కరవు పీడిత ప్రాంతాలకు తరలించిన సందర్భాన్ని ఈ విద్యాసాగర్‌రావే విప్లవాత్మకమైన చర్యగా డాక్టర్ వైఎస్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీవీలో పేర్కొన్నారు. చీఫ్ ఇంజనీర్‌గా ఇది సాధ్యమని తాను భావించలేదని, అయితే అది సాధ్యమేనని వైఎస్ రుజువు చేశారని సెలవిచ్చిన విద్యాసాగర్‌రావు, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమవాసులు దొంగతనంగా నీటిని మళ్లిస్తున్నారని ఆరోపించ డం ఆత్మద్రోహం కాదా? ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల అభ్యంతరాలు ఇప్పటికే ఉన్నాయి. వీటికి తోడు తెలంగాణ ఏర్పాటు పేరుతో ఇప్పటికే సంకుచితంగా వ్యవహరిస్తూ సీమాంధ్రులను అవహేళన చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్న కొందరు స్వార్థపరులు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ, తెలంగాణలో ప్రాజెక్టులన్నీ సమైక్య రాష్ట్రం ద్వారానే సాకారం చేసుకోవచ్చు. ఒక సాంకేతిక నిపుణుడిగా ఆలోచిస్తే విద్యాసాగర్‌రావుకి అన్ని అంశాలు అవగతమవుతాయి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement