అసాధారణం ఆయన ప్రజాప్రస్థానం
సందర్భం
దేశ రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పద్నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురానికి సాగిన ఆ పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ కీయాలనే మలుపు తిప్పింది. కుల బలం, ధనబలం, గ్రూప్ రాజకీ యాలు, ప్రాంతీయతత్వాల ముద్ర వేయించుకుని, అప్రతిష్టపాలైన కాంగ్రెస్ పార్టీకి నూతన జవ సత్వాలనిచ్చి, దాన్ని బడుగు బలహీన వర్గాల పార్టీగా, రైతుల సంక్షేమాన్ని కోరే పార్టీగా, జల సిరులతో జన సమైక్యతను సాధించే పార్టీగా మలచింది. ఆ పాదయాత్రలో ఆయన ఎన్నో అనుభవాలు చవి చూశారు. బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూసి చలించారు, పరిష్కారాలను అన్వేషించారు.
మండుటెండల్లో తూర్పు గోదావరి జిల్లాలో సాగిన యాత్రలో ఆయన ఎండ దెబ్బకు తీవ్రంగా జబ్బు పడ్డారు. అయినా తన సంకల్పాన్ని వీడలేదు. ఆయన పరిస్థితి ప్రజలకు, అభిమానులకు అందోళన కలిగించింది. కానీ విశాఖ ప్రాంత పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఉండవల్లి సూచనను తిరస్కరించి, ఆయనను పరామ ర్శించకుండానే తిరిగి వెళ్లారు. పార్టీ నాయకత్వం నుంచి ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎన్నిటినో వైఎస్ అనుభవించారు. అయినా ప్రజాశీర్వాదంతో, జేజేలతో ప్రాణాలను లెక్క పెట్ట కుండా తన ప్రజా ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిం చారు. చంద్రబాబు జన కంటక పాలనతో విసుగెత్తి, నిరాశలో ఉన్న ప్రజలకు ఆత్మ విశ్వాసాన్ని, నూతనోత్తేజాన్ని కల్పిస్తూ వైఎస్ పాదయాత్ర సాగింది. ఆయన పాద యాత్రను హేళన చేసి, విమ ర్శించిన శక్తులే ప్రజాప్రస్థానం రాష్ట్ర ప్రజల హృదయాలపై వేస్తున్న చెరగని ముద్రను గుర్తించక తప్పలేదు.
రాజశేఖర్‌రెడ్డి నిజానికి 35 ఏళ్ల వయస్సులో, 1986లోనే రాయలసీమ అభివృద్ధి సమస్యలపై లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుండి ఇచ్చాపురానికి జరిపిన ప్రజాప్రజాస్థానాన్ని 55 ఏళ్ల వయస్సులో ఏప్రిల్ మాసపు ఎండల్లో ప్రారంభించారు. పైగా ఇది దాదాపు 1,600 కిలోమీటర్లు. మండుటెండల్లో ఆ వయస్సులో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన జరిపిన ఈ పాదయాత్ర నూతన సాంప్రదాయానికి నాంది పలికింది. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు వైఎస్ ప్రజాప్రస్థానం ముందు తలవంచక తప్పలేదు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సాను కూల వాతావరణం కల్పించింది.
ప్రజల కోసం చేసిన ప్రజా ప్రస్థానం తనలోని కోపం అనే నరాన్ని తెంచేసిందని వైఎస్ స్వయంగా శాసనసభా ముఖంగా తెలిపారు. ఆయన జరిపిన పాదయాత్రలే మహ త్తరమైన జలయజ్ఞానికి పునాది వేశాయి. వింతువులకు, విక లాంగులకు పింఛన్లు, ఆరో గ్యశ్రీ, 108, 104, ఫీజు రీయిం బర్స్‌మెంట్, ఉచిత వివాహాలు, మైనార్టీలకు రిజర్వేషన్లను పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను కల్పించడానికి కావాల్సిన సంకల్ప బలాన్ని, సాహసాన్ని చేకూర్చాయి. ప్రజాప్రస్థానం ఇచ్చా పురానికి చేరుకోబోతుండగా వైఎస్ తన చేతుల మీదగా ‘నదుల అనుసంధానం’ అనే ఒక విశిష్ట సంచికను ఆవిష్కరించడం వ్యక్తి గతంగా నాకు వరం.
నేటి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ పాలన ప్రజా సంక్షేమమే పరమ ధ్యేయంగా ఒక స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. వైఎస్ ఎన్నికల ప్రణాళికలోని వాగ్దానాలనేగాక మరెన్నో సంక్షేమ పథకాలను విజ యవంతంగా అమలుపరచారు. ప్రజల పట్ల ఆయనలో అంతటి బాధ్యత, ప్రేమ, వాత్సల్యం, దయ, నిబద్ధత ఏర్పడటానికి ప్రజా ప్రస్థానమే ప్రధాన స్ఫూర్తి. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు రాష్ట్రం లోనే కాదు కేంద్రంలో సైతం అధికారంలోకి తీసుకు రావడానికి అవిరళ కృషి జరిపిన వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రుణపడి ఉండాల్సినవారే, ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు.
ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి, తప్పుడు కేసులు వేశారు. ఆయన తనయుడిని కూడా ఆ కేసులలో ఇరికించారు. చంద్రబాబుతో కలసి కాంగ్రెస్ పెద్దలు చేసిన ఈ అక్రమ అరోపణలను, వేధింపులనూ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల, వైఎస్సార్‌సీపీ పట్ల అనుసరించిన దుర్మార్గ విధా నాన్ని ప్రజలు తిరస్కరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజశేఖర్‌రెడ్డి ప్రాంతాలకు అతీతమైన జన సమైక్యతను సాధిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చివేసింది. వైఎస్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని బీజేపీ, వామ పక్షాలు, కాంగ్రెస్ సైతం నేడు వైఎస్ పాలనను గుర్తుకు తెచ్చు కుంటుండటమే ఆయన గొప్పదనానికి నిదర్శం. వైఎస్‌ను అంతటి అసమాన ప్రజానేతగా నిలిపిన ప్రజాప్రస్థానం స్ఫూర్తితో ఆయన బాటన సాగడమే ఆయనకు నిజమైన నివాళి.
ఇమామ్
వ్యాసకర్త కదలిక సంపాదకులు-9989904389