ఇన్ బాక్స్
అందరూ ఆ కళామతల్లి బిడ్డలే, అందరూ కళాకారులే కానీ ఒకళ్లు అంటే ఒకళ్లకు విభేదాలు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అధ్యక్ష పదవి కోసం ఒకళ్లపై ఒకళ్లు దుమ్మెత్తిపోసుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇంత వరకూ మా అసోసియేషన్‌కు భవనం లేకపోవడం దురదృష్టకరం. వృద్ధ, పేద కళాకారులకు సరైన సహకారం వైద్య సదు పాయం అందటంలేదని ఇప్పుడు అందరూ ప్రకటించడం గమనార్హం. మరి ఇన్నాళ్లు, ఈ విషయాలు బయటకు రాకపోవడం గమనార్హం. కేవలం 700 ల మంది సభ్యులున్న ‘మా’ లో 7 గ్రూపులు. ఇక విభేదాలు, ఆరోపణలు చెప్ప నక్కర్లేదు. ఇక ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపి స్తున్నాయి. ‘మా’ ఎన్నికలు పూర్తయ్యే వరకూ, ఎప్పుడు ఎవరు ఎవరి వైపు మాట్లాడతారో ఎవరి వైపు ఉంటారో తెలియని అనిశ్చితి. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు పెట్టుకొని తిట్టుకోవడం, విమర్శిం చుకోవడం చూసేవాళ్లకు చిన్న పిల్లలు కొట్లాడుతున్నట్టుంది.
ఇవన్నీ ప్రేక్షకులకు మా అసోసియేషన్ వాళ్లు చూపిస్తున్న సిన్మా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఎందరో బీద కళాకారులకు, వృద్ధ కళాకారులకు అండగా ఉండి ఆదుకోవాల్సిన మా అసోసియేషన్ ఇలా రోడ్డునపడి, పదవుల కోసం విమర్శలు చేసుకోవడం ఏమీ బాగాలేదు. ఏదిఏమైనా, ఎవరు గెలిచినా పేద కళాకారులకు అండగా ఉండి వాళ్లకు ఆసరాగా ఉండాలని అందరం ఆశిద్దాం!
- ఎస్.విశ్వనాథం, హెదరాబాద్